రిటర్న్ వేసేశారా! మార్చుకోవచ్చులెండి!!
- ఎన్నిసార్లయినా మార్చుకోవడానికి అవకాశమిస్తున్న ఐటీ విభాగం
- 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం)
అరె! నిన్న ఫైల్ చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఎల్‌ఐసీ పాలసీ వివరాలు పూర్తిగా ఇవ్వలేదే!!. రిఫండ్ క్లెయిమ్ చేస్తూ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ సంఖ్యలో తప్పు దొర్లిపోయిందే!! ఇప్పుడెలా? ఇలా ఆలోచించేవారు చాలామంది. కానీ ఆన్‌లైన్లో ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే ఇక అంతే!. అందుకే... ఇలాంటి వారికోసమే ఐటీ శాఖ ఇపుడు దాఖలు చేసేసిన రిటర్న్ ఫారాల్లో తప్పులుంటే దిద్ది మరోసారి... అదీ కాకుంటే ఇంకోసారి... ఇలా ఎన్నిసార్లయినా దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఐటీ రిటర్న్‌ను గడువు తేదీలోగా దాఖలు చేసిన వారు ఆ తరవాత తాము మరచిపోయిన సమాచారాన్ని చేర్చడమైనా, అప్పటికే ఇచ్చిన సమాచారాన్ని తొలగించడమైనా... ఏదైనా చేయొచ్చు. ఇలా ఎన్ని సార్లయినా మార్చి సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది ఐటీ విభాగం. 2015 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లు వేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 31. ఈ లోగా దాఖలు చేసినవారందరూ... ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు కావలసినన్ని సార్లు తమ రిటర్న్‌లు సవరించుకోవచ్చు. అయితే రెండేళ్ల తరవాత మాత్రం ఆ అవకాశం ఉండదు.
దీనిపై ‘మేక్‌మై రిటర్న్స్ డాట్‌కామ్’ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ రామ్‌చంద్ మాట్లాడుతూ... ‘‘నా క్లయింట్ ఒకరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆయనకు రిటైర్మెంట్ పొదుపు ఖాతా 401(కె) ఉంది. గతేడాది ఆయన ఇండియాలో ఉండి ఐటీఆర్-1 ఫారాన్ని నింపారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరికైనా విదేశాల్లో ఆస్తులుంటే వారు ఐటీఆర్-2 నింపాలి. తొలుత సకాలంలో రిటర్న్‌లు వేసేశారు కనక ఆయన ఇపుడు సవరించి కొత్తది దాఖలు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. పన్ను చెల్లింపుదారు మూలధన నష్టాలను ఎనిమిదేళ్లపాటు కొనవచ్చని, ఈ లోగా మూలధన లాభాల నుంచి తీసివేయవచ్చని ఇటీవలే వచ్చిన కోర్టు తీర్పును ఆయన ఉదహరించారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రిటర్న్‌లో ఇలాంటి మార్పులు చేసుకోవచ్చునన్నారు.
సవరించటం ఇలా...
రిటర్ను దాఖలు చేసినపుడు పన్ను చెల్లింపుదారుకు 15 అక్షరాల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. దాని సాయంతో రిటర్నులు సవరించుకోవచ్చు. అయితే సవరించినపుడు తప్పుడు సమాచారం కనక ఇచ్చినట్లయితే దానికి ఐటీ విభాగం పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. ఈ పెనాల్టీ చెల్లించాల్సిన పన్నులో 100 శాతం నుంచి 300 శాతం వరకూ ఉండొచ్చు. సవరణను ఆన్‌లైన్లోకానీ, భౌతికంగా కానీ దాఖలు చేయొచ్చు. అయితే తొలి రిటర్న్‌ను ఆన్‌లైన్లో వేసినట్లయితే సవరణ కూడా ఆన్‌లైన్ ద్వారానే చేయాలి. ఇలా చేసేటపుడు మెనూలో ఫైలింగ్ అండర్ సెక్షన్ 139(5) సెలెక్ట్ చేసుకున్నట్లయితే కావాల్సిన మార్పులు చేయొచ్చు.
ఒకవేళ ఏదైనా పన్ను బకాయి ఉన్నట్లయితే దాన్ని చెల్లించవచ్చు. ఈ సవరించిన రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించి గుర్తింపు సంఖ్యనూ పొందవచ్చు. ‘‘ఒకవేళ తొలుత పేర్కొన్న పన్ను కన్నా సవరించిన పన్ను రిటర్న్‌లో మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువ ఉన్నట్లయితే మీ పన్ను రిటర్న్‌పై స్క్రూటినీ జరవవచ్చు. అయితే మీ రిటర్న్‌లో అసత్యాలు లేని పక్షంలో మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే మీ క్లెయిమ్‌కు సరిపడే పత్రాలను దాఖలు చేయాలంతే’’ అని మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు అమోల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఒకసారి కన్నా ఎక్కువసార్లు రిటర్న్‌ను సవరించాల్సి వస్తే... ప్రతిసారీ తను తొలిసారి దాఖలు చేసిన తేదీని, తనకు ఇచ్చిన గుర్తింపు సంఖ్యను కోట్ చేయాల్సి వస్తుందని కూడా తెలియజేశారు.