Refund claim
-
కట్టిన ఇన్కమ్ టాక్స్ కి సులభంగా రిఫండ్ పొందండి ఇలా
-
రిఫండ్ త్వరగా పొందాలంటే? వెరిఫై చేశారా..
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ–ఫైలింగ్ ప్రాసెస్‌ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్‌ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000 & రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ–వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ–వెరిఫై వద్దనుకుంటే ఫారం– Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్‌పోస్ట్‌లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్‌కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్‌ను వెంటనే ఆధార్‌తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్‌పోస్ట్‌లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు.. డిపార్ట్మెంట్ వారు. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌కు పంపించగలరు. -
పీఏసీఎల్ కేసులో రిఫండ్స్ షురూ
న్యూఢిల్లీ: పీఏసీఎల్ గ్రూప్‌లో నష్టపోయిన ఇన్వెస్టర్లు మార్చి 20లోగా ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ తాజాగా స్పష్టం చేసింది. తద్వారా అర్హతగల ఇన్వెస్టర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుంటుందని తెలియజేసింది. రూ. 15,001–17,000 మధ్య క్లెయిము చేస్తున్న ఇన్వెస్టర్లకు ఒరిజనల్ పత్రాల పరిశీలన తదుపరి రిఫండ్లను చేపట్టనున్నట్లు వివరించింది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయిన ఇన్వెస్టర్లు ఒరిజనల్ సర్టిఫికెట్లను దాఖలు చేయవలసి ఉంటుందని వెబ్సైట్లో సెబీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అధ్యక్షతన ఏర్పాటైన అత్యున్నత కమిటీ పీఏసీఎల్ ఆస్తుల విక్రయం, ఇన్వెస్టర్ల రిఫండ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇప్పటికే రిఫండ్ల ప్రాసెస్‌ను దశలవారీగా చేపట్టింది. అర్హతగల ఇన్వెస్టర్లకు ఎస్ఎంఎస్ ద్వారా పీఏసీఎల్ రిజిస్టర్డ్ పత్రాలు దాఖలు చేయవలసిందిగా తెలియజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు 2016లో సెబీ కమిటీ ఏర్పాటైంది. ఒరిజనల్ సర్టిఫికెట్ల దాఖలును 2023 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20వరకూ అనుమతిస్తారు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో పీఏసీఎల్ (పెరల్ గ్రూప్) పబ్లిక్ నుంచి రూ. 60,000 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఈ నిధులను 18ఏళ్లపాటు చట్టవిరుద్ధ పథకాల ద్వారా సమీకరించినట్లు సెబీ గుర్తించింది. -
ఐటీ రిఫండ్ చెక్ చేసుకున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి!
ఆదాయపు పన్ను శాఖ ఈ మధ్య అంటే.. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకూ రూ. 1.14 లక్షల కోట్ల ఆదాయ పన్ను రిఫండ్లు జారీ చేసింది. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారు మీ మీ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోండి. రిఫండ్ క్రెడిట్ అయి ఉంటుంది. క్రెడిట్ కాకపోతే వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టేటస్ తెలుసుకోండి. అన్ని వివరాలు కరెక్టుగా ఉండి.. పన్నుకి సంబంధించిన వివరాలు ఫారం 26 అ ప్రకారం సరిగ్గా ఉంటే మీరు క్లెయిం చేసిన రిఫండు క్రెడిట్ అవుతుంది. ఎంత మొత్తం రిఫండు వస్తుంది.. మీరు దాఖలు చేసిన రిటర్నులోని అన్ని అంశాలు క్షుణ్నంగా చెక్ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే మీరు క్లెయిం చేసినదంతా వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసినట్లయితే, రిఫండుతో పాటు వడ్డీ కూడా ఇస్తారు. మీరు క్లెయిం చేసిన మొత్తం కన్నా ఎక్కువ వచ్చిందంటే ఆ ఎక్కువ మొత్తం వడ్డీ అనుకోండి. ఈ రెండింటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. అలాగే, ఫారం 26 అ లో ఈ మేరకు ఎంట్రీలు కనిపిస్తాయి. అప్పుడు పూర్తిగా స్పష్టత వస్తుంది. ఫారం 26 అ డౌన్లోడ్ చేసుకుని ఒక కాపీని మీ ఇన్‌కంట్యాక్స్ ఫైల్లో భద్రపర్చుకోండి. మీ సులువు కోసం .. సౌకర్యం కోసం ప్రతి సంవత్సరం ఒక ఫైల్ నిర్వహించుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మీ రిఫండు.. మీ ఆదాయం కాదు. దాని మీద ఎటువంటి పన్ను భారం ఉండదు. మీకు వచ్చిన ఈ రిఫండుని ప్రస్తుత సంవత్సరం రిటర్ను వేసినప్పుడు ‘మినహాయింపు ఆదాయం‘ కింద చూపెట్టుకోవచ్చు. లేదా అధికారులు అడిగినప్పుడు ఈ జమ మొత్తం .. ఆదాయం కాదు అని, రిఫండు వచ్చిందని రుజువులతో పాటు విశదీకరించాలి. అదనంగా వచ్చిన మొత్తం వడ్డీని మాత్రం ప్రస్తుత సంవత్సరంలో ఆదాయంగా, ఇతర ఆదాయాల కింద చూపించాలి. దీని మీద ఎటువంటి మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ.. పన్నుకి గురి అవుతుంది. ఈ వడ్డీ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించకండి. రిఫండు తక్కువ రావచ్చు.. మీ రిఫండు క్లెయిం చేసినప్పటికీ పూర్తి మొత్తం రావచ్చు .. లేదా తగ్గవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గుల వల్ల, అంకెల తప్పుల వల్ల, ట్యాక్స్ క్రెడిట్లు తప్పుగాా రావడం వల్ల మీ ఆదాయం పెరగవచ్చు .. మినహాయింపులు తగ్గనూ వచ్చు. ఆదాయంలో మార్పుల వల్ల, పన్నుల చెల్లింపులు తక్కువ కావడం వల్ల, రిఫండు తక్కువ రావచ్చు. ఇందులో తప్పులుంటే మీరు తెలియజేయవచ్చు. రాకపోనూ వచ్చు .. అవును. ఒక్కొక్కప్పుడు ఈ సంవత్సరం రిఫండును అసెస్ చేసి, ఆర్డర్ పాస్ చేసి.. గత సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం సర్దుబాటు చేసుకుంటున్నాం అని కూడా అంటారు. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఆ మేరకు నిజమే అయితే ఊరుకోండి. కాకపోతే వివరణ ఇచ్చి, సవరించుకోండి. చివరిగా మీకు వచ్చిన రిఫండు అనేది ఆదాయం కాదని, అదనంగా వచ్చేది వడ్డీ అని, పన్నుకు గురవుతుందని గుర్తుపెట్టుకోండి. -
రూ.35 కోసం రెండేళ్ల పోరాటం..!
ముంబై : సర్వీస్ టాక్స్ పేరుతో తన వద్ద అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఓ వ్యక్తి చేసిన రెండేళ్ల పోరాటం పలించింది. అతని వద్ద వసూలు చేసిన మొత్తాన్ని ఐఆర్టీసీ చెల్లిచింది. కోటాకు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్ 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ ధర రూ.765. అయితే, 2017 జూలై 1న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ అమల్లోకి వచ్చిన కారణంగా అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. రిఫండ్‌గా రూ.100 తగ్గించుకొని ఐఆర్టీసీ అతనికి 665 చెల్లించింది. క్లరికల్ చార్జీలుగా రూ.65, సర్వీస్ టాక్స్‌గా రూ.35 కట్ చేసుకుంది. అయితే, లెక్క ప్రకారం తన దగ్గర క్లరికల్ చార్జీలు మాత్రమే వసూలు చేయాలని, సర్వీస్ టాక్స్ అదనంగా వసూలు చేశారని సదరు ప్రయాణికుడు లోక్ అదాలత్‌లో పిటిషన్ వేశాడు. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఈ జనవరిలో లోక్ అదాలత్ స్పష్టం చేసింది. చివరగా ఆర్టీఐని ఆశ్రయించిన ప్రయాణికుడికి అనుకూల సమాచారం వచ్చింది. జీఎస్టీ అమల్లోకి వచ్చే ముందు బుక్ చేసుకున్న టికెట్లపై విధించిన సర్వీస్ టాక్స్ చెల్లించాలని ఆర్టీఐ వెల్లడించింది. ఆర్టీఐ కాపీని అటాచ్ చేస్తూ.. ఐఆర్‌టీసీని సంప్రదించడంతో అతని బ్యాంక్ ఖాతాలో రూ.33 జమ చేసింది. మరో రూ.2 కోత విధించింది. తనను ఇబ్బందులకు గురిచేయడంతో రెండు రూపాయలు కోత విధించారని, ఐఆర్‌టీసీపై మరోసారి ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, జీఎస్టీ కారణంగా టికెట్ క్యాన్సిల్ చేసుకున్న ప్రయాణికుల ద్వారా ఐఆర్‌టీసీకి ఏటా రూ.3.34 కోట్ల ఆదాయం సమకూరుతోంది. -
జెట్ ఎయిర్వేస్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : రుణ సంక్షోభంలో పడిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ మరోసారి ఇబ్బందుల్లో చిక్కుకుంది. కాన్సిల్ చేసిన విమాన టికెట్ల డబ్బులను తిరిగి వినియోగదారులకు చెల్లించే అంశంపై ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై జెట్ ఎయిర్వేస్ స్పందించాలని కోరింది. అలాగే ఈ అంశంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ)ను ఆదేశించింది. ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసులను నిలిపివేసి, ప్రయాణికులను సంక్షోభంలోకి నెట్టి వేసిందనంటూ సామాజిక కార్యకర్త బిజోన్ కుమార్ మిశ్రా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.బి. భంభాని ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్ బుధవారం ఈ నోటీసులిచ్చింది. ఈ వేసవి సెలవుల తర్వాత దీనిపై వాదనలను వింటామని చెప్పిన కోర్టు తదుపరి విచారణను జులై 16కు వాయిదా వేసింది. కాగా జెట్ ఎయిర్వేస్ రుణ సమీకరణ అంశం ఒక కొలిక్కి రాకపోవడంతో సర్వీసులను ఆకస్మికంగా నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణీకులకు జెట్ ఎయిర్వేస్ చెల్లించాల్సిన రీఫండ్ మొత్తం సుమారు 360 కోట్ల రూపాయలకు పై మాటే. -
మోసపోతే ‘రిఫండ్’ రాదు!!
ట్యాక్స్ రిఫండ్ల పేరిట ఆన్లైన్ మోసాలు - ఫోన్లు చేసి కూడా వివరాల తస్కరణ సాక్షి, బిజినెస్ విభాగం : సుధీర్‌కు ఓ మెయిలొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ నుంచి పంపిస్తున్నట్లుగా దాన్లో ఉంది. ‘’సీబీడీటీ మొదటి త్రైమాసిక పన్ను రిఫండ్లను ప్రాసెస్ చేయటం పూర్తయింది. మీరు రూ.22,046.23 రూపాయల పన్ను అధికంగా చెల్లించారు. దాన్ని రిఫండ్‌కు సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. మీ రిఫండ్ క్లెయిమ్ చేయాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి’’ అనేది దాని సారాంశం. సుధీర్ అప్పటికే గత ఏడాది రిటర్ను ఫైల్ చేసి... నిజంగానే ఐటీ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో నిజమేననుకుని లింకు క్లిక్ చేశాడు. వెంటనే మరో పేజీ ఓపెనయింది. ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇండియా పేరిట ఓపెననైన ఆ పేజీలో... మీ బ్యాంకును సెలక్ట్ చేయండి... అనే పేజీ ఉంది. తనది ఎస్బీఐ కనక ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేశాడు. వెంటనే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ హోమ్‌పేజీ ఓపెనైపోయింది. దాన్లో తన ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవుదామనుకుంటూనే... ఒక్క క్షణం ఆలోచించాడు. ‘‘రిఫండ్ రావాలంటే నేను నా ఇంటర్నెట్ బ్యాంకులో ఎందుకు లాగిన్ అవ్వాలి?’’ అని. ఆ ఆలోచనే సుధీర్‌ను కాపాడింది. అందులో గనక లాగిన్ అయి ఉంటే... సుధీర్ వివరాలన్నీ మోసగాళ్లకు చేరి... తన అకౌంట్ ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోయేది. ఎందుకంటే ఆ పేజీ అచ్చం ఎస్బీఐ ఇంటర్నెట్ పేజీలానే ఉన్నా... అది మోసగాళ్లు పంపిన ఫిషింగ్ పేజీ. మోసగాళ్లు ఎంతకు తెగబడుతున్నారనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఇది రిఫండ్ల సీజన్. ఉద్యోగులంతా ఐటీ రిటర్నులు వేసే ఉంటారు. ఎంతో కొంత రిఫండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఈ రిఫండ్ల మోసాన్ని ఎంచుకున్నారు మాయగాళ్లు. అంతేకాదు!! ఇపుడు ఫోన్లు చేసి కూడా... మీకు రిఫండ్ రావాల్సి ఉంది... మీరు గనక ఎస్బీఐ కస్టమర్ అయితే 1 నొక్కండి. ఐసీఐసీఐ కస్టమర్ అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్ఎస్ ద్వారా వినిపిస్తున్నారు. అలా నొక్కుతూ పోతే... మన వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళతాయన్న మాట. ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండని చెప్పేదే ఈ కథనం. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ల విషయంలో ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు మీ రిటర్ను వేసేటపుడే రిఫండ్ క్లెయిమ్ చేసి ఉంటారు. ఆ రిఫండ్ నేరుగా మీరిచ్చిన బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఒకవేళ ఖాతా ఇవ్వకుంటే... మీ చిరునామాకు చెక్కు వస్తుంది. అంతేతప్ప మళ్లీ మీరు ఆన్లైన్లో క్లెయిమ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్త మరి!! -
రిటర్న్ వేసేశారా! మార్చుకోవచ్చులెండి!!
- ఎన్నిసార్లయినా మార్చుకోవడానికి అవకాశమిస్తున్న ఐటీ విభాగం - 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచే అమల్లోకి (సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) అరె! నిన్న ఫైల్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లో ఎల్ఐసీ పాలసీ వివరాలు పూర్తిగా ఇవ్వలేదే!!. రిఫండ్ క్లెయిమ్ చేస్తూ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ సంఖ్యలో తప్పు దొర్లిపోయిందే!! ఇప్పుడెలా? ఇలా ఆలోచించేవారు చాలామంది. కానీ ఆన్లైన్లో ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తే ఇక అంతే!. అందుకే... ఇలాంటి వారికోసమే ఐటీ శాఖ ఇపుడు దాఖలు చేసేసిన రిటర్న్ ఫారాల్లో తప్పులుంటే దిద్ది మరోసారి... అదీ కాకుంటే ఇంకోసారి... ఇలా ఎన్నిసార్లయినా దాఖలు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐటీ రిటర్న్‌ను గడువు తేదీలోగా దాఖలు చేసిన వారు ఆ తరవాత తాము మరచిపోయిన సమాచారాన్ని చేర్చడమైనా, అప్పటికే ఇచ్చిన సమాచారాన్ని తొలగించడమైనా... ఏదైనా చేయొచ్చు. ఇలా ఎన్ని సార్లయినా మార్చి సవరించిన రిటర్న్‌ను దాఖలు చేయడానికి అవకాశం కల్పిస్తోంది ఐటీ విభాగం. 2015 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌లు వేయడానికి ఆఖరు తేదీ ఆగస్టు 31. ఈ లోగా దాఖలు చేసినవారందరూ... ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు కావలసినన్ని సార్లు తమ రిటర్న్‌లు సవరించుకోవచ్చు. అయితే రెండేళ్ల తరవాత మాత్రం ఆ అవకాశం ఉండదు. దీనిపై ‘మేక్‌మై రిటర్న్స్ డాట్‌కామ్’ సహ వ్యవస్థాపకుడు విక్రమ్ రామ్‌చంద్ మాట్లాడుతూ... ‘‘నా క్లయింట్ ఒకరు ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆయన అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆయనకు రిటైర్మెంట్ పొదుపు ఖాతా 401(కె) ఉంది. గతేడాది ఆయన ఇండియాలో ఉండి ఐటీఆర్-1 ఫారాన్ని నింపారు. ప్రస్తుత చట్టం ప్రకారం ఎవరికైనా విదేశాల్లో ఆస్తులుంటే వారు ఐటీఆర్-2 నింపాలి. తొలుత సకాలంలో రిటర్న్‌లు వేసేశారు కనక ఆయన ఇపుడు సవరించి కొత్తది దాఖలు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. పన్ను చెల్లింపుదారు మూలధన నష్టాలను ఎనిమిదేళ్లపాటు కొనవచ్చని, ఈ లోగా మూలధన లాభాల నుంచి తీసివేయవచ్చని ఇటీవలే వచ్చిన కోర్టు తీర్పును ఆయన ఉదహరించారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రిటర్న్‌లో ఇలాంటి మార్పులు చేసుకోవచ్చునన్నారు. సవరించటం ఇలా... రిటర్ను దాఖలు చేసినపుడు పన్ను చెల్లింపుదారుకు 15 అక్షరాల గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. దాని సాయంతో రిటర్నులు సవరించుకోవచ్చు. అయితే సవరించినపుడు తప్పుడు సమాచారం కనక ఇచ్చినట్లయితే దానికి ఐటీ విభాగం పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. ఈ పెనాల్టీ చెల్లించాల్సిన పన్నులో 100 శాతం నుంచి 300 శాతం వరకూ ఉండొచ్చు. సవరణను ఆన్లైన్లోకానీ, భౌతికంగా కానీ దాఖలు చేయొచ్చు. అయితే తొలి రిటర్న్‌ను ఆన్లైన్లో వేసినట్లయితే సవరణ కూడా ఆన్లైన్ ద్వారానే చేయాలి. ఇలా చేసేటపుడు మెనూలో ఫైలింగ్ అండర్ సెక్షన్ 139(5) సెలెక్ట్ చేసుకున్నట్లయితే కావాల్సిన మార్పులు చేయొచ్చు. ఒకవేళ ఏదైనా పన్ను బకాయి ఉన్నట్లయితే దాన్ని చెల్లించవచ్చు. ఈ సవరించిన రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించి గుర్తింపు సంఖ్యనూ పొందవచ్చు. ‘‘ఒకవేళ తొలుత పేర్కొన్న పన్ను కన్నా సవరించిన పన్ను రిటర్న్‌లో మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువ ఉన్నట్లయితే మీ పన్ను రిటర్న్‌పై స్క్రూటినీ జరవవచ్చు. అయితే మీ రిటర్న్‌లో అసత్యాలు లేని పక్షంలో మీరు భయపడాల్సిన అవసరమేమీ లేదు. కాకపోతే మీ క్లెయిమ్‌కు సరిపడే పత్రాలను దాఖలు చేయాలంతే’’ అని మై ఐటీ రిటర్న్ డాట్‌కామ్ వ్యవస్థాపకుడు అమోల్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఒకసారి కన్నా ఎక్కువసార్లు రిటర్న్‌ను సవరించాల్సి వస్తే... ప్రతిసారీ తను తొలిసారి దాఖలు చేసిన తేదీని, తనకు ఇచ్చిన గుర్తింపు సంఖ్యను కోట్ చేయాల్సి వస్తుందని కూడా తెలియజేశారు.