న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసే వారి సంఖ్య ఎనిమిదేళ్ల కాలంలో 90 శాతం పెరిగిందని, 2021–22 అసెస్‌మెంట్ సంవత్సరంలో (2020–21 ఆర్థిక సంవత్సరానికి) 6.37 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. వ్యక్తులు జారీ చేసే రిటర్నులు 2013– 14 అసెస్‌మెంట్ సంవత్సరానికి 3.36 కోట్లుగా ఉంటే, అది 2021–22 నాటికి 6.37 కోట్లకు చేరినట్టు వెల్లడించింది.
2023–24 అసెస్‌మెంట్ సంవత్సరం (2022–23 ఆర్థిక సంవత్సరం)లోనూ 7.41 కోట్ల ఐటీఆర్‌లు దాఖలైనట్టు తెలిపింది. ఇందులో మొదటిసారి ఐటీఆర్‌లు దాఖలు చేసిన వారు 53 లక్షల మంది ఉన్నట్టు పేర్కొంది. ముఖ్యంగా రూ.5–10 లక్షల ఆదాయం వర్గం వారి రిటర్నులు.. 2013–14 అసెస్‌మెంట్ సంవత్సరం నుంచి 2021–22 అసెస్‌మెంట్ సంవత్సరానికి 295 శాతం పెరిగాయి. రూ.10–25 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారి రిటర్నులు 291 శాతం పెరిగాయి.
ఈ వివరాలను ఆదాయపన్ను శాఖ అత్యున్నత నిర్ణయ విభాగం సీబీడీటీ ప్రకటించింది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కలిగి రిటర్నులు వేసే వారి సంఖ్య 2.62 కోట్ల నుంచి 3.47 కోట్లకు పెరిగింది. స్థూల ఆదాయం పరంగా టాప్ 1 శాతం పరిధిలోని పన్ను రిటర్నులు వేసే వారు 15.9 శాతం నుంచి 14.6 శాతానికి తగ్గారు. దిగువ నుంచి 25 శాతం ఆదాయం కలిగిన వారి రిటర్నులు 8.3 శాతం నుంచి 8.4 శాతానికి పెరిగాయి. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన 74 శాతం గ్రూప్ పరిధిలోని పన్ను చెల్లింపుదారుల రిటర్నులు 75.8 శాతం నుంచి 77 శాతానికి పెరిగాయి. మధ్య తరగతి వాసుల రిటర్నులు ప్రధానంగా పెరిగినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment