రిటర్నుల దాఖలు ఎంతో ఈజీ
అందుబాటులో ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు
ఆదాయపన్ను శాఖ నుంచి వీటికి అనుమతి
కొంత చార్జీతో నిపుణుల సలహా సూచనలు
పెట్టుబడుల విషయంలోనూ మార్గనిర్దేశం
ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. జూలై 31 తుది గడువు. చివరి రోజు వరకు ఆగకుండా ముందుగా రిటర్నులు దాఖలు చేయడం సూచనీయం. చాలా మందికి రిటర్నుల విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. వేరొకరి సాయం తీసుకుంటుంటారు. కానీ, ఎవరికివారే ఆదాయపన్ను శాఖ ఈ–ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులను ఎల్రక్టానిక్ రూపంలో సమరి్పంచొచ్చు.
ఈ–ఫైలింగ్ పోర్టల్‌ను యూజర్లకు అనుకూలంగా మార్చేందుకు ఆదాయపన్ను శాఖ ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ, ఐటీఆర్ దాఖలు ప్రక్రియ అర్థం కాని వారు చాలా మందే ఉంటారు. ఇలాంటి వారికి ఉన్నమెరుగైన ప్రత్యామ్నాయ మార్గం.. మధ్యవర్తిత్వ సంస్థల సాయం తీసుకోవడం. వీటి ద్వారా చాలా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఈ విషయంలో ఇవి మెరుగైన సేవలను అందిస్తున్నాయి. వీటి గురించి తెలియజేసే ప్రయత్నమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం.
ఈఆర్‌ఐలు
ఈ–రిటర్న్ ఇంటర్‌మీడియరీలు (ఈఆర్‌ఐలు) ఎలక్గ్రానిక్ రూపంలో పన్ను రిటర్నులు వేసేవారికి కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవి అనుసంధానకర్తగా వ్యవహరిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఆధారితంగా నడిచే ప్లాట్‌ఫామ్‌లు. వీటి ద్వారా ఎవరైనా రిటర్నులు సమరి్పంచొచ్చు. పన్ను చెల్లింపుదారుల తరఫున పన్ను రిటర్నుల దాఖలుకు ఐటీ శాఖ నుంచి వీటికి అనుమతి ఉంది. క్లియర్‌ట్యాక్స్, క్వికో, ట్యాక్స్‌బడ్డీ, మైఐటీ రిటర్న్, ఈజెడ్‌ట్యాక్స్, ట్యాక్స్2విన్ ఇవన్నీ ఈఆర్‌ఐలే. రిటర్నుల ఆటోఫిల్, రివ్యూ, ఈ–ఫైల్.. ఇలా మూడంచెల్లోనే రిటర్నులను సమరి్పంచొచ్చు. పన్ను రిటర్నులు వేయడం ఇంత సులువా? అనేలా ఇవి సేవలు అందిస్తున్నాయి.
సౌకర్యం..
ఇవి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు కావడంతో పన్ను చెల్లింపుదారులు తమ ఇంటి నుంచే ఖాళీ సమయంలో సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు. వీటి యూజర్ ఇంటర్‌ఫేస్ అర్థం చేసుకునేందుకు సులభంగా, సమకాలీనంగా ఉంటుంది. అందుకే ఇటీవలి కాలంలో ఈ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. మొబైల్ యాప్‌ల నుంచి రిటర్నులు వేసే సౌకర్యాన్ని సైతం అందిస్తున్నాయి.
క్వికో అయితే యూపీఐ ద్వారా పన్ను చెల్లించే సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఫామ్ 16 పత్రాల కాపీలను దగ్గర ఉంచుకుంటే, రిటర్నులు వేగంగా సమరి్పంచొచ్చు. ఈ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై మూలధన లాభాలు ఉన్న వారూ ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రిటర్నులు సులభంగానే దాఖలు చేసుకోవచ్చు.
ప్రముఖ స్టాక్ బ్రోకర్లతో వీటికి ఒప్పందం ఉంది. కనుక పన్ను చెల్లింపుదారుల సమ్మతితో వారికి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వివరాలను బ్రోకర్ల సర్వర్ల నుంచి సెకన్ల వ్యవధిలో తీసుకుని రిటర్నుల పత్రంలో నమోదు చేస్తాయి. కనుక వీటిని విడిగా నమోదు చేయాల్సిన ఇబ్బంది ఉండదు. అందుకే తమ స్టాక్ బ్రోకర్‌తో టైఅప్ ఉన్న ఈఆర్‌ఐని ఎంపిక చేసుకోవాలి. లేదంటే విడిగా ప్రతీ పెట్టుబడికి సంబంధించిన కొనుగోలు తేదీ, ధర, విక్రయం తేదీ, ధర తదితర వివరాలు నమోదు చేయాల్సి వస్తుంది.
అన్ని విధాలా సహకారం
పన్ను అంశాల్లో పూర్తి సహకారం అందించేందుకు ఇవి సిద్ధంగా ఉంటాయి. పాత, కొత్త పన్ను విధానాల్లో ఏది అనుకూలం? వ్యక్తి ఆదాయ వనరుల ఆధారంగా దాఖలు చేయాల్సిన ఐటీఆర్ పత్రాన్ని ఈఆర్‌ఐ సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. కేవలం వేతనమే కాదు, ఈక్విటీలు, ఎఫ్‌అండ్‌వో ఆదాయం, విదేశీ ఆస్తుల ద్వారా ఆదాయం ఇలా భిన్న రూపాల్లో ఆదాయ వనరులు ఉన్న వారికి ఐటీఆర్ పత్రం ఎంపికను ఇవి సులభతరం చేస్తాయి.
రిటర్నులు దాఖలు చేయడమే కాదు, ఈ వెరిఫికేషన్‌ను కూడా అక్కడే పూర్తి చేయవచ్చు. ట్యాక్స్‌బడ్డీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిటర్నులు వేసినట్టయితే.. ఒకవేళ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వస్తే, పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడం, నోటీసుకు ఇవ్వాల్సిన సమాధానం విషయంలోనూ సహకారం లభిస్తుంది. ఈఆర్‌ఐ ప్లాట్‌ఫామ్‌లపై రిటర్నుల దాఖలుకు సంబంధించి రెండు స్కీమ్‌లు ఉంటాయి. ఒకటి సొంతంగా దాఖలు చేసుకోవడం.
రెండోది నిపుణుల సహకారంతో దాఖలు చేసుకోవడం. కొంత చార్జీ చెల్లించి పన్ను నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారాన్ని రిటర్నుల విషయంలో తీసుకోవచ్చు. వర్చువల్‌గా నిపుణులతో సమావేశమై సందేహాలు తీర్చుకోవచ్చు. అడ్వాన్స్‌డ్ ట్యాక్స్ విషయంలోనూ ఈ ప్లాట్‌ఫామ్‌లు సాయం అందిస్తున్నాయి.. అంతేకాదు ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాలు పొందడానికి వీలుగా పెట్టుబడుల విషయంలోనూ సలహాలు తీసుకోవచ్చు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎన్‌పీఎస్, ఈఎల్‌ఎస్‌ఎస్, పన్ను ఆదా డిపాజిట్లలో పెట్టుబడులపై సహకారం లభిస్తుంది.
సేవలకు చార్జీలు...
ఈ ప్లాట్‌ఫామ్‌లు రిటర్నుల దాఖలుకు కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. నిపుణుల సహకారం లేకుండా సొంతంగా రిటర్నుల ఫైలింగ్‌కు చార్జీ రూ.200 నుంచి రూ.1,600 వరకు ఉంది. ఆదాయస్థాయికి అనుగుణంగా ఈ చార్జీ మారుతుంది. కొన్ని ప్లాట్‌ఫామ్‌లు పన్ను చెల్లింపుదారులు సొంతంగా రిటర్నులు దాఖలు చేసుకుంటే ఎలాంటి చార్జీ తీసుకోవడం లేదు. నిపుణుల సాయం తీసుకుని, రిటర్నులు వేయాలనుకుంటే చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఆర్‌ఐ సంస్థలకు యూట్యూబ్ చానళ్లు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్ సేవలను ఎలా వినియోగించుకోవచ్చన్నదానిపై వీడియోలు చూసి తెలుసుకోవచ్చు. వ్యక్తిగత ఆరి్థక అంశాలపై సమాచారం అందించే వీడియోలు సైతం అక్కడ లభిస్తాయి.
డేటా భద్రత సంగతి?
ఈఆర్‌ఐలు అన్నీ కూడా పన్ను చెల్లింపుదారులకు సంబంధించి సున్నితమైన వ్యక్తిగత డేటాను పెద్ద మొత్తంలో కలిగి ఉంటాయి. కనుక ఆయా ప్లాట్‌ఫామ్‌ల భద్రత ఎంతన్నది ముందే విచారించుకోవాలి. పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని మరొకరితో పంచుకోవడం లేదా విక్రయించడం చేయబోమని ఈ వేదికలు హామీ ఇస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌లు టెక్నాలజీ, భద్రత కోసం తగినంత ఖర్చు చేయాల్సి వస్తుంది. వీటి విషయంలో రాజీకి అవకాశం లేదు.
రిటర్నులు ఎవరు వేయాలి?
వార్షిక ఆదాయం రూ.2,50,000 వరకు ఉన్న వారు పన్ను పరిధిలోకి రారు. పాత పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2,50,000. అదే కొత్త పన్ను విధానంలో అయితే వార్షికాదాయం రూ.3,00,000 మించని వారు పన్ను రిటర్నులు దాఖలు చేయనవసరం లేదు. ఇంతకు మించి ఆదాయం కలిగిన ప్రతి ఒక్కరూ రిటర్నులు విధిగా దాఖలు చేయాల్సిందే. అయితే పన్ను చెల్లించే ఆదాయం లేకపోయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేయాలని చట్టంలోని సెక్షన్ 139 స్పష్టం చేస్తోంది.
ఏ సందర్భాల్లో రిటర్నులు వేయాలి..? (సెక్షన్ 139)
→ విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు (షేర్లు) కలిగి ఉన్న వారు రిటర్నులు దాఖలు చేసి, అందులో ఆ వివరాలు పేర్కొనాలి. విదేశీ కంపెనీల్లోని వాటాల ద్వారా వచ్చే డివిడెండ్ వివరాలను సైతం వెల్లడించాలి. విదేశీ కంపెనీల బాండ్లు, విదేశాల్లో ఇల్లు, ఆ ఇంటి నుంచి అద్దె ఆదాయం వస్తున్న ప్రతి ఒక్కరూ రిటర్నులు దాఖలు చేయాలని సెక్షన్ 139(1) చెబుతోంది. భారత్‌కు వెలుపల ఏ దేశంలో అయినా అకౌంట్‌కు సంతకం చేసే అధికారం కలిగి ఉన్న వారు కూడా రిటర్నులు వేయాలి. తన పేరు మీద ఇన్వెస్ట్ చేసినా లేదా తల్లిదండ్రుల పేరు మీద విదేశాల్లో ఇన్వెస్ట్ చేసినా సరే.. రిటర్నుల దాఖలు తప్పదు.
→ ఒక వ్యక్తి తాను, తన జీవిత భాగస్వామి, లేదా ఇతరుల (తల్లిదండ్రులు తదితర) విదేశీ పర్యటనల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు, అంతకుమించి ఖర్చు చేసినట్టయితే రిటర్నులు వేయాల్సి ఉంటుంది.
→ ఒక ఆరి్థక సంవత్సరంలో విద్యుత్ బిల్లుల మొత్తం రూ.లక్ష దాటినా సరే రిటర్నుల దాఖలు తప్పనిసరి.
→ మూలధన లాభాలపై పన్ను మినహాయింపు కోరుకునే వారు రిటర్నులు దాఖలు చేయాలి.
→ మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూళ్లు (టీసీఎస్) ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.25,000, అంతకుమించి ఉంటే రిటర్నులు వేయాలని ఆదాయపన్ను శాఖ 2022 ఏప్రిల్ నాటి నోఫికేషన్ స్పష్టం చేస్తోంది. ఇదే నోటిఫికేషన్ ప్రకారం.. ఒక ఆరి్థక సంవత్సరంలో బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ.50లక్షలు అంతకుమించి డిపాజిట్ చేసిన సందర్భాల్లో, వ్యాపార టర్నోవర్ లేదా వ్యాపారం నుంచి రావాల్సిన మొత్తం రూ.60లక్షలు మించి ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
→ స్వయం ఉపాధిలోని వారు కరెంట్ ఖాతా కలిగి, అందులో ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.కోటి డిపాజిట్ చేసిన సందర్భంలోనూ రిటర్నులు వేయాలి.
→ వడ్డీ ఆదాయం, డివిడెండ్లపై టీడీఎస్ అమలు చేస్తుంటారు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు, ఇలా టీడీఎస్ రూపంలో మినహాయించినది తిరిగి పొందాలంటే (రిఫండ్), ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
గడువులోపు రిటర్నులు వేయకపోతే?
జూలై 31 తర్వాత రిటర్నులు దాఖలు చేసే వారు సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయం రూ.5 లక్షల్లోపు ఉన్న వారికి రూ.1,000, రూ.5 లక్షలు మించి ఆదాయం ఉంటే రూ.5,000 పెనాల్టీ కింద చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment