రూ.37 లక్షల కోట్ల మెగా ఎస్బీఐ | India approves SBI takeover of units, govt source says | Sakshi
Sakshi News home page

రూ.37 లక్షల కోట్ల మెగా ఎస్బీఐ

Published Thu, Jun 16 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

రూ.37 లక్షల కోట్ల మెగా ఎస్బీఐ

రూ.37 లక్షల కోట్ల మెగా ఎస్బీఐ

అనుబంధ బ్యాంకులు విలీనమైతే భారీ బ్యాంకుగా ఎస్‌బీఐ
22,000 శాఖలు, 60,000 ఏటీఎంలు
అయితే అనుసంధానం అంత తేలిక్కాదు
గుత్తాధిపత్యానికి దారితీయవచ్చు...


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్‌బీఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనంపై ఇప్పటికే పెద్ద చర్చే జరుగుతోంది.  ఇది వ్యవస్థకు మేలు చేస్తుందంటూ క్యాబినెట్ తాజాగా విలీనానికి ఆమోదముద్ర వేసింది. మరోవైపు తమ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందంటూ యూనియన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ నిపుణుల్లో కూడా... ఇది గుత్తాధిపత్యానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... దీర్ఘకాలంలో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని, విలీనం మంచిదేనని మరి కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీని లాభనష్టాలు, వివిధ వర్గాల ఆందోళనల వెనకున్న కారణాలను వివరించే కథనమే ఇది...

 ప్రయివేటును తీసుకున్నా, ప్రభుత్వ రంగాన్ని తీసుకున్నా దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ. ఇపుడైతే ఆస్తుల పరంగా ప్రపంచంలో 52వ స్థానంలో ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న స్టేట్‌బ్యాంకులు హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావెన్‌కోర్, మైసూర్, పటియాలాలను దీంతో విలీనం చేయటానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అనుబంధ స్టేట్‌బ్యాంకులైన సౌరాష్ట్ర, ఇండోర్‌లు ఇప్పటికే ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. చిన్న స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకత అంతంతమాత్రంగానే ఉండటంతో వాటన్నిటినీ మాతృసంస్థతో కలిపేసి భారీ బ్యాంకుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్లుగా పెద్ద సంఖ్యలో చిన్న బ్యాంకులుండటం కన్నా కొద్ది సంఖ్యలో భారీ బ్యాంకులుంటే వ్యవస్థాపరమైన నిర్వహణ కూడా సులభతరమవుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం.
అన్నీ కలిస్తే.. 45వ స్థానానికి
ఇటీవలి గణాంకాల ప్రకారం అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపేసుకుంటే దాదాపు రూ. 37 లక్షల కోట్ల ఆస్తులు, 22,500 శాఖలు, సుమారు 60,000 పైచిలుకు ఏటీఎంలతో ఎస్‌బీఐ మెగా బ్యాంకుగా అవతరించనుంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి స్వంతంగా దాదాపు రూ. 28 లక్షల కోట్ల ఆస్తులు, 16,500 పైచిలుకు శాఖలు ఉన్నాయి. విలీనానంతరం సమీప పోటీ బ్యాంకు, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కన్నా ఎస్‌బీఐ మూడు రెట్లు పెద్దదిగా మారుతుంది. ఇక అంతర్జాతీయంగా దిగ్గజ బ్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ ప్రస్తుతం 52వ స్థానంలో ఉంది. అనుబంధ బ్యాంకుల విలీనం పూర్తయితే.. 45వ స్థానానికి ఎగబాకుతుంది.

సుమారు రూ.237 లక్షల కోట్ల ఆస్తులతో ది ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచం మొత్తమ్మీద అగ్రస్థానంలో ఉంది. అయితే 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిణామాల దరిమిలా భారీ బ్యాంకుల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల్ని చూస్తే ఇక్కడ కన్సాలిడేషన్ కన్నా ఎక్కువ బ్యాంకులుంటేనే మేలు. ఇంకా కొత్త బ్యాంకులొస్తున్నాయి కనక పోటీ పెరిగి, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది.

విలీనమైతే పోటీ బ్యాంకులకన్నా ఎస్‌బీఐ భారీగా ఎదిగిపోతుంది. గుత్తాధిపత్యానికి దారి తీయొచ్చు’’ అని బ్యాంకింగ్ నిపుణుడొకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ విషయమై ఒక నివేదిక ఇస్తూ... ‘‘ఎస్‌బీఐలోకి దాదాపు 70వేల మంది కొత్త సిబ్బంది వస్తారు. అంటే 34 శాతం మంది. వ్యాపార పరిమాణమేమో 25 శాతం పెరుగుతుంది. ఆ సిబ్బందిని దీనికి అనుసంధానించటమన్నది అంత తేలిక కాదు. కాకపోతే దీర్ఘకాలికంగా లాభాలుంటాయి. ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి’’ అని అభిప్రాయపడింది.

భారీ బ్యాంకులు అక్కర్లేదు: యూనియన్లు
ఎస్‌బీఐతో విలీనమైతే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుబంధ బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన రేగుతోంది. అనుబంధ బ్యాంకుల్లో పెన్షన్ సదుపాయం లేని చాలా మందికి ఎస్‌బీఐలో విలీనంతో రిటైర్మెంట్‌పరమైన కొన్ని ప్రయోజనాలు దక్కనున్నప్పటికీ .. సీనియారిటీ సమస్యలతో ప్రమోషన్ల అవకాశాలు దెబ్బతింటాయనేది వారి భయం. దీనికి వ్యతిరేకంగా అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు గత నెల 20న దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. మరోవంక చాలా చోట్ల ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల శాఖలు సమీపంలో ఉన్నాయి. విలీనం తరవాత హేతుబద్ధీకరణ తప్పదు.

ఇదే జరిగితే బదిలీలు ఖాయమని, తాము ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియటం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఎస్‌బీహెచ్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి ఇటీవలే డిమాండ్ చేశారు. ఇక, కేరళ కేంద్రంగా పనిచేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ (ఎస్‌బీటీ) విలీనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం విషయంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు నేడు (గురువారం) ఆఫీస్ బేరర్స్ సమావేశం కానున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశానికి కావాల్సింది పటిష్టమైన, సరైన బ్యాంకులే తప్ప భారీ బ్యాంకులు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement