విలీనానికి క్యాబినెట్ ఓకే
♦ ఎస్‌బీఐ ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు
♦ భారతీయ మహిళా బ్యాంకు కూడా...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితోపాటు దాదాపు రూ.1,000 కోట్ల మూలధనంలో ఏర్పాటయిన భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దాదాపు 90 బ్రాంచీలతో పనిచేస్తోంది. తాజా పరిణామంతో ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా ఆవిర్భావ దిశలో ఎస్‌బీఐ కీలక అడుగు వేసినట్లయ్యింది. ఎస్‌బీఐ, ఐదు అనుబంధ బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనను ఆమోదించిన నెలరోజుల్లోనే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేయడం గమనార్హం. విలీనమవుతున్న బ్యాంకుల్లో లిస్టయిన మూడు బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌ల షేర్ ధరలు బుధవారం 20 శాతం పెరగడం గమనార్హం.
ఇరువైపులా లాభం: అరుంధతీ భట్టాచార్య
ఈ పరిణామం అటు విలీనం అవుతున్న బ్యాంకులకు ఇటు ఎస్‌బీఐకి ప్రయోజనం కలిగిస్తుందని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద 50 బ్యాంకుల జాబితాలో ఇప్పుడు భారత్ బ్యాంక్ లేదని, విలీనం తరువాత ఒక భారత్ బ్యాంకుకు ఈ స్థాయి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. నెట్‌వర్క్, టెక్నాలజీ, సామర్థ్యం, నైపుణ్యం వంటి పలు విభాగాల్లో సైతం బ్యాంకింగ్ నాణ్యత మరింతగా మెరుగుపడుతుందని అన్నారు. నిర్వహణా, నిధుల సమీకరణ భారాలు తగ్గడం మరో కీలక ప్రయోజనంగా అరుంధతి వివరించారు.