subsidiary banks
-
విలీనంతో ఎస్బీఐ ఆస్తులకు దన్ను
విలువ రూ. 30 లక్షల కోట్లకు బలమైన ప్రపంచ స్థాయి బ్యాంకుగా అవతరణ ముంబై : 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో ఎస్బీఐ ఆస్తుల విలువ భారీగా పెరగనుంది. మరెన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ► విలీనం ద్వారా 120 బిలియన్ డాలర్ల (రూ.8.04లక్షల కోట్ల) మేర ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ విలీనం అనంతరం ఎస్బీఐ మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి 447 (సుమారు రూ.30 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుతుంది. ► ఐసీఐసీఐ ఆస్తుల విలువ అప్పుడు ఎస్బీఐ విలువలో పావుశాతంగానే ఉంటుంది. ► 24వేల శాఖలతో, 2,70,000 మంది ఉద్యోగులతో, 58వేల ఏటీఎంలతో 50 కోట్ల మందికి సేవలు అందించే బ్యాంకుగా ఎస్బీఐ ఎదుగుతుంది. ► విలీనం ద్వారా నిర్వహణ సామర్థ్యాలు మెరుగవడంతోపాటు కొత్త క్లయింట్లను చేరుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవడం సాధ్యపడుతుంది. -
ఎస్బీఐ ‘విలీనం’ షురూ..!
♦ అనుబంధ బ్యాంకులు, బీఎంబీ విలీనానికి తొలి అడుగు ♦ వేల్యూయర్స్ కోసం ఎస్బీఐ క్యాప్స్ రంగంలోకి ముంబై: ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) విలీనానికి తొలి అడుగు పడింది. ముందుగా స్టాక్ మార్కెట్లో లిస్టయి ఉన్న మూడు బ్యాంకులు, బీఎంబీ విలీనానికి సంబంధించి షేర్ల బదలాయింపు నిష్పత్తి(స్వాప్ రేషియో), విలువ మదింపు కోసం స్వతంత్ర వేల్యూయర్స్ను నియమించేందుకు ఎస్బీఐ కసరత్తు మొదలుపెట్టింది. చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) సంస్థల నుంచి వేల్యూయేషన్ ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నట్లు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అనుబంధ బ్యాంకుల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావంకోర్లు మార్కెట్లో లిస్టయ్యాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, పాటియాలా మాత్రం లిస్టయి లేవు. వీటిని కూడా మిగతా అనుబంధ బ్యాంకులతో పాటే ఎస్బీఐ విలీనం చేసుకోనుంది. అయితే, అన్‌లిస్టెడ్ బ్యాంకుల నేపథ్యంలో వీటికి విడిగా విలువ మదింపును చేపట్టనుంది. వేల్యుయేషన్ కోసం సీఏ సంస్థలు అన్నిరకాల మార్కెట్ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎస్బీఐ క్యాప్స్ ప్రకటనలో పేర్కొంది. ఎస్బీఐ, మూడు అనుబంధ బ్యాంకుల విలువను మదింపు చేయడంతోపాటు అనుబంధ బ్యాంకులు నియమించుకునే వేల్యూయర్తో కలిపి ఒక సంయుక్త నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతి బ్యాంకుకూ వేర్వేరుగా నాలుగు రకాల స్వాప్ రేషియోలను ఇవ్వాలని కూడా వివరించింది. మరోపక్క, ఎస్‌బీబీజే, ఎస్బీఎం, ఎస్బీటీ, బీఎంబీ విలీనంపై నిష్పక్షపాత అభిప్రాయాల కోసం కూడా మర్చెంట్ బ్యాంకర్ల నుంచి ఎస్బీఐ క్యాప్స్ ప్రతిపాదనలను ఆహ్వానించింది. అనుబంధ బ్యాంకులు, బీఎంబీ విలీన ప్రతిపాదనకు గత నెలలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. విలీనం కార్యాచరణను రూపొందించేందుకు ఎస్బీఐ 15-20 మంది ఉన్నతాధికారులతో ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ మూడేళ్ల వల్లే భారీ ఎన్పీఏలు: ఎస్బీఐ చీఫ్ న్యూయార్క్ : దేశీ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యకు ప్రధానంగా 2011-13 మధ్య వివిధ రంగాల్లో ప్రాజెక్టులు నిలిచిపోవడమే కారణమని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య పేర్కొన్నారు. అయితే, ఆ అడ్డంకులను తొలగించి మళ్లీ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ దిశగా ఇప్పటికి కొంత పురోగతి సాధించామని, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా ఎస్బీఐ చీఫ్ పేర్కొన్నారు. మరింత మూలధనాన్ని సమకూర్చుకోవడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేయడంపై దృష్టిపెడుతున్నట్లు ఆమె వివరించారు. ఎస్బీఐ, ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ ఆన్ ఇండియా భాగస్వామ్యంతో భారత కాన్సులేట్ ఇక్కడ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో అరుంధతి ఈ అంశాలను ప్రస్తావించారు. ‘భారత్‌లో మారుతున్న ఆర్థిక ముఖచిత్రం-అవకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై ఈ చర్చను నిర్వహించారు. కాగా, న్యూయార్క్ పర్యటనలో భాగంగా ఎస్బీఐ చీఫ్ పలువురు ఇన్వెస్టర్లతో పాటు రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ‘భారత్‌లో స్థూల ఆర్థిక అంశాలన్నీ చాలా బాగున్నాయి. ద్రవ్యలోటు కట్టడిలో ఉంది. అదేవిధంగా రిటైల్ ద్రవ్యోల్బణం కూడా ఆర్బీఐ నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగానే(2017 కల్లా 5 శాతం) దిగొస్తోంది. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించే అవకాశం ఉంది’ అని అరుంధతి వివరించారు. -
విలీనానికి క్యాబినెట్ ఓకే
♦ ఎస్బీఐ ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు ♦ భారతీయ మహిళా బ్యాంకు కూడా... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఐదు అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితోపాటు దాదాపు రూ.1,000 కోట్ల మూలధనంలో ఏర్పాటయిన భారతీయ మహిళా బ్యాంక్ విలీనానికి కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యాంక్ దాదాపు 90 బ్రాంచీలతో పనిచేస్తోంది. తాజా పరిణామంతో ప్రపంచ స్థాయి బ్యాంక్‌గా ఆవిర్భావ దిశలో ఎస్బీఐ కీలక అడుగు వేసినట్లయ్యింది. ఎస్బీఐ, ఐదు అనుబంధ బ్యాంకుల బోర్డులు విలీన ప్రతిపాదనను ఆమోదించిన నెలరోజుల్లోనే కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయానికి ఆమోదముద్ర వేయడం గమనార్హం. విలీనమవుతున్న బ్యాంకుల్లో లిస్టయిన మూడు బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ల షేర్ ధరలు బుధవారం 20 శాతం పెరగడం గమనార్హం. ఇరువైపులా లాభం: అరుంధతీ భట్టాచార్య ఈ పరిణామం అటు విలీనం అవుతున్న బ్యాంకులకు ఇటు ఎస్బీఐకి ప్రయోజనం కలిగిస్తుందని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద 50 బ్యాంకుల జాబితాలో ఇప్పుడు భారత్ బ్యాంక్ లేదని, విలీనం తరువాత ఒక భారత్ బ్యాంకుకు ఈ స్థాయి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. నెట్వర్క్, టెక్నాలజీ, సామర్థ్యం, నైపుణ్యం వంటి పలు విభాగాల్లో సైతం బ్యాంకింగ్ నాణ్యత మరింతగా మెరుగుపడుతుందని అన్నారు. నిర్వహణా, నిధుల సమీకరణ భారాలు తగ్గడం మరో కీలక ప్రయోజనంగా అరుంధతి వివరించారు. -
రూ.37 లక్షల కోట్ల మెగా ఎస్బీఐ
అనుబంధ బ్యాంకులు విలీనమైతే భారీ బ్యాంకుగా ఎస్బీఐ ♦ 22,000 శాఖలు, 60,000 ఏటీఎంలు ♦ అయితే అనుసంధానం అంత తేలిక్కాదు ♦ గుత్తాధిపత్యానికి దారితీయవచ్చు... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనంపై ఇప్పటికే పెద్ద చర్చే జరుగుతోంది. ఇది వ్యవస్థకు మేలు చేస్తుందంటూ క్యాబినెట్ తాజాగా విలీనానికి ఆమోదముద్ర వేసింది. మరోవైపు తమ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందంటూ యూనియన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇక బ్యాంకింగ్ నిపుణుల్లో కూడా... ఇది గుత్తాధిపత్యానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండగా... దీర్ఘకాలంలో వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని, విలీనం మంచిదేనని మరి కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దీని లాభనష్టాలు, వివిధ వర్గాల ఆందోళనల వెనకున్న కారణాలను వివరించే కథనమే ఇది... ప్రయివేటును తీసుకున్నా, ప్రభుత్వ రంగాన్ని తీసుకున్నా దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ. ఇపుడైతే ఆస్తుల పరంగా ప్రపంచంలో 52వ స్థానంలో ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న స్టేట్‌బ్యాంకులు హైదరాబాద్, బికనీర్ అండ్ జైపూర్, ట్రావెన్కోర్, మైసూర్, పటియాలాలను దీంతో విలీనం చేయటానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అనుబంధ స్టేట్బ్యాంకులైన సౌరాష్ట్ర, ఇండోర్లు ఇప్పటికే ఎస్బీఐలో విలీనమయ్యాయి. చిన్న స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభదాయకత అంతంతమాత్రంగానే ఉండటంతో వాటన్నిటినీ మాతృసంస్థతో కలిపేసి భారీ బ్యాంకుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాశి కంటే వాసి ముఖ్యం అన్నట్లుగా పెద్ద సంఖ్యలో చిన్న బ్యాంకులుండటం కన్నా కొద్ది సంఖ్యలో భారీ బ్యాంకులుంటే వ్యవస్థాపరమైన నిర్వహణ కూడా సులభతరమవుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. అన్నీ కలిస్తే.. 45వ స్థానానికి ఇటీవలి గణాంకాల ప్రకారం అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపేసుకుంటే దాదాపు రూ. 37 లక్షల కోట్ల ఆస్తులు, 22,500 శాఖలు, సుమారు 60,000 పైచిలుకు ఏటీఎంలతో ఎస్బీఐ మెగా బ్యాంకుగా అవతరించనుంది. ప్రస్తుతం ఎస్బీఐకి స్వంతంగా దాదాపు రూ. 28 లక్షల కోట్ల ఆస్తులు, 16,500 పైచిలుకు శాఖలు ఉన్నాయి. విలీనానంతరం సమీప పోటీ బ్యాంకు, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు కన్నా ఎస్బీఐ మూడు రెట్లు పెద్దదిగా మారుతుంది. ఇక అంతర్జాతీయంగా దిగ్గజ బ్యాంకుల జాబితాలో ఎస్బీఐ ప్రస్తుతం 52వ స్థానంలో ఉంది. అనుబంధ బ్యాంకుల విలీనం పూర్తయితే.. 45వ స్థానానికి ఎగబాకుతుంది. సుమారు రూ.237 లక్షల కోట్ల ఆస్తులతో ది ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచం మొత్తమ్మీద అగ్రస్థానంలో ఉంది. అయితే 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిణామాల దరిమిలా భారీ బ్యాంకుల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ప్రస్తుతం దేశంలోని పరిస్థితుల్ని చూస్తే ఇక్కడ కన్సాలిడేషన్ కన్నా ఎక్కువ బ్యాంకులుంటేనే మేలు. ఇంకా కొత్త బ్యాంకులొస్తున్నాయి కనక పోటీ పెరిగి, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యపడుతుంది. విలీనమైతే పోటీ బ్యాంకులకన్నా ఎస్బీఐ భారీగా ఎదిగిపోతుంది. గుత్తాధిపత్యానికి దారి తీయొచ్చు’’ అని బ్యాంకింగ్ నిపుణుడొకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ విషయమై ఒక నివేదిక ఇస్తూ... ‘‘ఎస్బీఐలోకి దాదాపు 70వేల మంది కొత్త సిబ్బంది వస్తారు. అంటే 34 శాతం మంది. వ్యాపార పరిమాణమేమో 25 శాతం పెరుగుతుంది. ఆ సిబ్బందిని దీనికి అనుసంధానించటమన్నది అంత తేలిక కాదు. కాకపోతే దీర్ఘకాలికంగా లాభాలుంటాయి. ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి’’ అని అభిప్రాయపడింది. భారీ బ్యాంకులు అక్కర్లేదు: యూనియన్లు ఎస్బీఐతో విలీనమైతే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుబంధ బ్యాంకుల ఉద్యోగుల్లో ఆందోళన రేగుతోంది. అనుబంధ బ్యాంకుల్లో పెన్షన్ సదుపాయం లేని చాలా మందికి ఎస్బీఐలో విలీనంతో రిటైర్మెంట్పరమైన కొన్ని ప్రయోజనాలు దక్కనున్నప్పటికీ .. సీనియారిటీ సమస్యలతో ప్రమోషన్ల అవకాశాలు దెబ్బతింటాయనేది వారి భయం. దీనికి వ్యతిరేకంగా అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు గత నెల 20న దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. మరోవంక చాలా చోట్ల ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకుల శాఖలు సమీపంలో ఉన్నాయి. విలీనం తరవాత హేతుబద్ధీకరణ తప్పదు. ఇదే జరిగితే బదిలీలు ఖాయమని, తాము ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియటం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఎస్బీహెచ్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ సీపీఐ జనరల్ సెక్రటరీ సురవరం సుధాకర్ రెడ్డి ఇటీవలే డిమాండ్ చేశారు. ఇక, కేరళ కేంద్రంగా పనిచేసే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావంకోర్ (ఎస్బీటీ) విలీనాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం విషయంలో కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు నేడు (గురువారం) ఆఫీస్ బేరర్స్ సమావేశం కానున్నట్లు ఆలిండియా బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశానికి కావాల్సింది పటిష్టమైన, సరైన బ్యాంకులే తప్ప భారీ బ్యాంకులు కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.