ఇండియా సిమెంట్స్‌, ఎస్కార్ట్స్‌.. స్పీడ్‌ | India Cements, Escorts ltd shares zoom | Sakshi
Sakshi News home page

ఇండియా సిమెంట్స్‌, ఎస్కార్ట్స్‌.. స్పీడ్‌

Published Sat, May 23 2020 2:59 PM | Last Updated on Sat, May 23 2020 3:01 PM

India Cements, Escorts ltd shares zoom - Sakshi

ఇటీవల దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇందుకు విభిన్న వార్తలు ప్రభావం చూపుతున్నాయి. గత ఆరు రోజులుగా దక్షిణాది సంస్థ ఇండియా సిమెంట్స్‌, ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ జోరు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో ఈ కౌంటర్లు ఏడాది గరిష్లాలను సైతం తాకాయి. ఇతర వివరాలు చూద్దాం.. 

ఇండియా సిమెంట్స్‌
డీమార్ట్‌ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ప్రమోటర్లు వాటాలు కొంటున్న వార్తలతో కొద్ది రోజులుగా ఇండియా సిమెంట్స్‌ కౌంటర్‌ వెలుగులో నిలుస్తోంది. ఈ నెల 14న డీమార్ట్‌ ప్రమోటర్‌ రాధాకిషన్‌ దమానీ.. కుటుంబ సభ్యులతో కలసి ఇండియా సిమెంట్స్‌లో ఏకంగా 4.7 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇది కంపెనీ ఈక్విటీలో 15.16 శాతం వాటాకు సమానంకాగా.. దమానీ కుటుంబం వాటా ఇండియా సిమెంట్స్‌లో 19.89 శాతానికి ఎగసింది. 2019 డిసెంబర్‌ చివరికల్లా ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుటుంబీకుల వాటా 4.73 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో గత ఆరు రోజులుగా ఇండియా సిమెంట్స్‌ షేరు లాభపడుతూ వచ్చింది. శుక్రవారం సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 132 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 135కు ఎగసింది. ఇది రెండేళ్ల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2018 మే 9న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యయింది. గత ఆరు రోజుల్లో ఈ షేరు 33 శాతం పుంజుకోవడం విశేషం! కొద్ది రోజులుగా పెట్‌ కోక్‌ ధరలు క్షీణించడంతోపాటు.. లాక్‌డవున్‌ తదుపరి నిర్మాణ రంగ కార్యకలాపాలు ఊపందుకోనున్న అంచనాలు ఇటీవల సిమెంట్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెంచుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ 
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడం, ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలపై ఆశావహ అంచనాలు.. ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌కు జోష్‌నిస్తున్నాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతులు, శ్రామికులకు ప్రోత్సాహక చర్యలు ప్రకటించడానికితోడు, ఈ సీజన్‌లో సగటు వర్షపాత అంచనాలు ఇకపై వ్యవసాయ రంగానికి ఊతమివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకోగలవన్న అంచనాలు పెరుగుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ షేరు 3 శాతం ఎగసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 919 వరకూ దూసుకెళ్లింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో ఈ షేరు 16 శాతం జంప్‌చేసింది. ఇక గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 10 శాతం పెరిగి రూ. 128 కోట్లకు చేరగా.. పన్నుకు ముందు లాభం 4 శాతం పుంజుకుని రూ. 179 కోట్లను తాకింది. అయితే కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం  16 శాతం క్షీణించి రూ. 1386 కోట్లకు పరిమితమైంది. ఇటీవల ఎస్కార్ట్స్‌లో 10 శాతం వాటాను జపనీస్‌ దిగ్గజం క్యుబోటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement