మార్కెట్లు తీవ్ర ఆటుపోట్ల మధ్య లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో ఫార్మా దిగ్గజం బయోకాన్, పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
బయోకాన్ లిమిటెడ్
మైలాన్ ఎన్‌వీతో భాగస్వామ్యంలో రూపొందించిన ఇన్సులిన్ ఇంజక్షన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో బయోకాన్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 395 వద్ద ట్రేడవుతోంది. సెమ్‌గ్లీ బ్రాండుతో ఇన్సులిన్ గ్లార్గిన్ ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టినట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. అధిక బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు వీటిని వినియోగించవచ్చని తెలియజేసింది. యూఎస్‌లో వీటిని 3ఎంఎల్ డోసేజీలో ఐదు ఇంజక్షన్ల సెట్‌ను 148 డాలర్లకు, 10 ఎంఎల్ ఇంజక్షన్‌ను 99 డాలర్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. తద్వారా యూఎస్‌లో అత్యంత చౌకగా ఇన్సులిన్ ఇంజక్షన్‌ను అందిస్తున్నట్లు వివరించింది.
ఎన్‌టీపీసీ లిమిటెడ్
బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వాటాదారుల అనుమతి కోరనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీ పేర్కొంది. ప్రయివేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా బాండ్ల జారీ చేసే అంశంపై ఈ నెల 24న చేపట్టనున్న వార్షిక సమావేశంలో బోర్డు నిర్ణయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌టీపీసీ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది.
ఎస్కార్ట్స్ లిమిటెడ్
గత నెల(ఆగస్ట్)లో ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 80 శాతం దూసుకెళ్లి 7,268 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. కంపెనీ చరిత్రలోనే ఆగస్ట్‌లో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారని పేర్కొంది. వీటిలో ఎగుమతులు రెట్టింపై 518 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. రుతుపవనాలు, పెరిగిన ఖరీఫ్ పంటల సాగు, రిటైల్ ఫైనాన్స్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 1,154కు చేరింది. ప్రస్తుతం 2.2 శాతం లాభంతో రూ. 1,111 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment