బీర్లు తయారు చేయడం మగళవాళ్ల పని, ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా నిరుత్సాహపరిచింది సమాజం. ఉద్యోగాలు చేయడం వరకు ఓకే కానీ ఆడవాళ్లు కంపెనీలను స్థాపించి వాటిని సజావుగా నిర్వహించలేరంటూ అనుమానపు చూపులు చూసింది లోకం. అయితే చుట్టుముట్టిన నిరుత్సాహాన్ని, నెత్తినెక్కి నాట్యం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేసింది కిరణ్ మజుందార్ షా. కాదన్న చోటే 4.4 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి షాహెన్‌షా అయ్యింది. ఆమె ఆస్తుల విలువనే రూ.27 వేల కోట్లకు పైమాట.
బ్రూయింగ్ కోర్సు
ఆది నుంచి కిరన్ మజుందార్‌షాది భిన్నమైన వ్యక్తిత్వం. నలుగురు నడిచే దారిని కిరణ్ ఎంచుకోలేదు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వెంటనే మద్యం తయారీకి సంబంధించి బ్రూయింగ్ టెక్నాలజీ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడంతా నిరూత్సపరచడంతో ఆ కోర్సు చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. మెల్‌బోర్న్ యూనివర్సిటీ నుంచి 1975లో బ్రూయింగ్ కోర్సులో ఏకైక విద్యార్థినిగా ఉంటూ మగవాళ్లందరినీ పక్కకు నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది.
బీర్ల తయారీలో ఆడవాళ్లేంటి?
ఆస్ట్రేలియాలో బ్రూయింగ్ కోర్సులో పట్టా పుచ్చుకుని ఇండియా వచ్చిన కిరణ్ మజుందార్ మొదట కోలకత్తాలోని జూపిటర్ బ్రూవరీస్‌లో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత బరోడాలో పని చేసింది. మూడో ప్రయత్నంగా బెంగళూరుకు చేరుకుంది. అయితే ఇక్కడ మరోసారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి అమెకు ప్రతికూలత ఎదురైంది. బ్రూయింగ్ ఇండస్ట్రీలో మహిళలు ఏంటీ అవ్వా..! అంటూ ముక్కున వేలేసుకున్నారు. చేతిలో మాస్టర్స్ పట్టా... పెద్ద పెద్ద సంస్థల్లో అనుభవం ఉన్నా మాస్టర్ బ్రూవర్‌గా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి స్థానిక కంపెనీలు ముందుకు రాలేదు.
బయోకాన్‌కి బీజం
ఇండియాలో మాస్టర్ బ్రూవర్ అయ్యేందుకు అవకాశాలు లేకపోవడంతో తిరిగి విదేశాల వైపు చూసింది కిరణ్ మజుందార్ షా. మద్యం తయారీలో ప్రసిద్ధి చెందిన స్కాట్‌లాండ్‌లో ఈ తరహా అవకాశాలు ఉన్నట్టుగా తెలియడంతో అటువైపుగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌కి చెందిన బయోకాన్ బయోకెమికల్స్ లిమిటెడ్ యజమాని కార్క్‌తో పరిచయం అయ్యింది. అప్పటికే బయోకాన్ సంస్థ బ్రూవింగ్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వ్యాపారానికి అవసరమైన ఎంజైములు ఉత్పత్తి చేస్తోంది. ఎప్పటి నుంచో బయోకాన్‌ను ఇండియాకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు కార్క్. ఆయనకు కిరన్ మజుందార్ షా ఓ ఆశా కిరణంలా కనిపించింది.
లోన్లు ఇవ్వలేం
కిరణ్ మజుందార్ నేతృత్వంలో ఇండియాలో 1978లో బయోకాన్ ప్రారంభమైంది. అయితే అప్పటికీ కిరణ్ మజుందార్‌షా ముప్పైవ పడిలోనే ఉండటంతో.. చిన్న వయసు, పెద్దగా అనుభవం లేదు, పైగా ఎంజైముల వ్యాపారమంటా అంటూ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. విదేశీయుల నుంచి సపోర్ట్ ఉన్నా స్థానికంగా మద్దతు ఆమెకు కష్టమైనంది. దీంతో పెట్టుబడి చాలక కారు షెడ్డులోనే ఎంజైములు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో నమ్మకం కుదిరి పెట్టుబడులు వచ్చాయి.
ఊపిరులూదిన బొప్పాయి
మొదటి సారి ఫండింగ్ లభించకగానే కారు షెడ్డు నుంచి మూడు వేల గజాల స్థలంలోకి బయోకాన్ షిఫ్ట్ అయ్యింది. ఈ సమయం బొప్పాయి నుంచి కొత్త రకం ఎంజైమ్‌ను కనుగొంది కిరణ్. ఆ తర్వాత కాలంలో బీరును శుద్ధి చేయడంలో ఈ ఎంజైమ్ కీలకంగా మారింది. అంతే ఒక్కసారిగా బయోకాన్ బాలారిష్టాలు తొలగిపోయాయి. ఈ ఎంజైమ్‌ను స్థానికంగానే కాకుండా అమెరికా, యూరప్ వంటి విదేశాలకు కూడా ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది.
పెర్‌ఫెక్ట్ ప్లానింగ్
తొలి ఏడాది వచ్చిన లాభాలను చూసి మురిసిపోలేదు కిరణ్. ఎంతో ముందు చూపుతో వ్యవహారించి బెంగళూరు సమీపంలో 20 ఎకరాల స్థలం కొనుగోలు చేసి బయోకాన్‌ను అక్కడికి తరలించింది. అంతేకాదు బయోకాన్ కంపెనీని బయోకాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మార్చింది. ఆ తర్వాత ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభించింది. ఇక అడ్కి నుంచి బయోకాన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఒకానొక దశలో దేశంలోనే అత్యంత సంపన్న బిజినెస్ ఉమన్‌గా గుర్తింపు పొందారు కిరణ్ మజుందార్‌షా. ప్రస్తుతం ఆమె సంపద విలువ రూ. 27వేల కోట్లు. బయోకాన్ మార్కెట్ క్యాప్ 4.4 బిలియన్ డాలర్లు
అడ్డంకులు అధిగమిస్తేనే
మిగిలిన విద్యార్థినులకు భిన్నంగా ఎంజైమ్స్ టెక్నాలజీని ఎంచుకుంది. తాను సాధించిన డిగ్రీకి తగ్గట్టుగా బీర్ల తయారు చేయడం ఆమె లక్ష్యం. కానీ ట్రైనింగ్ నుంచే ఆమెను నిరుత్సాహ పరిచింది తోటి సమాజం. మహిళలు ఎక్కడైనా బీర్ల తయారీ చేస్తారా ? అది మగవాళ్ల ప్రొఫెషన్ ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. బీర్లు తయారు చేయడంలో విఫలమైనా.. అదే ఎంజైములతో కొత్త వ్యాపారం ప్రారంభించి ఈ రోజు సక్సెస్‌ఫుల్ వుమన్‌గా ఆమె నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment