Kiran Mazumdar-Shaw
-
ఇన్కమ్ ట్యాక్స్ ఓకే.. మీకు ఈ ‘పింక్ ట్యాక్స్’ గురించి తెలుసా?
బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా ‘పింక్ ట్యాక్స్’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుషులు తమ అందం కోసం వినియోగించే ప్రొడక్ట్‌ల ధరల కంటే మహిళల ఉపయోగించే ప్రొడక్ట్‌ల ధరలు ఎక్కువ ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. అంతేకాదు ఆ తరహా వస్తువుల్ని కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రకారం..లింగ ఆధారిత ధరల అసమానతలు అనేక రంగాలలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అధికం. ఉదాహరణకు, మహిళలకు, పురుషుల కోసం ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, లోషన్లు, డియోడరెంట్ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోపై మంజుదార్ షా స్పందించారు. ఆ వీడియోని 1.5లక్షల మంది వీక్షించారు. ప్రభుత్వం విధించే పన్నుకాదు పింక్ ట్యాక్స్ అనేది అసలు ప్రభుత్వ పన్ను కాదు. ఇది మహిళలకు విక్రయించబడే వస్తువుల ధరను పెంచే వివక్షతతో కూడిన ధరలను సూచిస్తుంది. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9 — Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 పింక్ టాక్స్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ గురించి తెలుసు. మరి ఈ పింక్ ట్యాక్స్ అంటే? ఉదాహరణకు సమ్మర్ సీజన్లో మహిళలు చర్మం పాడవుకుండా పలు స్కిన్ కేర్ ప్రొడక్ట్‌లు వాడుతుంటారు. అలాగే పురుషులు కూడా. అయితే మహిళలు కొనుగోలు చేసిన స్కిన్ కేర్ ప్రొడక్ట్ ధర రూ.100 ఉంటే, పురుషుల స్కిన్ కేర్ ప్రొడక్ట్ దర రూ.80 ఉంటుంది. అంటే పురుషులు - మహిళలు వినియోగించే ధరల మధ్య వ్యత్యాసం. అలా ధరల మధ్య వ్యత్యాసం ఎందుకనే మంజుదార్ షా అడుగుతున్నారు. ఇలా ఒక్క మంజుదార్ షానే కాదు ఐక్యరాజ్య సమితి సైతం పింక్ ట్యాక్స్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పింక్ ట్యాక్స్‌ను తొలగించాలి మహిళలు ఆర్థిక వ్యవస్థలో పూర్తి, సమాన భాగస్వామ్యాన్ని సాధించేలా పింక్ ట్యాక్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. పింక్ టాక్స్ వల్ల ఆర్థిక భారం డబ్ల్యూఈఎఫ్ ప్రకారం.. వివక్షతతో కూడిన ధరల వల్ల మహిళలపై ఆర్థిక భారం పడుతోంది. పురుషుల కంటే మహిళలు తక్కువ సంపాదిస్తున్నారు. ముఖ్యంగా, పింక్ ట్యాక్స్ విధించే ఉత్పత్తులను కొనుగోలు చేయడం మహిళలపై ఆర్ధిక భారం పెరుగుతోంది. -
బయోటెక్నాలజీలో సాంకేతికతకు కీలక పాత్ర
న్యూఢిల్లీ: భవిష్యత్తులో బయోటెక్నాలజీ రంగ వృద్ధిలోనూ, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలోనూ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషించగలదని బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. నియంత్రణ ప్రక్రియలను సంస్కరించేందుకు, నూతన ఔషధాలను చాలా తక్కువ వ్యవధిలోనే మార్కెట్‌కు చేర్చేందుకు, వివిధ రంగాల్లో టెక్నాలజీని మరింత సమర్ధంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఒక ఐడియా అత్యంత తక్కువ సమయంలో, ఏడాది వ్యవధిలోనే ప్రయోగశాల నుంచి మార్కెట్‌కు చేరగలిగితే బాగుంటుందని, ఇందుకోసం మన నియంత్రణ ప్రక్రియలను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని మజుందార్–షా చెప్పారు. దీనికోసం జనరేటివ్ ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటా ఆనలిటిక్స్ మొదలైనవి ఉపయోగపడగలవని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఉత్పత్తులను ఆమోదించడానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో నియంత్రణ సంస్థలు చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంటాయని మజుందార్–షా తెలిపారు. నియంత్రణ అధికారులకు టెక్నికల్ నైపుణ్యాలు ఉండి, టెక్నాలజీపై అవగాహన ఉంటేనే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. -
మరోసారి ఫీట్ రిపీట్ చేసిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తన ఫీట్‌ను రిపీట్ చేశారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక గ్లోబల్ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మల మరోసారి చోటు దక్కించుకున్నారు. ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వరుసగా నాలుగోసారి చోటు దక్కించుకున్నారు. ఈమెతోపాటు ఆరుగురు భారతీయ మహిళలుకూడా ఉన్నారు. (సరికొత్త స్మార్ట్‌ఫోన్ టెక్నో పోవా-4: ధర, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి!) 2022 ఫోర్బ్స్ లిస్టులో సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో మంత్రి జాబితాలో 37వ స్థానంలో 2020లో 41వ స్థానంలోనూ, 2019లో 34వ స్థానంలోనూ ఉన్నారు. ఇంకా హెచ్‌సిఎల్‌టెక్ చైర్పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 53 ర్యాంకు సాధించారు. సెబీ తొలి చైర్పర్సన్ మధాబి పూరి బుచ్ 54, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్ 67ను స్థానంలో నిలిచారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా 72వ ప్లేస్‌ను, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ 89వ ప్లేస్‌లోనూ నిలిచారు. (ట్రేడర్లకు గుడ్ న్యూస్: ఆర్బీఐ కీలక నిర్ణయం) కాగా ఫోర్బ్స్ టాప్-100 మోస్ట్ పవర్ ఫుల్ మహిళల జాబితాలో యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ టాప్ ప్లేస్ కొట్టేశారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హ్యారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. 100వ ర్యాంక్‌లో, ఇరాన్‌కు చెందిన జినా "మహ్సా" అమిని మరణానంతరం ప్రభావవంతమైన జాబితాలో చేరారు. సెప్టెంబరులో ఆమె మరణం ఇస్లామిక్ దేశంలో హక్కుల కోసం అపూర్వమైన మహిళల నేతృత్వంలోని విప్లవానికి దారితీసింది. జాబితాలో 39 మంది సీఈవోలు, 10 దేశాధినేతలు,11 బిలియనీర్లు ఉన్నారని వీరిసంపద సంయుక్తంగా 115 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ ప్రకటించింది. -
బయోకాన్ కిరణ్ మజుందార్‌షా ఇంట తీవ్ర విషాదం
బయోకాన్ ఎండీ లేడీబాస్ కిరణ్ మజుందార్‌షా ఇంట విషాదం చోటు చేసుకుంది. కిరణ్ మజుందార్ తల్లి యామిని (91) శుక్రవారం కన్ను మూశారు. మగవాళ్ల ఆధిపత్యం అధికంగా ఉండే బ్రూయింగ్ ఇండస్ట్రీలో కిరణ్ మజుందార్ షా ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో యామిని మజుందార్ కీలక పాత్ర పోషించారు. కీలక సమయాల్లో కూతురికి అండగా ఉంటూ చేదోడు వాదోడుగా నిలిచారు. తల్లి మరణం తనకు ఎంతో తీరని లోటని కిరణ్ మజుందార్‌షా పేర్కొన్నారు. తన జీవిత కాలంలో ఎక్కువ భాగం ఇంటి బాధ్యతలకే పరమితమయ్యారు యామిని. భర్త చనిపోయిన తర్వాత కిరణ్ ప్రోత్సాహంతో 68వ ఏట జీవెల్స్ పేరుతో లాండ్రీ బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంస్థను సమర్థంగా నిర్వహిస్తూ వచ్చారు యామిని. వ్యాపారాలతో పాటు సామాజిక అంశాల పట్ల కూడా యామిని చురుగ్గా ఉండేవారు. తన పద్దెనిమిదవ ఏట నుంచి చివరి శ్వాస వరకు ప్రతీ ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకున్నారు. A big bright light has gone out of my life. My darling mother Yamini passed away today - she has left a huge void. Om Shanthi 🙏 pic.twitter.com/vpSU7unqWD — Kiran Mazumdar-Shaw (@kiranshaw) June 3, 2022 చదవండి: ఆరోజున ముక్కున వేలేసుకున్నవారే? ఈ రోజు మురిసిపోతున్నారు ! -
బీర్లు తయారు చేయడంలో ఫెయిల్.. ఇప్పుడు బిలియనీర్ అయ్యింది!
బీర్లు తయారు చేయడం మగళవాళ్ల పని, ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా నిరుత్సాహపరిచింది సమాజం. ఉద్యోగాలు చేయడం వరకు ఓకే కానీ ఆడవాళ్లు కంపెనీలను స్థాపించి వాటిని సజావుగా నిర్వహించలేరంటూ అనుమానపు చూపులు చూసింది లోకం. అయితే చుట్టుముట్టిన నిరుత్సాహాన్ని, నెత్తినెక్కి నాట్యం చేస్తున్న అనుమానాలను పటాపంచలు చేసింది కిరణ్ మజుందార్ షా. కాదన్న చోటే 4.4 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి దానికి షాహెన్షా అయ్యింది. ఆమె ఆస్తుల విలువనే రూ.27 వేల కోట్లకు పైమాట. బ్రూయింగ్ కోర్సు ఆది నుంచి కిరన్ మజుందార్షాది భిన్నమైన వ్యక్తిత్వం. నలుగురు నడిచే దారిని కిరణ్ ఎంచుకోలేదు. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వెంటనే మద్యం తయారీకి సంబంధించి బ్రూయింగ్ టెక్నాలజీ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. ఇక్కడంతా నిరూత్సపరచడంతో ఆ కోర్సు చదివేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లింది. మెల్బోర్న్ యూనివర్సిటీ నుంచి 1975లో బ్రూయింగ్ కోర్సులో ఏకైక విద్యార్థినిగా ఉంటూ మగవాళ్లందరినీ పక్కకు నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. బీర్ల తయారీలో ఆడవాళ్లేంటి? ఆస్ట్రేలియాలో బ్రూయింగ్ కోర్సులో పట్టా పుచ్చుకుని ఇండియా వచ్చిన కిరణ్ మజుందార్ మొదట కోలకత్తాలోని జూపిటర్ బ్రూవరీస్లో జాయిన్ అయ్యింది. ఆ తర్వాత బరోడాలో పని చేసింది. మూడో ప్రయత్నంగా బెంగళూరుకు చేరుకుంది. అయితే ఇక్కడ మరోసారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి అమెకు ప్రతికూలత ఎదురైంది. బ్రూయింగ్ ఇండస్ట్రీలో మహిళలు ఏంటీ అవ్వా..! అంటూ ముక్కున వేలేసుకున్నారు. చేతిలో మాస్టర్స్ పట్టా... పెద్ద పెద్ద సంస్థల్లో అనుభవం ఉన్నా మాస్టర్ బ్రూవర్‌గా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి స్థానిక కంపెనీలు ముందుకు రాలేదు. బయోకాన్‌కి బీజం ఇండియాలో మాస్టర్ బ్రూవర్ అయ్యేందుకు అవకాశాలు లేకపోవడంతో తిరిగి విదేశాల వైపు చూసింది కిరణ్ మజుందార్ షా. మద్యం తయారీలో ప్రసిద్ధి చెందిన స్కాట్లాండ్లో ఈ తరహా అవకాశాలు ఉన్నట్టుగా తెలియడంతో అటువైపుగా ఆలోచనలు చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌కి చెందిన బయోకాన్ బయోకెమికల్స్ లిమిటెడ్ యజమాని కార్క్‌తో పరిచయం అయ్యింది. అప్పటికే బయోకాన్ సంస్థ బ్రూవింగ్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్యాకేజింగ్ వ్యాపారానికి అవసరమైన ఎంజైములు ఉత్పత్తి చేస్తోంది. ఎప్పటి నుంచో బయోకాన్‌ను ఇండియాకు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు కార్క్. ఆయనకు కిరన్ మజుందార్ షా ఓ ఆశా కిరణంలా కనిపించింది. లోన్లు ఇవ్వలేం కిరణ్ మజుందార్ నేతృత్వంలో ఇండియాలో 1978లో బయోకాన్ ప్రారంభమైంది. అయితే అప్పటికీ కిరణ్ మజుందార్‌షా ముప్పైవ పడిలోనే ఉండటంతో.. చిన్న వయసు, పెద్దగా అనుభవం లేదు, పైగా ఎంజైముల వ్యాపారమంటా అంటూ లోన్లు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. విదేశీయుల నుంచి సపోర్ట్ ఉన్నా స్థానికంగా మద్దతు ఆమెకు కష్టమైనంది. దీంతో పెట్టుబడి చాలక కారు షెడ్డులోనే ఎంజైములు తయారు చేసి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో నమ్మకం కుదిరి పెట్టుబడులు వచ్చాయి. ఊపిరులూదిన బొప్పాయి మొదటి సారి ఫండింగ్ లభించకగానే కారు షెడ్డు నుంచి మూడు వేల గజాల స్థలంలోకి బయోకాన్ షిఫ్ట్ అయ్యింది. ఈ సమయం బొప్పాయి నుంచి కొత్త రకం ఎంజైమ్‌ను కనుగొంది కిరణ్. ఆ తర్వాత కాలంలో బీరును శుద్ధి చేయడంలో ఈ ఎంజైమ్ కీలకంగా మారింది. అంతే ఒక్కసారిగా బయోకాన్ బాలారిష్టాలు తొలగిపోయాయి. ఈ ఎంజైమ్‌ను స్థానికంగానే కాకుండా అమెరికా, యూరప్ వంటి విదేశాలకు కూడా ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. పెర్ఫెక్ట్ ప్లానింగ్ తొలి ఏడాది వచ్చిన లాభాలను చూసి మురిసిపోలేదు కిరణ్. ఎంతో ముందు చూపుతో వ్యవహారించి బెంగళూరు సమీపంలో 20 ఎకరాల స్థలం కొనుగోలు చేసి బయోకాన్‌ను అక్కడికి తరలించింది. అంతేకాదు బయోకాన్ కంపెనీని బయోకాన్ ఫార్మాస్యూటికల్ కంపెనీగా మార్చింది. ఆ తర్వాత ఆర్ అండ్ డీ సెంటర్ ప్రారంభించింది. ఇక అడ్కి నుంచి బయోకాన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఒకానొక దశలో దేశంలోనే అత్యంత సంపన్న బిజినెస్ ఉమన్‌గా గుర్తింపు పొందారు కిరణ్ మజుందార్‌షా. ప్రస్తుతం ఆమె సంపద విలువ రూ. 27వేల కోట్లు. బయోకాన్ మార్కెట్ క్యాప్ 4.4 బిలియన్ డాలర్లు అడ్డంకులు అధిగమిస్తేనే మిగిలిన విద్యార్థినులకు భిన్నంగా ఎంజైమ్స్ టెక్నాలజీని ఎంచుకుంది. తాను సాధించిన డిగ్రీకి తగ్గట్టుగా బీర్ల తయారు చేయడం ఆమె లక్ష్యం. కానీ ట్రైనింగ్ నుంచే ఆమెను నిరుత్సాహ పరిచింది తోటి సమాజం. మహిళలు ఎక్కడైనా బీర్ల తయారీ చేస్తారా ? అది మగవాళ్ల ప్రొఫెషన్ ఇక్కడ ఆడవాళ్లు నెగ్గుకురాలేరంటూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. బీర్లు తయారు చేయడంలో విఫలమైనా.. అదే ఎంజైములతో కొత్త వ్యాపారం ప్రారంభించి ఈ రోజు సక్సెస్ఫుల్ వుమన్‌గా ఆమె నిలిచారు. -
కరోనా కట్టడికి ఇదే మార్గం! భౌతిక దూరం అంటే ఇదీ!
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 విశ్వమంతా ప్రకంపనలు పుట్టిస్తూనే వుంది. ఈ వైరస్ కట్టడికి ప్రస్తుతానికి మందు, వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రపంచమంతా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ విస్తరణ సైకిల్ ను అడ్డుకోవాలంటే భౌతిక దూరం ఒక్కటేనని అంతా అంగీకరిస్తున్నమాట. అయితే కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ , తమను తాము, అంతిమంగా చుట్టూ వున్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ ఎలా పాటించాలనే దానిపై చిన్నపిల్లలు రూపొందించిన వీడియో ఆసక్తికరంగా మారంది. భౌతిక దూరాన్ని పాటించికపోతే ప్రమాదం ఎలా వుంటుందనే అంశాన్ని చాలా నేర్పుగా వివరించిన తీరు ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఒకవైపు కరోనా విస్తరణతో ప్రపంచదేశాలన్నీ అష్ట కష్టాలు పడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తలు తలమునకలై వున్నారు. మరోవైపు వ్యాధిని నిరోధించడంలో తెలివిగా తమకున్న వనరులను ఉపయోగించుకొని భౌతిక దూరాన్ని ఎలా పాటించాలనే విషయాన్ని పిల్లలు చక్కగా వివరించడం విశేషం. అందుకే ఇది బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాను ఆకట్టుకుంది. పిల్లలు చాలా తెలివైనవారు అంటూ ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేశారు. -
హైదరాబాద్‌లో బయోకాన్ కొత్త రీసెర్చ్ సెంటర్
న్యూఢిల్లీ, హైదరాబాద్ : బయోటెక్నాలజీ దిగ్గజం బయోటక్ నగరంలో నూతన యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అంతేకాక ప్రస్తుతమున్న యూనిట్‌ను మరింత విస్తరించనున్నట్టు పేర్కొంది. బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఫార్మా దిగ్గజాలు నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సమావేశ సందర్భంగా బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, జినోమ్ వ్యాలీలో తన నూతన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రికి తెలిపారు. తమ అనుబంధ కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి హైస్కిల్స్ ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు బయోకాన్‌లో సిబ్బందిని రెట్టింపు చేస్తామని కూడా తెలిపారు. బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి, కిరణ్ మజుందార్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్, ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందని కిరన్ మజుందార్ షా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు మంత్రి లాంటి నాయకులను చూసినప్పుడు స్పూర్తి కలుగుతుందని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు వర్షం కురిపించారు. హైదరాబాద్ నగరంపైన కూడా కిరణ్ మజుందార్ షా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. వీరితో పాటు జీఈ ప్రెసిడెంట్, సీఈవో టెర్రి బ్రెసెన్హమ్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేయనున్న ఇంక్యూబేటర్లో కూడా జీఈ భాగస్వాములవ్వాలని కోరారు. ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను టెర్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్‌తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉందని టెర్రి మంత్రికి తెలిపారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సీఈవో ఉదిత్ భాత్రాతో, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో, థాయ్‌లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యప్రఫసారాతో కూడా మంత్రి సమావేశమయ్యారు. -
విశాల్‌కు మద్దతుగా కిరణ్ మజుందార్ షా
ముంబై: విశాల్ సిక్కా బోర్డు వివాదంలో బయోకాన్ చైర్ పర్సన్, ఇన్ఫీ స్వతంత్ర డైరక్టరు కిరణ్ మజుందార్ షా విశాల్ సిక్కాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇన్ఫోసిస్ బోర్డు నాయకత్వం విభేదాలు ఆందోళన కలిగించే అంశమని అంగీకరించారు. అయితే బోర్డు చాలా సమన్వయంతో కూడుకున్నదంటూ ఇన్ఫీ బోర్డుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే ఫౌండర్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు కార్పొరేట్ గవర్నెన్స్ కాదనీ.. అభిప్రాయ భేదాలని వ్యాఖ్యానించారు. అలాగే తీవ్రమైన సముపార్జన వ్యూహాలు విశాల్‌కు ఉన్నాయని తాను భావించడంలేదన్నారు. లక్ష్యాల సాధనలో ప్రమోటర్ల మద్దతు ఆయనకు బలంగా ఉందన్నారు. కాగా టాటా -మిస్త్రీ బోర్డు వివాదం తరహాలో ఇన్ఫోసిస్‌లో కూడా మేనేజ్మెంట్లో విబేధాలు తలెత్తుతున్నాయనే వార్తలు సంచలనంగా మారాయి. కంపనీకి మొదటి నాన్ ప్రమోటర్ సీఈఓ అయిన విశాల్ శిక్కాకు.. ఈ సంస్థ వ్యవస్థాపకులకు మధ్య నిర్ణయాత్మక విధానాల విషయంలో విబేధాలు మరింత ముదిరాయన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. సంస్థ విలువలకు అనుగుణంగా శిక్కా నడుచుకోవడం లేదని కొందరు ప్రమోటర్ షేర్హోల్డర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు కూడా. అటు ఇన్పీతొలి ఛైర్మన్ నారాయణ మూర్తికూడా కార్పొరేట్ గవర్నెన్స్ క్రమంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
బయోటెక్ బాంధవి
మన దిగ్గజాలు భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే గుర్తించిన దార్శనికురాలు ఆమె. జీవశాస్త్ర పరిజ్ఞానానికి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని జోడించి భారత్‌లో బయోటెక్నాలజీ పరిశ్రమనుప్రగతిపథంలో పరుగులు తీయించారామె. భారత బయోటెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక విజయకేతనం. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేకున్నా, కేవలం సంకల్పబలంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న దీక్షాదక్షత, లాభార్జనకే పరిమితం కాకుండా తన ఆస్తిలో సగభాగాన్ని సేవాకార్యక్రమాలకు కేటాయించిన వితరణశీలత ఆమెకే చెల్లింది. కిరణ్ మజుందార్ షా 1953 మార్చి 23న బెంగళూరులో స్థిరపడ్డ సామాన్య గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బెంగళూరు వర్సిటీ నుంచి 1973లో బీఎస్సీ పూర్తి చేశారు. వైద్యవిద్య చదవాలనుకున్నా, స్కాలర్షిప్ రాకపోవడంతో ఆ ఆశ నెరవేరలేదు. కిరణ్ తండ్రి రాసేంద్ర మజుందార్ యునెటైడ్ బ్రూవరీస్లో ప్రధాన బ్రూ మాస్టర్‌గా పనిచేసేవారు. ఆయన సలహాపై ఆస్ట్రేలియాలోని బాలారత్ వర్సిటీలో బ్రూయింగ్ (మద్యం తయారీ) కోర్సులో చేరారు. బ్రూయింగ్ చదువు పూర్తయ్యాక 1975లో భారత్‌కు తిరిగి వచ్చినా ఆమెనెవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఆడపిల్ల మద్యం తయారు చేయడమేంటని పెదవి విరిచారు. పదివేల పెట్టుబడితో... ‘బయోకాన్’ ఇప్పుడంటే కోట్లకు పడగలెత్తిన పరిశ్రమ గాని, కిరణ్ ఈ పరిశ్రమను పట్టుమని పదివేల రూపాయల నామమాత్రపు పెట్టుబడితో ప్రారంభించారు. బ్రూయింగ్ రంగంలో ఉద్యోగంపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఐర్లాండ్‌కు చెందిన బయోకాన్ బయోకెమికల్స్ కంపెనీ వ్యవస్థాపకుడు లెస్లీ ఆకిన్క్లోసీ రూపంలో కిరణ్‌కు అనుకోని అవకాశం లభించింది. లెస్లీ తమ కంపెనీకి భారత్‌లో భాగస్వామి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆయనకు కిరణ్ తారసపడ్డారు. ఇద్దరికీ ఒప్పందం కుదరడంతో ఒక అద్దె ఇంట్లోని కారు గ్యారేజీలో ‘బయోకాన్’ను ప్రారంభించారు. రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తే, ‘బయోటెక్నాలజీనా..? ఇంతవరకు ఆ పేరే వినలేదే’ అంటూ బ్యాంకు అధికారులు పెదవి విరిచేవారు. చివరకు తండ్రి పూచీకత్తు మీద రుణం మంజూరైంది. పేద దేశాల మార్కెట్‌పైనే దృష్టి పేద దేశాల మార్కెట్‌పైనే కిరణ్ తొలి నుంచి వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. పేటెంట్ గడువు ముగిసిన ఔషధాలను వివిధ రూపాల్లోకి మార్చి కొత్త ఔషధాలను తయారు చేయటం, కంపెనీలతో వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవటం కంపెనీకి లాభించింది. కొలెస్ట్రాల్‌ను నిరోధించే స్టాటిన్స్‌కు అప్పట్లో మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండేది. దీనిపై లోవాస్టీన్కున్న పేటెంట్ గడువు 2001లో తీరిపోవటంతో బయోకాన్ స్టాటిన్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. వ్యాపార విస్తరణపై దృష్టి సారించిన కిరణ్... వివిధ వ్యాధుల నివారణకు వాడే జీవ ఔషధాల తయారీ కోసం 1994లో సింజెనే, 2004లో క్లింజనే పేరిట అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి సలహాపై 2004లో కిరణ్ తన కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేశారు. భారత్‌లో తొలి కేన్సర్ ఔషధాన్ని 2006లో విడుదల చేసిన ఘనత బయోకాన్కే దక్కుతుంది అద్దె ఇంటి గ్యారేజీలో మొదలైన బయోకాన్ నేడు బెంగళూరు చేరువలోని హోసూరులో 80 ఎకరాల సువిశాల ప్రాంగణానికి విస్తరించి భారత బయోటెక్నాలజీ రంగంలో బయోకాన్ అతిపెద్ద సంస్థగా అవతరించింది. కిరణ్ రూ.6 వేల కోట్లకు పైగా సంపదతో సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగారు. ఆస్తిలో సగం ఆపన్నుల కోసం... వ్యాపార విజయాలు కిరణ్ మజుందార్ షాకు అనేక సత్కారాలను, పురస్కారాలను తెచ్చిపెట్టాయి. భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆమెకు ఓథ్మర్ గోల్డ్‌మెడల్ పురస్కారాన్ని బహూకరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, కిరణ్ తన ఆస్తిలో సగభాగాన్ని పూర్తిగా ఆపన్నులను ఆదుకోవడానికే కేటాయించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సత్వర వైద్యసేవల కోసం రూ.220 కోట్లతో ‘ఇరాజ్’ రోగ నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 1400 పడకల కేన్సలర్ ఆస్పత్రిని నిర్మించారు. వరద బాధితులకు మూడువేల ఇళ్లు కట్టించారు. కంపెనీ నిర్వహణకు సంసారం ప్రతిబంధకమవుతుందని భావించి చాలాకాలం పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే, 1998లో స్కాట్లాండ్ కు చెందిన జాన్షాను ప్రేమించి పెళ్లాడారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మాతృత్వానికి దూరమైన కిరణ్, బయోకానే తన బేబీ అంటారు. - దండేల కృష్ణ -
ఆ పవర్ ఫుల్ మహిళల్లో నలుగురు మనోళ్లే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో మనవాళ్లు నలుగురు నిలిచారు. ప్రపంచంలో 100మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్ ను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య(25వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్(40వ ర్యాంకు), బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా(77వ ర్యాంకు), హెచ్ టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, చైర్ పర్సన్ శోభనా భారతీయ(93వ ర్యాంకు)లు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఆరోసారి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెర్కెల్ తర్వాత స్థానం అమెరికా అధ్యక్ష అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్ ను వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జానెట్ ఎల్లెన్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. బిలీనియర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, పాలిటిక్స్, ఫిలాంథ్రఫిక్ట్స్, ఎన్ జీవోస్, టెక్నాలజీ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినుంచి ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ కేటగిరీల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. -
వీళ్లని ఫాలో అయితే విజ్ఞానం, వినోదం!
కూడు, గూడు, గుడ్డ... ఒకప్పటి మనిషి ప్రాథమ్యాలు. ఇపుడు ఆ అత్యవసర జాబితా చాలా విస్తరించింది. ఏది మిస్సయినా వెనకబడిపోతాం. అప్డేటెడ్గా ఉండాలి. వృత్తిలోనే కాదు, సమాజం గురించి కూడా నిత్యం అవగాహన కలిగి ఉండాలి. నిరంతరం టీవీ చూసో, పేపర్ చదివో ప్రాధాన్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం అంటే కాస్త కష్టమైన వ్యవహారమే. నలుగురిలో తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి... మరి అది కూడా సాధ్యం కాదే. అందుకే ఇదిగో ప్రపంచంలో అన్ని విషయాలపై ట్వీట్స్ ఇస్తుండే ఈ ఇండియన్ విమెన్ని ఫాలో అయిపోండి. ఎలాగూ చేతిలో స్మార్ట్ ఫోనో, ఇంట్లో కంప్యూటరో ఉంటుందిగా, రోజూ ఏదో ఒక సమయంలో వీళ్లిచ్చే అప్డేట్స్ తెలుసుకోండి. @writeonj: జుహి చతుర్వేది, విక్కీ డోనర్ రచయిత. @khushsundar: వివాదాలే కాదూ ఖుష్బూని ఫాలో అయితే నాలుగు విషయాలు కూడా తెలుస్తాయి. @kiranmanral: రిలక్టెంట్ డిటెక్టివ్ రచయిత. స్త్రీల హక్కుల గురించి బాగా ప్రచారం చేస్తుంటారు. @kiranshaw: కిరణ్ మజుందార్ షా. బయోకాన్ ఎండీ. అద్భుతంగా ట్వీట్స్ చేస్తారని ప్రతీతి. స్ఫూర్తిదాయకమైన వ్యాపారి. @MissMalini: సెలబ్రిటీ బ్లాగర్. ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ట్వీట్స్ ఇస్తుంటారు. ఫాలో అయితే ఫన్. @namitabhandare: జర్నలిస్ట్. సోషల్ థింకర్. అనేక అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి. @saffrontrail: నందితా అయ్యర్ ఈమె. ఫుడ్ అండ్ హెల్త్ రైటర్. పోషకాషార నిపుణురాలు. ఆహారం, సంగీతంపై మంచి ట్వీట్స్ ఇస్త్తుంటారు. @nilanjanaroy: నీలాంజన రాయ్. అన్నీ ఫాలో అవుతూ మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయంపై ట్వీట్స్ ఇస్తారు. @Padmasree: సిస్కో ఉన్నతాధికారి. టెక్నాలజీ రంగంలో ఉన్న మహిళల కోసం ఈమె బోలెడు ట్వీట్లు ఇస్తారు. @Rajyasree: రెస్టారెంట్ యజమాని, ఫుడీ, కాలమిస్ట్, జర్నలిస్టులు కావాలనుకునే వారికి మంచి స్ఫూర్తి. @RupaSubramanya: ఇండియానామిక్స్ సహ రచయిత. విసృ్తతమైన అంశాలపై స్పందిస్తుంటారు. @shailichopra: తెహల్కా కాలమిస్ట్. బిజినెస్ న్యూస్‌పై ట్వీట్స్‌తో అప్డేట్ చేస్తూ ఉంటారు. @suchetadalal: మనీలైఫ్ మేనేజింగ్ ఎడిటర్. వ్యక్తిగత, సామాజిక ఆర్థిక వ్యవహారాలపై సాధికారిక వ్యాఖ్యలు చేస్తారు. @calamur: హరిణి క్లామర్. బ్లాగర్, కాలమిస్ట్, టీచర్. రోజూ ప్రధాన వార్తల గురించి నర్మగర్భంగా కామెంట్స్ చేస్తుంటారు. @ShomaChaudhury: తెహల్కా మేనేజింగ్ ఎడిటర్. ప్రతి ట్వీట్‌కు ఒక విలువ, తూకం ఉంటాయి.