బయోటెక్ బాంధవి
మన దిగ్గజాలు
భవిష్యత్తు బయోటెక్నాలజీదేనని దాదాపు నాలుగు దశాబ్దాల కిందటే గుర్తించిన దార్శనికురాలు ఆమె. జీవశాస్త్ర పరిజ్ఞానానికి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని జోడించి భారత్‌లో బయోటెక్నాలజీ పరిశ్రమనుప్రగతిపథంలో పరుగులు తీయించారామె. భారత బయోటెక్నాలజీ రంగంలో కిరణ్ మజుందార్ షా ఒక విజయకేతనం. ఎలాంటి వ్యాపార నేపథ్యం లేకున్నా, కేవలం సంకల్పబలంతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న దీక్షాదక్షత, లాభార్జనకే పరిమితం కాకుండా తన ఆస్తిలో సగభాగాన్ని సేవాకార్యక్రమాలకు కేటాయించిన వితరణశీలత ఆమెకే చెల్లింది.
కిరణ్ మజుందార్ షా 1953 మార్చి 23న బెంగళూరులో స్థిరపడ్డ సామాన్య గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బెంగళూరు వర్సిటీ నుంచి 1973లో బీఎస్సీ పూర్తి చేశారు. వైద్యవిద్య చదవాలనుకున్నా, స్కాలర్‌షిప్ రాకపోవడంతో ఆ ఆశ నెరవేరలేదు. కిరణ్ తండ్రి రాసేంద్ర మజుందార్ యునెటైడ్ బ్రూవరీస్‌లో ప్రధాన బ్రూ మాస్టర్‌గా పనిచేసేవారు. ఆయన సలహాపై ఆస్ట్రేలియాలోని బాలారత్ వర్సిటీలో బ్రూయింగ్ (మద్యం తయారీ) కోర్సులో చేరారు. బ్రూయింగ్ చదువు పూర్తయ్యాక 1975లో భారత్‌కు తిరిగి వచ్చినా ఆమెనెవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు. ఆడపిల్ల మద్యం తయారు చేయడమేంటని పెదవి విరిచారు.
పదివేల పెట్టుబడితో...
‘బయోకాన్’ ఇప్పుడంటే కోట్లకు పడగలెత్తిన పరిశ్రమ గాని, కిరణ్ ఈ పరిశ్రమను పట్టుమని పదివేల రూపాయల నామమాత్రపు పెట్టుబడితో ప్రారంభించారు. బ్రూయింగ్ రంగంలో ఉద్యోగంపై ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఐర్లాండ్‌కు చెందిన బయోకాన్ బయోకెమికల్స్ కంపెనీ వ్యవస్థాపకుడు లెస్లీ ఆకిన్‌క్లోసీ రూపంలో కిరణ్‌కు అనుకోని అవకాశం లభించింది. లెస్లీ తమ కంపెనీకి భారత్‌లో భాగస్వామి కోసం అన్వేషిస్తున్న సమయంలో ఆయనకు కిరణ్ తారసపడ్డారు. ఇద్దరికీ ఒప్పందం కుదరడంతో ఒక అద్దె ఇంట్లోని కారు గ్యారేజీలో ‘బయోకాన్’ను ప్రారంభించారు. రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తే, ‘బయోటెక్నాలజీనా..? ఇంతవరకు ఆ పేరే వినలేదే’ అంటూ బ్యాంకు అధికారులు పెదవి విరిచేవారు. చివరకు తండ్రి పూచీకత్తు మీద రుణం మంజూరైంది.
పేద దేశాల మార్కెట్‌పైనే దృష్టి
పేద దేశాల మార్కెట్‌పైనే కిరణ్ తొలి నుంచి వ్యూహాత్మకంగా దృష్టి సారించారు. పేటెంట్ గడువు ముగిసిన ఔషధాలను వివిధ రూపాల్లోకి మార్చి కొత్త ఔషధాలను తయారు చేయటం, కంపెనీలతో వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకోవటం కంపెనీకి లాభించింది. కొలెస్ట్రాల్‌ను నిరోధించే స్టాటిన్స్‌కు అప్పట్లో మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉండేది. దీనిపై లోవాస్టీన్‌కున్న పేటెంట్ గడువు 2001లో తీరిపోవటంతో బయోకాన్ స్టాటిన్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. వ్యాపార విస్తరణపై దృష్టి సారించిన కిరణ్... వివిధ వ్యాధుల నివారణకు వాడే జీవ ఔషధాల తయారీ కోసం 1994లో సింజెనే, 2004లో క్లింజనే పేరిట అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేశారు. ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి సలహాపై 2004లో కిరణ్ తన కంపెనీని స్టాక్ మార్కెట్‌లో నమోదు చేశారు. భారత్‌లో తొలి కేన్సర్ ఔషధాన్ని 2006లో విడుదల చేసిన ఘనత బయోకాన్‌కే దక్కుతుంది అద్దె ఇంటి గ్యారేజీలో మొదలైన బయోకాన్ నేడు బెంగళూరు చేరువలోని హోసూరులో 80 ఎకరాల సువిశాల ప్రాంగణానికి విస్తరించి భారత బయోటెక్నాలజీ రంగంలో బయోకాన్ అతిపెద్ద సంస్థగా అవతరించింది. కిరణ్ రూ.6 వేల కోట్లకు పైగా సంపదతో సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి ఎదిగారు.
ఆస్తిలో సగం ఆపన్నుల కోసం...
వ్యాపార విజయాలు కిరణ్ మజుందార్ షాకు అనేక సత్కారాలను, పురస్కారాలను తెచ్చిపెట్టాయి. భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’ అవార్డులతో సత్కరించింది. అమెరికాకు చెందిన కెమికల్ హెరిటేజ్ ఫౌండేషన్ ఆమెకు ఓథ్మర్ గోల్డ్‌మెడల్ పురస్కారాన్ని బహూకరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, కిరణ్ తన ఆస్తిలో సగభాగాన్ని పూర్తిగా ఆపన్నులను ఆదుకోవడానికే కేటాయించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సత్వర వైద్యసేవల కోసం రూ.220 కోట్లతో ‘ఇరాజ్’ రోగ నిర్ధారణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరులో 1400 పడకల కేన్సలర్ ఆస్పత్రిని నిర్మించారు. వరద బాధితులకు మూడువేల ఇళ్లు కట్టించారు. కంపెనీ నిర్వహణకు సంసారం ప్రతిబంధకమవుతుందని భావించి చాలాకాలం పెళ్లికి దూరంగా ఉన్నారు. అయితే, 1998లో స్కాట్లాండ్ కు చెందిన జాన్‌షాను ప్రేమించి పెళ్లాడారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల మాతృత్వానికి దూరమైన కిరణ్, బయోకానే తన బేబీ అంటారు.
- దండేల కృష్ణ