న్యూఢిల్లీ, హైదరాబాద్ : బయోటెక్నాలజీ దిగ్గజం బయోటక్ నగరంలో నూతన యూనిట్‌ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అంతేకాక ప్రస్తుతమున్న యూనిట్‌ను మరింత విస్తరించనున్నట్టు పేర్కొంది. బయో ఏషియా సదస్సులో భాగంగా రెండో రోజు, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పలు ఫార్మా దిగ్గజాలు నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సమావేశ సందర్భంగా బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, జినోమ్ వ్యాలీలో తన నూతన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటుచేయనున్నట్టు మంత్రికి తెలిపారు. తమ అనుబంధ కంపెనీ అయిన సింజెన్ ద్వారా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి హైస్కిల్స్ ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పారు. దీంతో పాటు బయోకాన్‌లో సిబ్బందిని రెట్టింపు చేస్తామని కూడా తెలిపారు.
బయోకాన్ నూతన యూనిట్ ఏర్పాటును స్వాగతించిన మంత్రి, కిరణ్ మజుందార్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో దేశంలో ఎట్టకేలకు ఉన్నత ప్రమాణాలున్న సైన్స్, ఇన్నోవేషన్ పరిశోధనలకు బీజం పడిందని కిరన్ మజుందార్ షా అన్నారు. పారిశ్రామిక వేత్తలకు మంత్రి లాంటి నాయకులను చూసినప్పుడు స్పూర్తి కలుగుతుందని, ఇలాంటి నాయకులను బలపర్చాలనిపిస్తుందని ప్రశంసలు వర్షం కురిపించారు. హైదరాబాద్ నగరంపైన కూడా కిరణ్ మజుందార్ షా ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరింత పురోగతి సాధించేందుకు ఆయా రంగాల్లోని నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాధికారులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
వీరితో పాటు జీఈ ప్రెసిడెంట్, సీఈవో టెర్రి బ్రెసెన్హమ్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఆహ్వానించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ జీనోమ్ వ్యాలీలో ఏర్పాటుచేయనున్న ఇంక్యూబేటర్‌లో కూడా జీఈ భాగస్వాములవ్వాలని కోరారు. ప్రభుత్వం వైద్య రంగంలో చేపట్టిన కాన్సర్ డయాగ్నస్టిక్ కార్యక్రమాలను టెర్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వ టాస్క్‌తో కలిసి హెల్త్ కేర్ స్కిల్లింగ్ కార్యక్రమాలను చేపట్టేందుకు జీఈ సిద్దంగా ఉందని టెర్రి మంత్రికి తెలిపారు. మెర్క్ లైఫ్ సైన్సెస్ సీఈవో ఉదిత్ భాత్రాతో, నోవార్టిస్, డెలాయిట్ కంపెనీల ప్రతినిధులతో, థాయ్‌లాండ్ ఉప వాణిజ్య శాఖ మంత్రి చుటిమా బున్యప్రఫసారాతో కూడా మంత్రి సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment