Escorts electric tractor
-
ఎస్కార్ట్స్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 178 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) క్యూ1లో రూ. 92.6 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,089 కోట్ల నుంచి రూ. 1,702 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో ట్రాక్టర్ విక్రయాలు 43 శాతం ఎగసి 25,935 యూనిట్లను తాకాయి. వ్యవసాయ పరికరాల విభాగం ఆదాయం రూ. 977 కోట్ల నుంచి రూ. 1,436 కోట్లకు ఎగసిందని కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం బలహీనపడి రూ. 1,223 వద్ద ముగిసింది. -
ఎస్కార్ట్స్- లారస్ ల్యాబ్స్.. గెలాప్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 550 పాయింట్లు జంప్‌చేసి 37,938కు చేరింది. కాగా.. క్యుబోటా కార్పొరేషన్ భాగస్వామ్యంలో ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు వెల్లడించడంతో ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు షేర్ల విభజనకు బుధవారం(30న) రికార్డ్ డేట్‌కావడంతో ఫార్మా రంగ కంపెనీ లారస్ ల్యాబ్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. ఎస్కార్ట్స్ లిమిటెడ్ జపనీస్ దిగ్గజం క్యుబోటా కార్పొరేషన్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఎస్కార్ట్స్ క్యుబోటా ఇండియా ట్రాక్టర్ల తయారీని ప్రారంభించినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఈ జేవీలో క్యుబోటా 60 శాతం, ఎస్కార్ట్స్ 40 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. రూ. 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన జేవీ ఏడాదికి 50,000 ట్రాక్టర్లను రూపొందించగలదని వెల్లడించింది. ఈ యూనిట్‌ను ప్రధానంగా ఎగుమతులకు వినియోగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం జంప్‌చేసింది. రూ. 1,300ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 7.4 శాతం లాభంతో రూ. 1,292 వద్ద ట్రేడవుతోంది. లారస్ ల్యాబ్స్ చిన్న ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండేందుకు వీలుగా షేర్ల విభజనను ప్రకటించిన లారస్ ల్యాబ్స్ షేరు మంగళవారం నుంచీ ఎక్స్డేట్కానుండటంతో జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో తొలుత 9.2 శాతం దూసుకెళ్లింది. రూ. 1,450 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 8.8 శాతం ఎగసి రూ. 1,445 వద్ద ట్రేడవుతోంది. జులై 30న సమావేశమైన లారస్ ల్యాబ్స్ బోర్డు 5:1 నిష్పత్తిలో షేర్ల విభజనను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు ఈ నెల 30 రికార్డ్ డేట్‌కావడంతో మంగళవారం నుంచీ షేరు ధర ఇందుకు అనుగుణంగా సర్దుబాటు కానుంది. -
బయోకాన్- ఎన్టీపీసీ- ఎస్కార్ట్స్.. స్పీడ్
మార్కెట్లు తీవ్ర ఆటుపోట్ల మధ్య లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల ప్రభావంతో ఫార్మా దిగ్గజం బయోకాన్, పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బయోకాన్ లిమిటెడ్ మైలాన్ ఎన్‌వీతో భాగస్వామ్యంలో రూపొందించిన ఇన్సులిన్ ఇంజక్షన్‌ను యూఎస్ మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించడంతో బయోకాన్ లిమిటెడ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 395 వద్ద ట్రేడవుతోంది. సెమ్గ్లీ బ్రాండుతో ఇన్సులిన్ గ్లార్గిన్ ఇంజక్షన్‌ను ప్రవేశపెట్టినట్లు బయోకాన్ తాజాగా పేర్కొంది. అధిక బ్లడ్ షుగర్‌ను నియంత్రించేందుకు వీటిని వినియోగించవచ్చని తెలియజేసింది. యూఎస్‌లో వీటిని 3ఎంఎల్ డోసేజీలో ఐదు ఇంజక్షన్ల సెట్‌ను 148 డాలర్లకు, 10 ఎంఎల్ ఇంజక్షన్‌ను 99 డాలర్లకు విక్రయించనున్నట్లు వెల్లడించింది. తద్వారా యూఎస్‌లో అత్యంత చౌకగా ఇన్సులిన్ ఇంజక్షన్‌ను అందిస్తున్నట్లు వివరించింది. ఎన్టీపీసీ లిమిటెడ్ బాండ్ల జారీ ద్వారా రూ. 15,000 కోట్ల సమీకరణకు వాటాదారుల అనుమతి కోరనున్నట్లు విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీ పేర్కొంది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఒకేసారి లేదా దశలవారీగా బాండ్ల జారీ చేసే అంశంపై ఈ నెల 24న చేపట్టనున్న వార్షిక సమావేశంలో బోర్డు నిర్ణయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈలో ఎన్టీపీసీ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. ఎస్కార్ట్స్ లిమిటెడ్ గత నెల(ఆగస్ట్)లో ట్రాక్టర్ల అమ్మకాలు ఏకంగా 80 శాతం దూసుకెళ్లి 7,268 యూనిట్లను తాకినట్లు ఎస్కార్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. కంపెనీ చరిత్రలోనే ఆగస్ట్‌లో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారని పేర్కొంది. వీటిలో ఎగుమతులు రెట్టింపై 518 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. రుతుపవనాలు, పెరిగిన ఖరీఫ్ పంటల సాగు, రిటైల్ ఫైనాన్స్ వంటి అంశాలు ఇందుకు దోహదం చేసినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 1,154కు చేరింది. ప్రస్తుతం 2.2 శాతం లాభంతో రూ. 1,111 వద్ద ట్రేడవుతోంది. -
ఎస్కార్ట్స్‌లో వాటా తగ్గించుకున్న రాకేష్
ఓపెన్ మార్కెట్ ద్వారా గత బుధవారం(22న) ఎస్కార్ట్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 లక్షల షేర్లను సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఎస్కార్ట్స్‌లో రాకేష్, భార్య రేఖ, రేర్ ఈక్విటీల వాటా 6.82 శాతానికి పరిమితమైంది. ఈ వాటా విక్రయానికి ముందు 6.97 శాతం వాటాకు సమానమైన 93,97,600 షేర్లను కలిగి ఉన్నట్లు ఎక్స్ఛేంజీల డేటా ద్వారా తెలుస్తోంది. కాగా.. గత బుధవారమే బీఎస్ఈలో ఎస్కార్ట్స్ షేరు ఇంట్రాడేలో రూ. 1210ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం. వారాంతాన మాత్రం ఈ షేరు 3.4 శాతం పతనమై రూ. 1,128 వద్ద ముగిసింది. 104 శాతం ర్యాలీ ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం నుంచి ఎస్కార్ట్స్ షేరు 104 శాతం ర్యాలీ చేసింది. లాక్‌డవున్‌లోనూ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం, పెరుగుతున్న పంటల విస్తీర్ణం, వర్షపాత అంచనాలు గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ను పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ బాటలో ఇటీవల ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోవడం ఎస్కార్ట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఎస్కార్ట్స్‌లో 9 శాతానికిపైగా వాటా కొనుగోలుకి జపనీస్ కంపెనీ క్యుబోటా కార్పొరేషన్‌కు ఈ నెల మొదట్లో కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఇదే విధంగా క్యుబోటా అగ్రికల్చరల్ మెషీనరీ ఇండియాలో 40 శాతం వాటాను ఎస్కార్ట్స్ సొంతం చేసుకునేందుకు సైతం సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఇటీవల ఎస్కార్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఈ షేర్ల రికార్డుల ర్యాలీ చూడతరమా!
మార్కెట్లు జోరుమీదున్నాయి. మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ లాభాల ట్రిపుల్ సెంచరీ సాధించింది. 321 పాయింట్లు జంప్‌చేసి 36,650కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 85 పాయింట్లు ఎగసి 10,791 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న పలు మిడ్ క్యాప్ కౌంటర్లు సరికొత్త గరిష్టాల రికార్డులను సృష్టిస్తున్నాయి. జాబితాలో తాజాగా స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ ఆల్కిల్ అమైన్స్, కన్జూమర్ డ్యురబుల్స్ కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్, ట్రాక్టర్ల దిగ్గజం ఎస్కార్ట్స్ లిమిటెడ్, ఐటీ సేవల కంపెనీ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎఫ్ఎంసీజీ కంపెనీ టాటా కన్జూమర్ చోటు సాధించాయి. కొద్ది రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న ఈ కౌంటర్లన్నీ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను అందుకోవడం విశేషం! వివరాలు చూద్దాం.. ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ గత మూడు నెలల్లో 69 శాతం ర్యాలీ చేసిన ఆల్కిల్ అమైన్స్ కెమికల్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.6 శాతం ఎగసి రూ. 2360 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2375ను తాకింది. మార్చి త్రైమాసికంలో ఆల్కిల్ అమైన్స్ పన్నుకు ముందు లాభం(ఇబిట్) 93 శాతం జంప్‌చేసి రూ. 61 కోట్లను అధిగమించింది. ఇందుకు ముడివ్యయాలు తగ్గడం సహకరించింది. టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ గత ఆరు రోజుల్లో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేరు 14 శాతం బలపడింది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 437ను అధిగమించింది. ప్రస్తుతం రూ. 435 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల విదేశీ రీసెర్చ్ సంస్థ క్రెడిట్ స్వీస్ ఈ కౌంటర్‌కు ఔట్పెర్ఫార్మ్ రేటింగ్‌ను ప్రకటించడంతోపాటు ఏడాది కాలానికి రూ. 490 టార్గెట్ ధరను ప్రకటించింది. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ గత ఆరు రోజుల్లో దాదాపు 8 శాతం పుంజుకున్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ తాజాగా ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2079 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2098కు ఎగసింది. ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్) నుంచి కంపెనీ మరింత జోరందుకునే వీలున్నట్లు సాఫ్ట్వేర్ పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్కార్ట్స్ లిమిటెడ్ ట్రాక్టర్ల తయారీ ఎస్కార్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత రూ. 1126 సమీపానికి చేరింది. ఇది 3.5 శాతం అధికంకాగా.. ప్రస్తుతం రూ. 1115 వద్ద ట్రేడవుతోంది. గత మూడు నెలల్లో ఈ ఆటో రంగ కౌంటర్ 63 శాతం దూసుకెళ్లడం గమనార్హం! సాధారణ వర్షపాత అంచనాలు, గ్రామీణ ఆదాయాలు పుంజుకోవడం, పంటల విస్తీర్ణం పెరగడం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. డిక్సన్ టెక్నాలజీస్ ముందు రోజు 4 శాతం ఎగసిన డిక్సన్ టెక్నాలజీస్ తాజాగా మరో 4 శాతం జంప్‌చేసింది. ఎన్ఎస్ఈలో తొలుత రూ. 6,336ను తాకింది. ప్రస్తుతం రూ. 6212 వద్ద కదులుతోంది. కోవిడ్-19లోనూ జూన్ నెలలో కన్జూమర్ డ్యురబుల్స్ రంగం 100 శాతం రికవరీ సాధించిన వార్తలు ఈ కౌంటర్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
ఇండియా సిమెంట్స్, ఎస్కార్ట్స్.. స్పీడ్
ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నప్పటికీ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇందుకు విభిన్న వార్తలు ప్రభావం చూపుతున్నాయి. గత ఆరు రోజులుగా దక్షిణాది సంస్థ ఇండియా సిమెంట్స్, ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్ లిమిటెడ్ జోరు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో ఈ కౌంటర్లు ఏడాది గరిష్లాలను సైతం తాకాయి. ఇతర వివరాలు చూద్దాం.. ఇండియా సిమెంట్స్ డీమార్ట్ స్టోర్ల మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్లు వాటాలు కొంటున్న వార్తలతో కొద్ది రోజులుగా ఇండియా సిమెంట్స్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఈ నెల 14న డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ.. కుటుంబ సభ్యులతో కలసి ఇండియా సిమెంట్స్‌లో ఏకంగా 4.7 కోట్ల షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఇది కంపెనీ ఈక్విటీలో 15.16 శాతం వాటాకు సమానంకాగా.. దమానీ కుటుంబం వాటా ఇండియా సిమెంట్స్‌లో 19.89 శాతానికి ఎగసింది. 2019 డిసెంబర్ చివరికల్లా ఇండియా సిమెంట్స్‌లో దమానీ కుటుంబీకుల వాటా 4.73 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో గత ఆరు రోజులుగా ఇండియా సిమెంట్స్ షేరు లాభపడుతూ వచ్చింది. శుక్రవారం సైతం 4 శాతం జంప్‌చేసి రూ. 132 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 135కు ఎగసింది. ఇది రెండేళ్ల గరిష్టంకాగా.. ఇంతక్రితం 2018 మే 9న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యయింది. గత ఆరు రోజుల్లో ఈ షేరు 33 శాతం పుంజుకోవడం విశేషం! కొద్ది రోజులుగా పెట్ కోక్ ధరలు క్షీణించడంతోపాటు.. లాక్‌డవున్ తదుపరి నిర్మాణ రంగ కార్యకలాపాలు ఊపందుకోనున్న అంచనాలు ఇటీవల సిమెంట్ కౌంటర్లకు డిమాండ్ పెంచుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎస్కార్ట్స్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడం, ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలపై ఆశావహ అంచనాలు.. ఆటో రంగ కంపెనీ ఎస్కార్ట్స్ లిమిటెడ్‌కు జోష్‌నిస్తున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతులు, శ్రామికులకు ప్రోత్సాహక చర్యలు ప్రకటించడానికితోడు, ఈ సీజన్లో సగటు వర్షపాత అంచనాలు ఇకపై వ్యవసాయ రంగానికి ఊతమివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకోగలవన్న అంచనాలు పెరుగుతున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఎస్కార్ట్స్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచుతున్నట్లు తెలియజేశారు. ఫలితంగా వారాంతాన ఎన్ఎస్ఈలో ఎస్కార్ట్స్ లిమిటెడ్ షేరు 3 శాతం ఎగసి రూ. 907 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 919 వరకూ దూసుకెళ్లింది. ఇది ఏడాది గరిష్టంకాగా.. గత ఆరు రోజుల్లో ఈ షేరు 16 శాతం జంప్‌చేసింది. ఇక గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నికర లాభం 10 శాతం పెరిగి రూ. 128 కోట్లకు చేరగా.. పన్నుకు ముందు లాభం 4 శాతం పుంజుకుని రూ. 179 కోట్లను తాకింది. అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 16 శాతం క్షీణించి రూ. 1386 కోట్లకు పరిమితమైంది. ఇటీవల ఎస్కార్ట్స్‌లో 10 శాతం వాటాను జపనీస్ దిగ్గజం క్యుబోటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రైవర్‌లెస్ ట్రాక్టర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : నిరంతరం వ్యవసాయ క్షేత్రంలో స్వేదం చిందించే కర్షకుల కష్టాన్ని తగ్గించేందుకు.. వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఆటోమేటెడ్ ట్రాక్టర్‌ను గురువారం లాంచ్ చేసింది. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్సన్ గ్రూప్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలతో జతకట్టినట్లు పేర్కొంది. ఎస్కార్ట్ గ్రూప్ ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. రానున్న రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కృత్రిమ మేథతో ట్రాక్టర్‌ను నడపడం ద్వారా రైతులకు శ్రమను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా మృత్తికా ఆరోగ్యం, విత్తనాలు, నీటి యాజమాన్య వ్యవస్థ వంటి అంశాల్లో కూడా పురోగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్కార్ట్ యాజమాన్యం తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు చేదోడుగా నిలిచేందుకు వీలుగా ట్రాక్టర్లు, విత్తనాలు నాటే యంత్రాలను అద్దెకిస్తున్నామని పేర్కొంది. -
రెండింతలైన ఎస్కార్ట్స్లాభం
వ్యవసాయ సంబంధిత యంత్రాల తయారీ కంపెనీ ఎస్కార్ట్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో రెండు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.59 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.113 కోట్లకు పెరిగిందని ఎస్కార్ట్స్ తెలిపింది. ఆదాయం రూ.1,044 కోట్ల నుంచి 41% వృద్ధితో రూ.1,436 కోట్లకు పెరిగిందని తెలిపారు. రూ.10 ముఖ విలువ గల షేర్‌కు రూ.2 డివిడెండ్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇక 2016–17లో రూ.131 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లకు మించి రూ.347 కోట్లకు పెరిగిందని నందా తెలిపారు. ఆదాయం రూ.4,220 కోట్ల నుంచి రూ.5,080 కోట్లకు ఎగసిందని వివరించారు. -
ఎస్కార్ట్స్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ వస్తోంది..!
తొలి నమూనా ఆవిష్కరణ... న్యూఢిల్లీ: వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ‘ఎస్కార్ట్స్’ తాజాగా తొలిసారి ఎలక్ట్రిక్, హైడ్రోస్టాటిక్ కాన్సెప్ట్ ట్రాక్టర్లను మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే ఫాంట్రాక్, పవర్‌ట్రాక్ బ్రాండ్ల కింద 22–90 హెచ్‌పీ శ్రేణిలో పలు ఉత్పాదనలతో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. 70–90 హెచ్‌పీ శ్రేణిలోని న్యూ ఎస్కార్ట్స్ ట్రాక్టర్స్ సిరీస్, 22–30 హెచ్‌పీ శ్రేణిలోని కాంపాక్ట్ ట్రాక్టర్లు, క్రాస్ఓవర్ ట్రాక్టర్లు ఇందులో ఉన్నాయి. ఇవి టైర్–4 ఉద్గార నిబంధనలకు అనువుగా రూపొందాయి. అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాల్లో విక్రయించొచ్చు. మెకానికల్ ట్రాక్టర్లు 2018 తొలి త్రైమాసికంలోనూ, హైడ్రోస్టాటిక్ ట్రాక్టర్లు 2018 రెండో త్రైమాసికంలోనూ కస్టమర్లకు అందుబాటులోకి రానున్నవి. ఇక ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని, తయారీ వెర్షన్‌ను 1–2 ఏళ్ల కాలంలో ఆవిష్కరిస్తామని కంపెనీ తెలిపింది. కాంపాక్ట్ ట్రాక్టర్లను ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేయనుంది.