న్యూఢిల్లీ : నిరంతరం వ్యవసాయ క్షేత్రంలో స్వేదం చిందించే కర్షకుల కష్టాన్ని తగ్గించేందుకు.. వ్యవసాయ ఉపకరణాల తయారీ సంస్థ ఎస్కార్ట్ లిమిటెడ్ డ్రైవర్‌లెస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చింది. వ్యవసాయానికి సాంకేతికతను జోడించే ప్రయత్నంలో భాగంగా ఆటోమేటెడ్ ట్రాక్టర్‌ను గురువారం లాంచ్ చేసింది. డ్రైవర్‌లెస్ ట్రాక్టర్‌ను ఆపరేట్ చేసేందుకు మైక్రోసాఫ్ట్, రిలయన్స్ జియో, ట్రింబుల్, సంవర్ధన మదర్‌సన్ గ్రూప్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలతో జతకట్టినట్లు పేర్కొంది. ఎస్కార్ట్ గ్రూప్ ఎండీ నిఖిల్ నందా మాట్లాడుతూ.. ఈ స్మార్ట్ ట్రాక్టర్ దుక్కి దున్నడం, విత్తనాలు చల్లడం వంటి పనులు చేస్తుందని తెలిపారు. రానున్న రెండేళ్లలో అధిక సంఖ్యలో ఈ ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కృత్రిమ మేథతో ట్రాక్టర్‌ను నడపడం ద్వారా రైతులకు శ్రమను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా మృత్తికా ఆరోగ్యం, విత్తనాలు, నీటి యాజమాన్య వ్యవస్థ వంటి అంశాల్లో కూడా పురోగతి సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎస్కార్ట్ యాజమాన్యం తెలిపింది. చిన్న, సన్నకారు రైతులకు చేదోడుగా నిలిచేందుకు వీలుగా ట్రాక్టర్లు, విత్తనాలు నాటే యంత్రాలను అద్దెకిస్తున్నామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment