ఓపెన్ మార్కెట్ ద్వారా గత బుధవారం(22న) ఎస్కార్ట్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2 లక్షల షేర్లను సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా విక్రయించినట్లు వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఎస్కార్ట్స్‌లో రాకేష్, భార్య రేఖ, రేర్ ఈక్విటీల వాటా 6.82 శాతానికి పరిమితమైంది. ఈ వాటా విక్రయానికి ముందు 6.97 శాతం వాటాకు సమానమైన 93,97,600 షేర్లను కలిగి ఉన్నట్లు ఎక్స్ఛేంజీల డేటా ద్వారా తెలుస్తోంది. కాగా.. గత బుధవారమే బీఎస్‌ఈలో ఎస్కార్ట్స్ షేరు ఇంట్రాడేలో రూ. 1210ను అధిగమించడం ద్వారా రికార్డ్ గరిష్టాన్ని తాకడం గమనార్హం. వారాంతాన మాత్రం ఈ షేరు 3.4 శాతం పతనమై రూ. 1,128 వద్ద ముగిసింది.
104 శాతం ర్యాలీ
ఈ ఏడాది మార్చిలో నమోదైన కనిష్టం నుంచి ఎస్కార్ట్స్ షేరు 104 శాతం ర్యాలీ చేసింది. లాక్‌డవున్‌లోనూ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం, పెరుగుతున్న పంటల విస్తీర్ణం, వర్షపాత అంచనాలు గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ను పెంచనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ బాటలో ఇటీవల ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోవడం ఎస్కార్ట్స్ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఎస్కార్ట్స్‌లో 9 శాతానికిపైగా వాటా కొనుగోలుకి జపనీస్ కంపెనీ క్యుబోటా కార్పొరేషన్‌కు ఈ నెల మొదట్లో కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఇదే విధంగా క్యుబోటా అగ్రికల్చరల్ మెషీనరీ ఇండియాలో 40 శాతం వాటాను ఎస్కార్ట్స్ సొంతం చేసుకునేందుకు సైతం సీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి ఇటీవల ఎస్కార్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment