ఇండియా సిమెంట్స్ లాభం 16% అప్ | India Cements Q1 net up 16% on better operating performance | Sakshi
Sakshi News home page

ఇండియా సిమెంట్స్ లాభం 16% అప్

Published Fri, Aug 19 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

ఇండియా సిమెంట్స్ లాభం 16% అప్

ఇండియా సిమెంట్స్ లాభం 16% అప్

తగ్గిన మొత్తం ఆదాయం
న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 16 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో రూ.38 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.44 కోట్లకు పెరిగిందని ఇండియా సిమెంట్స్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.1,226 కోట్ల నుంచి రూ.1,206 కోట్లకు తగ్గిందని కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.శ్రీనివాసన్ చెప్పారు. అమ్మకాలు పెరగడం, వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా నికర లాభం పెరిగిందని తెలియజేశారు. సిమెంట్ అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందాయన్నారు.

‘‘కాకపోతే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన అమ్మకాలు తగ్గాయి. తమిళనాడులో ఎన్నికలు జరగడం కూడా దీనికొక కారణం’’ అని వివరించారు. గత క్యూ1లో 20.81 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్ అమ్మకాలు ఈ క్యూ1లో 23 లక్షల టన్నులకు పెరిగాయని, అయితే నికర ప్లాంట్ రియలైజేషన్ రూ.3,930 నుంచి రూ.3,461కు తగ్గిందని తెలిపారు. ఇబిటా రూ.200 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.205 కోట్లకు చేరుకున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధి కారణంగా సిమెంట్ డిమాండ్ పెరగగలదని ఆయన అంచనా వేశారు.

 2002 నాటి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు కంపెనీకి చెందిన రూ.120 కోట్ల ఆస్తులను అటాచ్ చేశారని,  దీనికి వ్యతిరేకంగా అప్పిలేట్ అధారిటీకి అప్పీల్ చేశామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 1.1 శాతం లాభపడి రూ.126 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ ఏడాది గరిష్ట స్థాయి..రూ.131ను తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement