సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదవుతుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. జీఎస్‌టీ అమలుతో పాటు బ్యాంకింగ్ సంస్కరణలతో పెట్టుబడులు ఊపందుకున్నాయని దీంతో ఆర్థిక వృద్ధి రేటు ఆజాశనకంగా నమోదవుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో నోట్ల రద్దు కష్టాలు, జీఎస్‌టీ ఆరంభ సమస్యలతో వృద్ధి రేటు 6.6 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనాలకు ఏడీబీ వృద్ధి రేటు అంచనా సారూప్యంగా ఉంది. అయితే ఆర్‌బీఐ అంచనా (7.4)కన్నా ఇది తక్కువగా ఉండటం గమనార్హం.
జీఎస్‌టీ అమలు గాడినపడి ఉత్పాదకత పెరగడం, బ్యాంకింగ్ సంస్కరణలతో పెట్టుబడులు ఊపందుకోవడం మెరుగైన వృద్ధి రేటుకు ఉపకరిస్తాయని ఏడీబీ స్పష్టం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు మరింత ప్రోత్సాహకరంగా 7.6 శాతంగా ఉంటుందని ఏడీబీ నివేదిక పేర్కొంది. ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోనున్నందున మెరుగైన వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. జీఎస్‌టీ క్రమంగా కుదురుకోవడంతో పాటు ప్రభుత్వానికి భారీ రాబడిని సమకూర్చుతుందని, ఇది ఆర్థిక స్ధిరత్వానికి, సంస్కరణలకు, ఎఫ్‌డీఐ మెరుగుదలకు దోహదపడుతుందని అంచనా వేసింది. అయితే వడ్డీరేట్లు మున్ముందు పెరిగే అవకాశం ఉందని ఏడీబీ నివేదిక స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment