
భారత్‌లో వృద్ధి రయ్య్ రయ్య్
ప్రపంచ బ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో అగ్రస్థానం
ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికను విడుదల చేసిన కౌశిక్ బసు
వాషింగ్టన్: ప్రపంచంలోని ఆర్థిక దిగ్గజ దేశాలకు సంబంధించి ప్రపంచబ్యాంక్ ‘గ్రోత్ చార్ట్’లో భారత్‌కు మొట్టమొదటిసారి అగ్రస్థానం లభించింది. చైనాను పక్కకుతోసి భారత్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. 2015 వృద్ధి వేగంలో చైనాను అధిగమించి దేశం 7.5 శాతం వృద్ధి రేటును సాధిస్తుందన్న అంచనాలు దీనికి కారణం. చైనా భారత్‌కన్నా తక్కువగా 7.1 శాతమే వృద్ధి సాధిస్తుందన్నది ప్రపంచబ్యాంక్ అంచనా. ఈ మేరకు తాజా ప్రపంచ ఆర్థిక అంచనాల (జీఈపీ) నివేదికను ప్రపంచబ్యాంక్ చీఫ్ ఎకనమిక్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్ బసు విడుదల చేశారు.
ముఖ్యాంశాలు...
♦ 2015లో అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి రేటు అంచనా 4.4 శాతం. 2016లో ఈ రేటు 5.2 శాతానికి పెరుగుతుంది. 2017లో 5.4 శాతానికి చేరే అవకాశం ఉంది.
♦ భారత్ విషయానికి వస్తే- చమురు ప్రధాన దిగుమతి దేశంగా ఆ కమోడిటీ ధరలు తక్కువ స్థాయిలో ఉండడం ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తున్న అంశం. అలాగే కేంద్రం తీసుకుంటున్న సంస్కరణలు ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. 2015లో 7.5% వృద్ధి బాటన నిలబెట్టే వీలుంది.
♦ అంతర్జాతీయ ఆర్థిక రంగం వృద్ధి ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలపై ఆధారపడి ఉండేది. అయితే ఈ పరిస్థితి ‘నెమ్మదిగా’ మారడం ఖాయం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి చెందుతున్న దేశాలే ‘ఇంజన్లు’గా మారతాయి.
♦ ప్రధానంగా భారత్ రికవరీపై ఆధారపడి దక్షిణ ఆసియాలో వృద్ధి రేటు 2015లో 7.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. అధిక ఆదాయ దేశాల్లో డిమాండ్ క్రమంగా పటిష్టం అవుతుండడం కూడా దీనికి కారణం.
♦ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగువ స్థాయిలో ఉండడం దక్షిణ ఆసియా మొత్తానికి లాభిస్తున్న అంశం.
అతిగా అంచనాలు..?
చైనా మేధావివర్గం అభిప్రాయం ఇరు దేశాలను పోల్చి చూడటం తగదని వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు దూసుకుపోతోందంటూ ఇప్పుడే గొప్పగా అంచనాలు వేయడం తొందరపాటేనని చైనా మేధావివర్గాలు అభిప్రాయడుతున్నాయి. భారత్ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. షాంఘై ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో దక్షిణాసియా పరిణామాల అధ్యయన విభాగం డెరైక్టర్ ఝావో గాంచెంగ్.. ఒక పత్రికలో రాసిన వ్యాసంలో ఈ అభిప్రాయాలు వ్యక్తపర్చారు. వృద్ధి రేటులో చైనాను భారత్ మించిపోతుందంటూ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎకానమీని మందగమనం నుంచి గట్టెక్కించేసినట్లేనని భారత్ నమ్ముతోంది.
అందుకే ఆ దేశం అంచనాలు సాధారణంగానే ఆశావహంగా ఉంటాయి. భారత్ మాత్రమే కాకుండా అటు అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని గాంచెంగ్ తెలిపారు. అయితే ఈ గణాంకాలను నిర్ధారించుకోవడం కష్టసాధ్యమైనందున.. ఇవన్నీ అతిగా వేసుకుంటున్న అంచనాలే అయ్యుండవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రతిసారి భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలను పోల్చి చూసుకోవడం అర్థరహితమని, రెండింటికీ మధ్య అసలు పోలికే ఉండదని గాంచెంగ్ వ్యాఖ్యానించారు. కానీ ఒకవేళ భారత్ వృద్ధి రేటు గానీ చైనా స్థాయిని అందుకుందంటే.. అది కచ్చితంగా ఉన్న దానికన్నా ఎక్కువ చేసి చూపించడమే అవుతుందని పేర్కొన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసమే భారత్‌లో ఆర్థిక గణాంకాలను హైలైట్ చేస్తుంటారని తెలిపారు.
భారత్‌లో ఏదైనా జరగొచ్చు..
భారత్‌కి అనుకూలతలు ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో సమస్యలూ ఉన్నాయని గాంచెంగ్ వివరించారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని లెక్కించే విధానాన్ని కొత్తగా మార్చడమన్నది అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరిగిందా లేక దేశీయ ప్రమాణాలను బట్టి జరిగిందా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వివరించారు. అయితే, భారత్‌లో ఏదైనా జరగొచ్చని, కాబట్టే దేశ ఎకానమీ గురించి ఇప్పుడే అతిగా ఊహించుకోవడం తొందరపాటే అవుతుందని గాంచెంగ్ పేర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే భారత జీడీపీని లెక్కించే విధానాన్ని, దాంతో పాటే దేశ ఆర్థిక స్వరూపాన్నీ సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
క్యూ1లో పటిష్ట వృద్ధి: ఓఈసీడీ
న్యూఢిల్లీ: భారత్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో పటిష్ట వృద్ధిని నమోదుచేసుకుందని ప్యారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఈసీడీ (ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. చైనా, అమెరికా, జర్మనీ, కెనడాలు సహా ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అన్నింటిలో భారత్ ఆర్థిక వ్యవస్థ క్యూ1లో మంచి పనితీరు కనబరచిందని సంస్థ తెలిపింది. జీ-20 దేశాల్లో జీడీపీ వృద్ధి మొత్తంగా జనవరి-మార్చిలో స్వల్పంగా 0.7 శాతం క్షీణించింది. 2014 డిసెంబర్ క్వార్టర్లలో 0.8 శాతం వృద్ధి జరిగింది. కెనడా (0.1 శాతం), అమెరికా(0.2 శాతం), బ్రెజిల్ (0.2 శాతం) ఆర్థిక వ్యవస్థల వృద్ధి ఏడాది మొదటి మూడు నెలల్లో క్షీణించాయి.
ఈ ఏడాది వృద్ధి7.9%: సిటీ
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.9% ఉంటుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ సిటీగ్రూప్ అంచనావేస్తోంది. 2016-17లో ఈ రేటు ఏకంగా 8.1 శాతమని అంచనా వేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న వ్యవస్థాపరమైన సంస్కరణలు, కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని సడలించడం వంటి అంశాలు దీనికి కారణమని తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడులు పెరగడం, వినియోగం మెరుగుదల వంటి అంశాలు సైతం వృద్ధి స్పీడ్‌కు దోహదం చేస్తాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెపో రేటును ఆర్‌బీఐ మరో పావు శాతం తగ్గించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
వర్షాభావంతో జాగ్రత్త!: అయితే భారత్ వ్యవస్థకు తక్షణం పొంచి ఉన్న సవాలు వర్షాభావం అని వివరించింది. దీనివల్ల శీతాకాల పంటల్లో దాదాపు 10 శాతం నష్టం జరగడానికి అవకాశం ఉందని అంచనావేసింది. ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఇది ఒక పెద్ద సవాలని పేర్కొంది.