
ముంబై: రాబోయే దశాబ్ద కాలంలో దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన రంగానికి రూ. 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం నిధుల సమీకరణ పెద్ద సమస్య కాబోదని .. కానీ వడ్డీ వ్యయాలే పెద్ద సవాలుగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్టర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వార్షిక సదస్సు తొలి రోజు కార్యక్రమంలో గోయల్ ఈ విషయాలు తెలిపారు. భారీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను నిర్మించగలిగే సామర్థ్యాలను సాధించేందుకు, అలాగే అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఏఐఐబీ వంటి బహుళపక్ష ఏజెన్సీలు తోడ్పాటు అందించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో జపాన్ ఏజెన్సీ జికాతో పాటు పలు భారీ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ నిధులు సమకూర్చిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సాధారణంగా అణు విద్యుత్ ప్లాంట్లు, రిఫైనరీలు వంటి భారీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేటప్పుడు రాజకీయ పక్షాల వ్యతిరేకత రూపంలో సమస్యలు వస్తుండటం వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే, గత కొన్నేళ్లుగా మెరుగైన పాలన, నిర్ణయాత్మక విధానాలతో ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోందని ఆయన చెప్పారు. భారత్‌లో పెట్టుబడులు పూర్తిగా సురక్షితమని, ఇప్పటిదాకా కేంద్రంతో పాటు ఏ రాష్ట్రమూ విదేశీ రుణాలను ఎగవేసిన సందర్భం ఒక్కటీ లేదన్నారు.
ఇన్‌ఫ్రాకు నిధులు సులువు కాదు..
ఇన్‌ఫ్రా రంగానికి నిధుల సమీకరణ అంత సులువు కాదని సింగపూర్ ఆర్థిక సంస్థ డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా పేర్కొన్నారు. సాధారణంగా ఇన్‌ఫ్రాకు రుణాలిచ్చే బ్యాంకులకు పరిమితమైన వనరులే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణకు బాండ్ మార్కెట్లలోనే అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ ప్రాజెక్టుల ప్రారంభ దశలో పెట్టుబడులకు బాండ్ మార్కెట్లు దూరంగా ఉంటాయి కాబట్టి ఆ కోణంలోనూ నిధుల సమీకరణకు సవాళ్లు ఉండగలవని గుప్తా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment