
ముంబై: టెక్నాలజీ రంగానికి చెందిన గూగుల్, ఫేస్‌బుక్ వంటి సంస్థలకు బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టేందుకు అనుమతించరాదని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కోటక్ అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సంస్థలు నియంత్రణ పరిధిలో పనిచేయడానికి ఇష్టపడవని, అందుకే వాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో చోటు కల్పించరాదని పేర్కొన్నారు. అసంఖ్యాక ప్రజల నమ్మకంపై బ్యాంకింగ్ వ్యవస్థ పని చేస్తుందని, భద్రతకు మారుపేరుగా ఉంటుందని చెప్పారాయన. ‘గూగుల్ లేదా ఫేస్‌బుక్ బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తే పెద్ద సమస్యే. బ్యాంకుల్లా అవి నియంత్రణ పరిధిలో పనిచేయడానికి ఇష్టపడవు‘ అని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన వార్షిక లీడర్‌షిప్ సదస్సులో కోటక్ చెప్పారు.
గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు గూగుల్ పే వంటి యాప్స్‌తో భారత ఆర్థిక సేవల రంగంలో కార్యకలాపాలు విస్తరించడంపై దృష్టి పెడుతున్న నేపథ్యంలో కోటక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకులు తమ వద్ద ఉండే ప్రతి రూపాయిపైనా రూ.10 మేర రుణం ఇస్తుంటాయని, ఇంతటి భారీ రిస్కులున్న వ్యాపారమైనప్పటికీ.. బ్యాంకింగ్ సురక్షితమైనదే అనే పేరును నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment