వర్షాభావం భారత్‌కు ఇబ్బందే!
రేటింగ్‌కు ప్రతికూలం: మూడీస్
న్యూఢిల్లీ: రుతుపవనాల బలహీనత భారత్‌కు పెద్ద ఇబ్బందేనని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ విశ్లేషించింది. ఇది దేశానికి రేటింగ్‌కు ప్రతికూలంగా(క్రెడిట్ నెగటివ్) మారే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే వ్యవసాయ రంగం (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 17 శాతం) దెబ్బతింటుందని, ఆహార ధరలు ప్రపంచ సగటుకన్నా పెరుగుతాయని, సబ్సిడీలు, సహాయక చర్యల భారంతో ప్రభుత్వ లోటు అంశాలు క్లిష్టమవుతాయని మూడీస్ నివేదిక విశ్లేషించింది. వర్షాభావ అంచనాల నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు.
- వర్షాభావం వల్ల ఏ స్థాయిలో ప్రతికూల ఫలితాలు ఉంటాయన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వర్షాభావం ఏఏ ప్రాంతాల్లో ఉంది.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వంటి అంశాలు ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- సగటు కుటుంబ వ్యయంలో 50% ఆహార పదార్థాలపైనే వెచ్చించడం జరుగుతుంది. అధిక ధరలు కుటుంబ బడ్జెట్‌ను భారీగా పెంచేస్తాయి. ఇది స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.
- ఆహార ధరలు పెరిగినందువల్లే, భారత్‌లో 2012, 2013లో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని దాటింది.
- ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రైవేటు రంగం వినియోగం పెరగడం, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి అంశాల వల్ల రిజర్వ్ బ్యాంక్ 2015లో 75 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. అయితే బలహీన వర్షాభావ పరిస్థితుల్లో మరోదఫా రేటు కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనీ సూచించింది. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ప్రతికూల అంశం.
- క్రెడిట్ రేటింగ్ నెగటివ్ అయితే, అంతర్జాతీయం గా రుణ సమీకరణ భారంగా మారడంతోపాటు, రుణాలు పొందడం కూడా క్లిష్టతరమవుతుంది.
- గత సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతంకన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. గత ఏడాది సాధారణంకన్నా తక్కువ వర్షపాతం వల్ల ధాన్యం, పత్తి, చమురు గింజల పంటలపై పడింది. గడచిన 50 సంవత్సరాల కాలంలో నమోదయిన వర్షపాతం సగటు- సాధారణ వర్షపాతానికి బెంచ్‌మార్క్.