చైనాతో భారత్‌కు పోలికా..?
‘రేటింగ్’పై సుబ్రమణియన్ ఆరోపణలను తోసిపుచ్చిన ఏజెన్సీ
ముంబై: వివిధ దేశాలకు సార్వభౌమ రేటింగ్ ఇచ్చే విషయంలో అత్యంత పారదర్శకంగా, ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన విధానాలను పాటిస్తున్నామని... భారత్ దీనికి మినహాయింపేమీ కాదని ఎస్‌అండ్‌పీ తేల్చిచెప్పింది. తాము అనుసరిస్తున్న ప్రమాణాలు, పద్ధతులన్నీ వెబ్‌సైట్లో సవివరంగా ఉన్నాయని సంస్థ డైరెక్టర్(సార్వభౌమ రేటింగ్స్) కైరన్ కరీ పేర్కొన్నారు. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు అస్థిరమైన ప్రమాణాలను పాటిస్తున్నాయంటూ ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తీవ్రంగా దుయ్యబట్టిన నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ ఈ విధంగా స్పందించింది. ‘రేటింగ్‌ను నిర్ణయించే విషయంలో విభిన్నమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం. భారత్‌కు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధిని ప్రోత్సహించడంలో సమతుల్యతను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది’ అని కరీ వివరించారు.
చైనా తలసరి ఆదాయం 5 రెట్లు ఎక్కువ
గ్లోబల్ రేటింగ్ విధానాలకు సంబంధించి చైనా, భారత్‌ల మధ్య అసమానతలు ఉన్నాయని.. స్థిరమైన ప్రమాణాలను పాటించడం లేదంటూ ఆర్థిక సర్వేలో సుబ్రమణియన్ ఆరోపించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించడం, దివాలా చట్టం అమలు, ద్రవ్య విధాన కార్యాచరణకు ఆమోదం, వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ).. ఆధార్ బిల్లుకు మోక్షం వంటి పలు సంస్కరణలను రేటింగ్ ఏజెన్సీలు గుర్తించడం లేదని.. గతేడాది ఎస్‌అండ్‌పీ రేటింగ్ అప్‌గ్రేడ్‌ను నిరాకరించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటువంటి చర్యలు వాటి(ఏజెన్సీలు) విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మారుస్తాయని సుబ్రమణియన్ విమర్శించారు. ఎస్‌అండ్‌పీ నుంచి చైనాకు ప్రస్తుతం ‘ఏఏ మైనస్(ప్రతికూల అవుట్‌లుక్) రేటింగ్ ఉండగా.. భారత్ రేటింగ్ ‘బీబీబీ మైనస్(స్థిర అవుట్‌లుక్)’. భారత్ కంటే చైనా రేటింగ్ ఆరు అంచెలు ఎక్కువ కావడం గమనార్హం.
కాగా, 2010 నుంచి చూస్తే... చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 10 శాతం నుంచి 6.5 శాతానికి పడిపోగా... భారత్ జీడీపీ వృద్ధి మాత్రం స్థిరంగా వృద్ధి చెందుతూ వస్తోందని, అయినప్పటికీ.. ఎస్‌అండ్‌పీ చైనా రేటింగ్‌ను స్థిరంగానే కొనసాగిస్తోందంటూ సుబ్రమణియన్ పేర్కొన్నారు. అయితే, రేటింగ్స్ విషయంలో చైనాతో భారత్‌కు పోలికే లేదని కైరన్ కరీ స్పష్టం చేశారు. ‘చైనా తలసరి ఆదాయం భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువ. అంతేకాదు జీడీపీలో చైనా రుణ భారం కూడా దాదాపు 30 శాతం మాత్రమే. రుణాలపై భారత్ తమ ఆదాయాల్లో 21 శాతాన్ని ఖర్చు చేయాల్సి వస్తుండగా.. చైనా విషయంలో ఇది 3 శాతమే. అందుకే చైనా రేటింగ్ భారత్ కంటే అత్యంత మెరుగ్గా ఉంది’ అని కరీ వివరించారు.