మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ 2026 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అంచనా వేసింది. ఒక దేశానికి వచ్చే వెళ్లే విమాన ప్రయాణికుల సంఖ్యనే ఇక్కడ ఏవియేషన్ మార్కెట్‌గా పరిగణలోకి తీసుకున్నాం. ఐఏటీఏ ప్రకారం.. ప్రపంచంలో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశాల్లో ఇండియా 9వ స్థానంలో ఉంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.
2029 నాటికి చైనా అమెరికాను వెన క్కు నెట్టి అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్ గల దేశంగా అవతరించనుంది. ఇక మనం 2026 నాటికి యూకేను వెనక్కు నెట్టి మూడో స్థానంలో నిలువనున్నాం. టాప్-10లోకి ఇండోనేసియా అడుగుపెట్టనుంది. ఇండియాలోని విమాన ప్రయాణికుల సంఖ్య 2035 నాటికి 44.2 కోట్లకు చేరనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం 380 కోట్లుగా ఉన్న మొత్తం అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 720 కోట్లకు పెరగనుంది.
విమాన ప్రయాణికుల రద్దీ 23 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ సెప్టెంబర్‌లో 23.4 శాతంగా నమోదయ్యింది. వివిధ విమానయాన కంపెనీలు ఈ నెలలో మొత్తంగా 82.3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఇండిగో 40 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్‌వేస్ (16.2 శాతం), ఎయిర్ ఇండియా (14.7 శాతం), స్పైస్‌జెట్ (12.5%) వంటి తదితర కంపెనీలు ఉన్నాయి.
ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ గణాంకాల ప్రకారం.. గతేడాది ఇదే నెలలో నమోదైన విమాన ప్రయాణికుల సంఖ్య 66.66 లక్షలుగా ఉంది. ఇక జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో విమానయానం చేసిన వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 5.9 కోట్ల నుంచి 7.2 కోట్లకు పెరిగింది.
నేడు రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ విధి విధానాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రీజినల్ కనెక్టివిటీ స్కీమ్(ఉడాన్)కి సంబంధించిన తుది పూర్తి విధివిధానాలు శుక్రవారం వెల్లడికానున్నాయి. ఇదే జరిగితే సామాన్యులు రూ.2,500లతోనే (గంట ప్రయాణానికి) విమానయానం చేయవచ్చు. విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ ఏడాది జూలై 1న రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ ముసాయిదాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఈ నెల 21న ఈ స్కీమ్‌కు సంబంధించిన తుది ప్రకటన చేసే అవకాశముంది.