స్వచ్ఛ ఎకానమీపైనే దృష్టి...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
బెంగళూరు: సాహసోపేత నిర్ణయాలతో స్వచ్ఛ ఆర్థిక వ్యవస్థ సాధనే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పించడం, తద్వారా వచ్చే రాబడులను పేదల సంక్షేమానికి వినియోగించడంపైనే దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. బడ్జెట్ విశ్లేషణపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జైట్లీ ఈ అంశాలు తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నిర్ణయాధికారమే ఉండేది కాదని, కానీ దానికి భిన్నంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ క్రియాశీలకంగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
సంపన్న దేశాల్లో రక్షణాత్మక ధోరణులు, అంతర్జాతీయంగా అనూహ్య మందగమనం వంటి వాటి ప్రభావం భారత్‌పై లేదని ’మేక్ ఇన్ ఇండియా–కర్ణాటక’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడులపైనే ప్రధాన దృష్టితో భారత్ ముందుకు సాగుతోందన్నారు. అసంఘటిత ఎకానమీని సంఘటిత వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు. దీనివల్ల రాష్ట్రాలకు, అటు కేంద్రానికి ఆదాయాలు పెరగగలవన్నారు.