న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 67 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.452 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.150 కోట్లకు తగ్గిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు పెరగడంతో నికర లాభం తగ్గిందని ఇండియన్ బ్యాంక్ ఎమ్‌డీ, సీఈఓ పద్మజ చుండూరు పేర్కొన్నారు. మొత్తం ఆదాయం రూ.4,874 కోట్ల నుంచి రూ.5,129 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఈ బ్యాంక్ రుణ నాణ్యత మరింతగా తగ్గింది. గత క్యూ2లో 6.67 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 7.16 శాతానికి పెరిగాయని పద్మజ తెలిపారు. అలాగే నికర మొండి బకాయిలు 3.41 శాతం నుంచి 4.23 శాతానికి చేరాయని పేర్కొన్నారు. మొండి బకాయిలకు, అత్యవసరాలకు కేటాయింపులు ఈ క్యూ2లో రూ.1,004 కోట్లకు పెరిగాయని, గత క్యూ2లో ఇవి రూ.745 కోట్లుగా ఉన్నాయని వివరించారు. ఒక్క మొండి బకాయిలకు కేటాయింపులే రూ.633 కోట్ల నుంచి రూ.752 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.
ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.20,477 కోట్లు: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు పది ఖాతాల కింద రూ.1,809 కోట్ల మేర రుణాలిచ్చామని పద్మజ పేర్కొన్నారు. వీటిల్లో ఆరు ఖాతాలు స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్‌పీవీ)కి చెందినవని, ఇవి మంచి రుణాలేనని వివరించారు. మూడేళ్ల క్రితమే ఒక ఖాతా మొండి బకాయిగా తేలిందని, దీనికి పూర్తిగా కేటాయింపులు జరిపామని తెలిపారు. రూ.172 కోట్ల ఖాతా తాజాగా మొండి బకాయిగా మారిందని, మరో రెండు ఖాతాలకు చెందిన రూ.130 కోట్ల రుణాలు వాచ్‌లిస్ట్‌లో ఉన్నాయని వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.20,477 కోట్ల రుణాలిచ్చామని, ఇది మొత్తం రుణాల్లో 12 శాతానికి సమానమని వివరించారు. ఫలితాల ప్రభావంతో బీఎస్‌ఈలో ఇండియన్ బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయింది. 12 శాతం నష్టంతో రూ.229 వద్ద ముగిసింది.
ఇండియన్ బ్యాంక్ లాభం 67 శాతం డౌన్
Published Sat, Nov 10 2018 1:56 AM | Last Updated on Sat, Nov 10 2018 1:56 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment