న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత కంపెనీలు విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్ తెలిపారు. 2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment