ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి, వటవృక్షంగా వృద్ధిచేసిన ప్రమోటర్లకు ఆ కంపెనీలో ప్రస్తుతం వున్న వాటా చాలా తక్కువ. ఇన్ఫోసిస్‌లో ఏ ఉన్నత నియామకాల్ని, నిర్ణయాల్ని శాసించేంత వాటా వారికి లేదు. మూర్తి, నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ తదితర ప్రమోటర్లందరికీ కలిపి ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 12.8% వాటా మాత్రమే ఉంది. మిగిలిందంతా వివిధ విదేశీ, దేశీ సంస్థలు, ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల చేతిలో వుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద 38.59% వాటా వుంది. ఇందులో అత్యధికంగా డాయిష్‌బ్యాంక్ ట్రస్ట్ కంపెనీ అనే అమెరికా సంస్థ వద్ద 16.81% వాటా ఉంది.
ఇక ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల వద్ద 20.39% వాటా వుండగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో ఎక్కువగా 7.17% వాటా ఎల్‌ఐసీ వద్ద వుంది. విదేశీ ఇన్వెస్టర్లలో అపెన్‌హైమర్ ఫండ్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఫండ్, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ల వద్ద గణనీయమైన వాటా వుండగా, దేశీ సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్, ఎస్‌బీఐ ఈటీఎఫ్ ఫండ్‌లు ఇన్ఫీలో పెద్ద ఇన్వెస్టర్లు. ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయాల్లో వేటినైనా వీటో చేయగలిగే సత్తా వీటికి వుంది. వీరికి నచ్చినవారినే ఇన్ఫీ బోర్డు కొత్త సారధిగా నియమించగలుగుతుంది. నారాయణమూర్తి, నీలేకనిలతో సహా ప్రమోటర్లలో ఎవరైనా తిరిగి యాజమాన్య పగ్గాలు చేపట్టదలిస్తే.. ఈ ఇన్వెస్టర్లను ఒప్పించాల్సిందే.