Chris Gopalakrishnan
-
మన ఐటీ కంపెనీలను చూసి నేర్చుకోండి
న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలను చూసి దేశంలోని ఇతర కంపెనీలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్ సూచించారు. మన ఐటీ కంపెనీలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారాయన. దేశంలోని పలు కంపెనీలు రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, ఐటీ కంపెనీలు మాత్రం ఎలాంటి రుణభారం లేకుండా ఉన్నాయని తెలిపారు. కంపెనీలన్నీ పరిశోధన, అభివృద్ధిలపై అధికంగా పెట్టుబడులు పెట్టాలన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత కంపెనీలు విదేశీ స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ కావాలని ఆయన సూచించారు. ‘‘చాలా దేశీయ కంపెనీలకు పోటీ అంటే భయం’’ అన్నారాయన. కంపెనీలు కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచుకోవాలని, అంతర్జాతీయంగా పోటీపడాలని సూచించారు. 1980లో 16,000 కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2.8 లక్షల కోట్ల డాలర్లకు ఎగసిందని క్రిస్ తెలిపారు. 2025 కల్లా 5 లక్షల కోట్లడాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గుర్తు చేశారు. 2025 లేదా 2030 నాటికి ఈలక్ష్యాన్ని సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. -
క్లౌడ్ డేటా భారత్‌లోనే..!
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్‌లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్‌లోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్ సైట్లతో పాటు డిజిటల్ పేమెంట్ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ ఫేస్బుక్ నుంచి ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది. సత్వర విచారణకు దోహదం.. డేటా సెంటర్లను భారత్‌లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్ క్లౌడ్ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలతో నష్టాలేంటి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్‌లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్‌లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్‌వేర్స్‌ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్‌లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతోంది. ► భారత్‌లో డేటా సెంటర్లు (22 ప్రాంతాల్లో) 141 ► వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నవి 80% ► 2022 కల్లా భారత క్లౌడ్ మార్కెట్ విలువ రూ.47,964 కోట్లు -
ఈ ఇన్వెస్టర్ల చేతిలో ఇన్ఫీ భవిష్యత్
ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించి, వటవృక్షంగా వృద్ధిచేసిన ప్రమోటర్లకు ఆ కంపెనీలో ప్రస్తుతం వున్న వాటా చాలా తక్కువ. ఇన్ఫోసిస్‌లో ఏ ఉన్నత నియామకాల్ని, నిర్ణయాల్ని శాసించేంత వాటా వారికి లేదు. మూర్తి, నీలేకని, క్రిస్ గోపాలకృష్ణన్ తదితర ప్రమోటర్లందరికీ కలిపి ఇప్పుడు ఇన్ఫోసిస్‌లో 12.8% వాటా మాత్రమే ఉంది. మిగిలిందంతా వివిధ విదేశీ, దేశీ సంస్థలు, ఫండ్స్, రిటైల్ ఇన్వెస్టర్ల చేతిలో వుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల వద్ద 38.59% వాటా వుంది. ఇందులో అత్యధికంగా డాయిష్‌బ్యాంక్ ట్రస్ట్ కంపెనీ అనే అమెరికా సంస్థ వద్ద 16.81% వాటా ఉంది. ఇక ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్, ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీల వద్ద 20.39% వాటా వుండగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో ఎక్కువగా 7.17% వాటా ఎల్ఐసీ వద్ద వుంది. విదేశీ ఇన్వెస్టర్లలో అపెన్హైమర్ ఫండ్, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఫండ్, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ల వద్ద గణనీయమైన వాటా వుండగా, దేశీ సంస్థల్లో హెచ్డీఎఫ్సీ ఈక్విటీ ఫండ్, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్, ఎస్బీఐ ఈటీఎఫ్ ఫండ్లు ఇన్ఫీలో పెద్ద ఇన్వెస్టర్లు. ఇన్ఫోసిస్ బోర్డు నిర్ణయాల్లో వేటినైనా వీటో చేయగలిగే సత్తా వీటికి వుంది. వీరికి నచ్చినవారినే ఇన్ఫీ బోర్డు కొత్త సారధిగా నియమించగలుగుతుంది. నారాయణమూర్తి, నీలేకనిలతో సహా ప్రమోటర్లలో ఎవరైనా తిరిగి యాజమాన్య పగ్గాలు చేపట్టదలిస్తే.. ఈ ఇన్వెస్టర్లను ఒప్పించాల్సిందే. -
ఐటీ బూమ్ మరో 30 ఏళ్లు
ఇన్ఫోసిస్ క్రిస్ గోపాలకృష్ణన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వృత్తిపరంగా సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా కంపెనీతో తనకు మానసిక అనుబంధం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవిత కాలాన్ని పణంగాపెట్టి నిర్మించిన సంస్థ నుంచి మానసికంగా బయటకు రాలేమని అన్నారు. అయితే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని, తాము రెండో ఇన్నింగ్స్ ప్రారంభించామని గుర్తుచేశారు. కంపెనీతో మానసిక బంధం ఎన్నటికీ తెగదని చెప్పారు. కాగా, భారత్‌లో ఐటీ బూమ్ మరో 30 ఏళ్లు ఉంటుందని క్రిస్ తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఈ రంగంలో ప్రవేశించేందుకు సరైన తరుణమిదే. హెల్త్‌కేర్, ఆటోమొబైల్ వంటి రంగాలు వచ్చే మూడు దశాబ్దాలు మరింత ఉత్తేజకరంగా ఉంటాయి. ప్రతి పరిశ్రమతోపాటు మన జీవితంలో అన్నింటికీ ఐటీని వినియోగిస్తుండడం ఈ బూమ్కి కారణం. సమూల మార్పులకు వాహన రంగం వేదిక కానుంది. స్వయం చోదక కార్లు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించే వాహనాల వంటి ఎన్నో ఆవిష్కరణలు నమోదుకానున్నాయి’ అని తెలిపారు.