నీలేకని రీఎంట్రీ..? | Top domestic shareholders seek Nandan Nilekani's re-entry to Infosys | Sakshi
Sakshi News home page

నీలేకని రీఎంట్రీ..?

Published Thu, Aug 24 2017 12:19 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

నీలేకని  రీఎంట్రీ..?

నీలేకని రీఎంట్రీ..?

ఆయనను తీసుకోవాలంటూ ఇన్ఫీ బోర్డుకు 12 ఫండ్స్‌ లేఖ
జాబితాలో ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఫండ్స్‌...
తాజా పరిణామాలు చాలా ఆందోళనకరమని వెల్లడి
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి నీలేకని రావాలని వ్యాఖ్య
నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించొచ్చని ఊహాగానాలు  


న్యూఢిల్లీ: విశాల్‌ సిక్కా రాజీనామా దెబ్బతో గందరగోళంగా తయారైన ఇన్ఫోసిస్‌లో ప్రమోటర్లు మళ్లీ పాగా వేస్తున్నారా? అవుననే వారి వాదనలకు నందన్‌ నీలేకని రీఎంట్రీకి అన్నివైపుల నుంచి మద్దతు పెరుగుతండటం బలాన్ని చేకూరుస్తోంది. నీలేకని పునరాగమనం కోసం ఏకంగా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆయనను మళ్లీ కంపెనీలోకి తీసుకోవాలని పన్నెండు సంస్థాగత ఇన్వెస్టర్లు (ఫండ్స్‌) మూకుమ్మడిగా బోర్డుకు లేఖ రాశారు. సీఈఓ పదవికి సిక్కా ఆకస్మిక రాజీనామాతో ఇన్ఫీలో అనిశ్చితి నెలకొందని... ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించి, ఇన్వెస్టర్లలో తిరిగి నమ్మకాన్ని తీసుకురావాలంటే నీలేకని పునరాగమనం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు.

 నీలేకని రీఎంట్రీ కోసం ఇప్పటికే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ అనే సంస్థ గొంతెత్తిన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లతో నారాయణమూర్తి మాట్లాడనున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే, ఈ కాన్ఫరెన్స్‌ కాల్‌ను ఆయన 29కి వాయిదా వేసుకున్నట్లు సమాచారం. తనపై పదేపదే నిరాధార ఆరోపణలు, వ్యక్తిగతంగా దూషణలు చేయడం వల్లే సీఈఓ పదవికి తప్పనిసరి పరిస్థితుల్లో గుడ్‌బై చెప్పినట్లు సిక్కా తన రాజీనామా లేఖలో పేర్కొనడం తెలిసిందే. మూర్తి పేరును

ఆయన నేరుగా ప్రస్తావించనప్పటికీ... కంపెనీ డైరెక్టర్ల బోర్డు మాత్రం నారాయణమూర్తి ఆరోపణలవల్లే సిక్కా వైదొలగాల్సివచ్చిందని కుండబద్దలు కొట్టింది. దీంతో ప్రమోటర్లు, బోర్డుకు మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. కంపెనీ షేరు ధర 15 శాతానికిపైగా కుప్పకూలి రూ.34 వేల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది కూడా. ఈ పరిస్థితుల్లో ప్రమోటర్ల రీఎంట్రీ వాదనలు జోరుగా తెరపైకి వస్తున్నాయి.

ఏం పోస్టు ఇస్తారో...
ఇన్ఫీని స్థాపించిన ఏడుగురు ప్రమోటర్లలో నీలేకని ఒకరు. 2002 మార్చి నుంచి 2007 ఏప్రిల్‌ వరకూ ఐదేళ్లపాటు ఆయన సీఈఓగా పనిచేశారు. ఇన్ఫీ నుంచి వైదొలగిన తర్వాత ఆయన ఆధార్‌ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐకి చైర్మన్‌గా వెళ్లారు. 2014లో ఎన్నికల్లో పోటీచేయడం కోసం యూఐడీఏఐకి రాజీనామా చేశారు. కాగా, నీలేకనిని నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ఐఐఏఎస్‌ కూడా ఇదే వాదనను వినిపించింది.

 ఆయన రీఎంట్రీపై రెండురోజుల్లో నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది. ‘ఇన్ఫోసిస్‌లోని తాజా పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్రమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత... మేమంతా నీలేకనిని బోర్డులో కీలకమైన స్థానంలోకి తీసుకోవాలని కోరాం. వాటాదారులు, క్లయింట్లు, ఉద్యోగులకు కూడా నీలేకనిపై మంచి నమ్మకం ఉంది. ఇవన్నీ పరిశీలిస్తే.. నీలేకని తిరిగి రావటం వల్ల కంపెనీకి సంబంధించిన అన్నిపక్షాల్లో తిరిగి విశ్వాసం పునరుద్ధరించినట్లవుతుంది. మా సూచనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’ అని ఫండ్‌ మేనేజర్లు ఇన్ఫీ బోర్డు చైర్మన్‌కు రాసిన సంయుక్త లేఖలో పేర్కొన్నారు.

 నీలేకనికి మద్దతు పలికిన వారిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ తరఫున ఎస్‌.నరేన్, ఐసీసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ తరఫున మనీష్‌ కుమార్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నుంచి ప్రశాంత్‌ జైన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నుంచి ప్రసున్‌ గజ్రి, రిలయన్స్‌ నిప్పన్‌లైఫ్‌ ఏఎంసీ తరఫున సునిల్‌ సింఘానియా, ఎస్‌బీఐ ఫండ్‌ మేనేజర్‌ నవనీత్‌ మునోత్, ఎస్‌బీఐ లైఫ్‌ నుంచి గోపాలకృష్ణ షెనాయ్‌ తదితరులు ఉన్నారు. ఇంకా, బిర్లా సన్‌లైప్‌ ఏఎంసీ, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్, ఐడీఎఫ్‌సీ ఏఎంసీ, డీఎస్‌పీ బ్లాక్‌రాక్, కోటక్‌ మహీంద్రా ఏఎంసీల ప్రతినిధులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఇక చక్రం తీప్పేది ఫండ్సే...
ఇన్ఫోసిస్‌ కొత్త సీఈఓ ఎంపికతోపాటు బోర్డు నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు కంపెనీలో వాటాలున్నాయి. జూన్‌ చివరినాటికి ఇన్ఫోసిస్‌లో దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు 8.95 శాతం వాటా ఉంది. ఇక బీమా కంపెనీలకు 11.05 శాతం వాటా ఉంది. ఇందులో ఒక్క ఎల్‌ఐసీ వాటాయే 7 శాతం కావడం గమనార్హం. ఇక ప్రమోటర్లందరికీ కలిపి ప్రస్తుతం ఇన్ఫీలో 12.8 శాతంమేర (మూర్తికి 3.5%) ఉన్నట్లు అంచనా. అయితే, కంపెనీలో అత్యధిక (మెజారిటీ) వాటా మాత్రం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు (దాదాపు 38.5 శాతం) ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో కంపెనీలో ఇకపై జరిగే పరిణామాల్లో ఈ సంస్థాగత ఇన్వెస్టర్లే కీలకం కానున్నారని పరిశీలకులు చెబుతున్నారు.

ఇన్వెస్టర్లతో మూర్తి భేటీ 29కి వాయిదా...
ఇన్ఫీలో కీలకమైన గ్లోబల్‌ ఇన్వెస్టర్లతో నారాయణ మూర్తి భేటీ వాయిదాపడింది. వాస్తవానికి ఆయన బుధవారం ఇన్వెస్టర్లతో మాట్లాడాల్సి ఉంది. అనారోగ్య కారణాలతో దీన్ని ఈ నెల 29కి వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సిక్కా ఆకస్మిక రాజీనామా తదనంతరం మళ్లీ ప్రమోటర్లు కంపెనీలోకి రావాలన్న వాదనలు బలపడుతున్న సంగతి తెలిసిందే.

 కాగా, గ్లోబల్‌ ఇన్వెస్టర్లతో మూర్తి కాన్ఫరెన్స్‌ కాల్‌కు బ్రోకర్‌ ఇన్వెస్టెక్‌ ఇండియా అనే సంస్థ ఏర్పాట్లు చేసింది. కంపెనీలో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలు, ఇతరత్రా అంశాలపై ఆయన గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు వివరించనున్నట్లు సమాచారం. సిక్కా రాజీనామా తర్వాత కంపెనీ భవిష్యత్‌ కార్యాచరణపై సంస్థాగత ఇన్వెస్టర్లు తీవ్రంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో మూర్తి సమావేశం కీలకం కానుంది.

కాగా, నారాయణ మూర్తి కంపెనీ బోర్డుపై, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ లోపాలపై చేసిన బహిరంగ విమర్శలు ఆయన వ్యక్తిగతంగా చేసినవే కావొచ్చని.. మొత్తం ప్రమోటర్ల అభిప్రాయం కాకపోవచ్చని ఇన్వెస్టర్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ పేర్కొంది. ‘సిక్కా సారథ్యంలో బోర్డు ఆమోదించిన పలు విధానపరమైన ప్రతిపాదనలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, మూర్తి తప్ప ఇతర వ్యవస్థాపకులు ఎవరూ వ్యతిరేకించలేదు. ఒకవేళ బోర్డు ప్రతిపాదనలు ఆమోదయోగ్యం కాకపోతే తప్పకుండా వారు అసంతృప్తి వ్యక్తం చేసేవారు’ అని ఐఐఏఎస్‌ తాజా నివేదికలో తెలిపింది.

నీలేకని బెస్ట్‌: బాలకృష్ణన్‌
ఇన్ఫోసిస్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితుల్లో నందన్‌ నీలేకనిని చైర్మన్‌గా నియమించడం మంచిదని కంపెనీ మాజీ సీఎఫ్‌ఓ వి.బాలకృష్ణన్‌ పేర్కొన్నారు. ఆయనకున్న అపార అనుభవం, క్లయింట్లతో అవినాభావ సంబంధాలు కంపెనీకి చాలా మేలు చేకూరుస్తాయని చెప్పారు. ప్రస్తుత చైర్మన్‌ ఆర్‌.శేషసాయి, సహ–చైర్మన్‌ రవి వెంకటేశన్‌లు తమ పదవులకు రాజీనామా చేయాలని... నిలేకనిని చైర్మన్‌గా నియమించేందుకు బోర్డు తక్షణం చర్యలు తీసుకోవాలని బాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ‘నీలేకని సారథ్యంలో ఇన్ఫోసిస్‌ మంచి పనితీరును కనబరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరుప్రఖ్యాతులు, గౌరవం ఉన్నాయి. ఆధార్‌ సహా పలు భారీస్థాయి ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇప్పుడు ఆయన మళ్లీ చైర్మన్‌గా వచ్చి... మంచి సీఈఓను అన్వేషించేందుకు కృషిచేయాలి’ అని అభిప్రాయపడ్డారు.

సిక్కా గుడ్‌బైతో ఇన్ఫీకి ఇబ్బందేం లేదు...
విశాల్‌ సిక్కా ఆకస్మిక రాజీనామా కారణంగా ఇన్ఫోసిస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదని ఓపెన్‌హీహర్‌ ఫండ్స్‌ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ పేర్కొంది. ఇన్ఫీలో ఈ ఫండ్స్‌ సంస్థ మూడో అతిపెద్ద సంస్థాగత వాటాదారు. జూన్‌ నాటికి దీనికి 2.16 శాతం వాటా ఉంది. కంపెనీకి రానున్న రోజుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల ధోరణి చాలా కీలకం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘సిక్కా గుడ్‌బై తర్వాత మేం జరిపిన సమీక్షలో కంపెనీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదన్న అభిప్రాయం వ్యక్తమైంది’ అని ఓపెన్‌హీమర్‌ ఫండ్స్‌ ప్రతినిధి కింగర్లీ వీన్రిక్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement