15 నెలల గరిష్టంలో నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు 52 వారాల గరిష్టంలో ముగిశాయి. సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా ఎగిసి 28,182 వద్ద క్లోజ్ అయింది. అదేవిధంగా నిఫ్టీ 15 నెలల గరిష్టంలో నమోదై 2015 ఏప్రిల్ 16 తర్వాత మొట్ట మొదటిసారి అత్యంత కీలకమైన మార్కు 8700ను అధిగమించింది. 28.20 పాయింట్ల లాభంతో 8711 పాయింట్ల వద్ద సెటిల్ అయింది. హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు దేశీయ స్టాక్ మార్కెట్లు ఎగబాకడానికి ప్రధాన కారకాలుగా నిలిచాయి. ఆసియా మార్కెట్ల సానుకూలం సంకేతాలతో ప్రారంభంలో దాదాపు వంద పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికీ వంద పాయింట్లకు పైగానే లాభాలను ఆర్జించింది.
గత వారం చివర్లో లాభాలతో మురిపించిన దలాల్ స్ట్రీట్ ఈ వారం కూడా పాజిటివ్ నోట్తోనే ట్రేడ్ అయి మదుపర్లను ఆకట్టుకుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతవారం చివర్లో వెలువడ్డ అమెరికా ఉద్యోగ గణాంకాలు ఆసియా మార్కెట్లకు జోష్‌నిచ్చాయని, జూలైలో అంచనాలకు మించి ఉపాధి కల్పన జరగడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలు అందాయని చెప్పారు. అదేవిధంగా స్వాతంత్ర్యానంతరం జరిగిన దేశీయంగా అతిపెద్ద ఆర్థిక పన్ను సంస్కరణ జీఎస్టీ బిల్లు ఆమోదంతో, మార్కెట్ల సెంటిమెంట్ మరింత బలపడిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.అయితే నేటి ట్రేడింగ్లో మార్కెట్లు లాభాలను ఆర్జించడానికి ప్రధాన కారణంగా అమెరికా జాబ్స్ రిపోర్టేనని ముంబై మార్కెట్ విశ్లేషకుడు అంబరీష్ బలిగ చెప్పారు.
అటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 0.03 పైసలు బలహీనపడి 66.81గా ఉంది. ఎంసీఎక్స్లో 10 గ్రాముల బంగారం ధర 163 రూపాయలు కోల్పోయి, 31,065 రూపాయలుగా ఉంది.