ముంబై: అధిక వెయిటేజీ రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో బజాజ్ ద్వయం, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడరల్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి(బుధవారం)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా స్టాక్ సూచీలు మంగళవారం ఒక శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 802 పాయింట్లు నష్టపోయి 71,140 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 215 పాయింట్లు క్షీణించి 21,522 వద్ద నిలిచింది. ఉదయం స్తబ్ధుగా మొదలైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో రోజంతా నష్టాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 866 పాయింట్లు క్షీణించి 71,076 వద్ద, నిఫ్టీ 236 పాయింట్లు పతనమై 21,502 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు, రియల్టీ, మీడియా షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. కన్జూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఎఫ్‌ఎంసీజీ, యుటిలిటీ, పారిశ్రామిక రంగాల షేర్లలో విక్రయాలు నెలకొన్నాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ సూచీలు 0.53%, 0.18% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,971 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1003 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ పాలసీ వెల్లడికి ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.
ఇతర ముఖ్యాంశాలు...
జీవితకాల గరిష్ట స్థాయి (రూ.2,918) వద్ద రిలయన్స్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.2815 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో 7% ర్యాలీ చేసింది. మరో అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లలోనూ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. దీంతో ఈ ప్రైవేట్ రంగ దిగ్గజం దాదాపు 1% నష్టపోయి రూ.1444 వద్ద ముగిసింది.
► క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడంతో బజాజ్ ఫైనాన్స్ షేరు 5% నష్టపోయి రూ.6,815 వద్ద నిలిచింది. షేరు 5% క్షీణతతో మార్కెట్ విలువ రూ. 22,984 కోట్లు హరించుకుపోయి రూ.4.21 లక్షల కోట్లకు దిగివచ్చింది. బజాజ్ ఫైనాన్స్ పతనంతో ఇదే గ్రూప్ చెందిన బజాజ్ ఫిన్‌సర్వ్ షేరూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో ఈ షేరు 3% నష్టపోయి రూ.1591 వద్ద నిలిచింది.
► ఐటీసీ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో షేరు 3% నష్టపోయి రూ.438 వద్ద నిలిచింది.
►లిస్టింగ్ రోజే ఈప్యాక్ డ్యూరబుల్ షేరు 10% నష్టపోయింది. ఇష్యూ ధర (రూ.230)తో బీఎస్‌ఈలో 2% డిస్కౌంట్‌తో రూ.225 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% పతనమై రూ.206 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి 10% నష్టంతో రూ.208 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,990 కోట్లుగా నమోదైంది.
► మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాటా మోటార్స్–డీవీఆర్‌తో కలుపుకొని టాటా మోటార్స్ కంపెనీ మారుతీ సుజుకీని అధిగమించి అటో రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం టాటా మోటార్స్ షేరు 2% పెరిగి రూ.859 వద్ద, టాటా మోటార్స్–డీవీఆర్ షేరు 1.63% లాభపడి రూ.573 వద్ద ముగిశాయి.
► బీఎల్‌ఎస్ ఈ–సర్విసెస్ ఐపీఓకు తొలిరోజు 15.63 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.37 కోట్ల షేర్లను జారీ చేయగా 21.41 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ కోటా 49.రెట్లు, సంస్థాగతేతర విభాగం 29.66 రెట్లు, క్యూబీఐ కోటా 2.19 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment