అమెరికా స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారతీయుడు
న్యూయార్క్: అమెరికాలోని స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భారత సంతతికి చెందిన స్టాక్ బ్రోకర్ పై ఫెడరల్ అధికారులు తీవ్ర మైన ఆర్థిక నేరాల కింద కేసులు నమోదు చేశారు. ఒక సంస్థకు చెందిన షేర్ల అమ్మకాల లావాదేవీల్లో ఉద్దేశపూర్వకంగా కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ప్రణవ్ పటేల్ (35)ను ఆరెస్టు చేశారు. ఫ్లోరిడా స్టాక్ బ్రోకర్ పటేల్ స్టాక్ తారుమారు పథకంలో భాగస్వామి అయ్కాడని ఎఫ్బీఐ అధికారులు బుధవారం ప్రకటించారు. సుమారు 871 కోట్ల, 54 లక్షల రూపాయల (131 మిలియన్ డాలర్ల) కుంభకోణానికి పాల్పడినట్టు అరోపించారు. అమెరికాలోని ఫోర్ట్ లాడర్డల్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చిన అధికారులు అనంతరం పటేల్ ను న్యాయ విచారణ కోసం బ్రూక్లిన్ కు తరలించారు. ఎల్ ఈడీ లైటింగ్ ఉత్పత్తుల ప్రపంచ వ్యాప్త పంపిణీదారుగా చెప్పుకుంటున్న ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ కంపెనీతో కుమ్మక్కయ్యి భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎఫ్బీఐ అభియోగాలను నమోదు చేసింది.
పటేల్ సహా మరో తొమ్మిది మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ బృందం అమెరికా స్టాక్ మార్కెట్ నాస్ డాక్ లోని ఫోర్స్ ఫీల్డ్ ఎనర్జీ షేర్ల ధరను అక్రమంగా పెంచి భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఫెడరల్ ప్రాసిక్యూటర్ రాబర్ట్ ఎల్. కాపెర్స్ బ్రూక్లిన్ లో చెప్పారు. ఫోర్స్ ఫీల్డ్స్ సంస్థ, మిచెల్, ప్రణవ్ పటేల్ తదితర స్టాక్ బ్రోకర్ల వ్యాపార భాగస్వామ్యంతో ఈ కుంభకోణానికి పాల్పడిందని ఎఫ్బీఐ ప్రకటించింది. పటేల్, మరో నలుగురు స్టాక్ బ్రోకర్లకు 2014 లో విదేశీ బ్యాంకుల ఖాతాలను ఉపయోగించి ముడుపులు చెల్లించారన్నారు. ముఖ్యంగా స్టాక్ బ్రోకర్ నవీద్ ఖాన్ నేతృత్వంలో ఈ పథక రచన జరిగిందన్నారు.
తక్కువ పెట్టుబడితో పాటు, వ్యాపార కార్యక్రమాలను లేకుండానే... వేల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టుగా మార్కెట్ ను, ఇతర పెట్టుబడిదారులను నమ్మించారన్నారు. దీంతో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు 871 కోట్ల రూపాయలను నష్టపోయినట్టు ఎఫ్బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ డియాగో రోడ్రిగ్యూజ్ తెలిపారు. ఆర్థిక నేరాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యుద్ధంలో భాగంగా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎన్ఫోర్స్ మెంట్ టాస్క్ ఫోర్స్ దీనిపై దర్యాప్తు చేసింది. సెక్యూరిటీల మోసం, కుట్ర, వైర్ ఫ్రాడ్ , అక్రమ నగదు బదిలీ, తప్పుడు ప్రకటన తదితర అభియోగాలపై చర్యలు తీసుకోనుంది.