హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లుతోంది. భారత్‌లోనూ ఇది సాధ్యమే. కాకపోతే ఇందుకు కొంత సమయం పడుతుందని హీరో ఎంటర్‌ప్రైస్ చైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు వేగిరం కావాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సి ఉందన్నారు.
జర్మనీ వంటి చాలా దేశాలు సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నాయని గుర్తు చేశారు. మైండ్‌మైన్ ఇన్‌స్టిట్యూట్ శుక్రవారమిక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎకానమీ, జీడీపీ, జీఎస్‌టీ, డీమానిటైజేషన్ తదితర కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచ ఎకానమీలో భారత్ రానున్న రోజుల్లో ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
నల్లధనం తగ్గింది..: ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. జీఎస్టీ, డీమానిటైజేషన్ (పెద్ద నోట్ల రద్దు) కారణంగా ప్రస్తుతం దేశ జీడీపీ వృద్ధి తగ్గింది. స్వల్పకాలంలో వీటి ప్రభావం తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. అయితే దీర్ఘకాలంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఇప్పటికే పన్ను పరిధిలోకి చాలా మంది వస్తున్నారు. నల్లధన సృష్టి తగ్గింది.
భారత్‌లో జీడీపీ రెండంకెల వృద్ధి సాధ్యమే. వృద్ధి 14 శాతం దాకా వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. పరిపాలన పరంగా మంచి ఆలోచనలకు కొదవ లేదు. సమస్యల్లా వాటి అమలులోనే. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ప్రభుత్వం నడుచుకోవాలి. ప్రస్తుత ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అడుగులేస్తోంది. అయితే పేదరికం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు.
ఎస్‌ఎంఈలకు ప్రోత్సాహం..
నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా పరిణమించింది. మరోవైపు నైపుణ్యలేమి కొట్టొచ్చినట్టు కనపడుతోంది. పేదరికం, నిరుద్యోగం విషయంలో ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, సమాజం బాధ్యత వహించాల్సిందే. దేశంలో అధిక ఉద్యోగావకాశాలను సృష్టిస్తున్న సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. స్టార్టప్ కంపెనీలకు చేయూతనివ్వాలి. ఇక్కడి కంపెనీలు అంతర్జాతీయంగా పోటీపడాలంటే ఆటోమేషన్, నూతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు నూతన ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది. ఇదే సమయంలో ఇప్పటికే ఉన్న రంగాల్లో పనిచేస్తున్నవారు తమ ప్రతిభకు పదునుపెట్టుకోవాల్సిందే. అప్పుడే నిలదొక్కుకోగలరు. అంటే సంక్షోభం రాకముందే మేల్కోవాలి. తద్వారా నిరుద్యోగ సమస్యకు కొంత చెక్ పెట్టొచ్చు. జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా కొత్త ఉద్యోగాల సృష్టి జరగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment