ముంబై: టాటా గ్రూపులో భాగమైన ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చి త్రైమాసికంలో ఏకంగా 70 శాతం పెరిగింది. ఈ కాలంలో కంపెనీ లాభం రూ.79 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.46 కోట్లుగానే ఉంది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం వృద్ధితో రూ. 1,069 కోట్ల నుంచి రూ.1,154 కోట్లకు చేరుకుంది.
డిమాండ్ బాగుండడంతో అనుకూలమైన చర్యల ద్వారా మార్జిన్లను పెంచుకోవడం మెరుగైన పనితీరుకు కారణమని కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ తెలిపారు. చెన్నై, గురుగ్రామ్ మార్కెట్లో అధిక లభ్యత ఉండడమే కారణంగా పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం 2017–18లో కంపెనీ రూ.103 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల మేర నష్టాలు వచ్చాయి.
ఇక ఆదాయం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.4,075 కోట్లుగా ఉండగా, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.4,165 కోట్లకు వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 10 హోటళ్లు ప్రారంభించామని, దీంతో మొత్తం హోటళ్ల సంఖ్య 697కు చేరుకుందని చత్వాల్ తెలిపారు. ఒక్కో షేరుకు 40 పైసల డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment