న్యూయార్క్ : భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు. ఐబీఎం సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ హోదాలో కొనసాగుతున్న అరవింద్‌ను కంపెనీ డైరెక్టర్ల బృందం సీఈఓగా ఎన్నుకుంది. ఐబీఎం నవ శకానికి అరవింద్ సరైన నాయకుడని ఐబీఎం ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ అన్నారు. ఐబీఎం రూపొందించిన కీలక సాంకేతిక పరిఙ్ఞానాల్లో ఆయన పాత్ర మరువలేనిదని చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ తయారీలో అరవింద్ బాగా కృషి చేశారని కొనియాడారు.
రెడ్ హ్యాట్ కొనుగోలులో అరవింద్ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇక ఐబీఎం చైర్మన్ అయిన గిన్నీ రోమెట్టీ (62) ఈ ఏడాది చివర్లో రిటైర్ అవుతారు. అప్పటి వరకు ఆమె ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. దీంతోపాటు ఐబీఎంలో సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్, రెడ్ హ్యాట్ సీఈఓ అయిన జేమ్స్ వైట్ హర్ట్స్ ఐబీఎం ప్రెసిడెంట్‌గా కంపెనీ డైరెక్టర్లు ఎన్నుకున్నారు. 1990 అరవింద్ కృష్ణా (57) ఐబీఎంలో చేరారు. కాన్పూర్ ఐఐటీలో సాంకేతిక శాస్త్రంలో డిగ్రీ, ఇల్లినాయిస్ యూనివర్సీటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఆయన పీహెచ్‌డీ చేశారు.
తనను సీఈఓగా ఎన్నుకోవడం పట్ల అరవింద్ ఆనందం వ్యక్తం చేశారు. బోర్డు మెంబర్లు, ప్రస్తుత సీఈఓ గిన్నీ రోమెట్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. అందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. మెరుగైన సాంకేతిక పరిఙ్ఞానంతో తమ క్లైంట్లకు ఎదురయ్యే కష్టతరమైన సవాళ్లను అధిగమిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల-గూగుల్ సీఈఓ, సుందర్ పిచాయ్-ఆల్ఫాబెట్ సీఈఓ, అజయ్ బంగా మాస్టర్ కార్డ్-సీఈఓ, శంతను నారాయణ్ అడోబ్-సీఈఓగా పనిచేస్తున్నారు. ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సికో సీఈఓగా పనిచేసిన ఇంద్రా నూయి రిటైర్ అయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment