ప్రపంచంలో అత్యధిక జీతం తీసుకుంటున్న అతి కొద్దిమంది సీఈఓలలో ఒకరు ఐబీఎమ్ సీఈఓ 'అరవింద్ కృష్ణ'. ఇంతకీ ఈయన ఎవరు? ఈయన వేతనం ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..
ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓలలో ఒకరుగా మాత్రమే తెలిసిన అరవింద్ కృష్ణ.. మన భారతీయుడు అని బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఈయన 1962 నవంబర్ 23 పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన తెలుగు బిడ్డ. తండ్రి భారత సైన్యంలో పనిచేసిన ఆర్మీ అధికారి.
అరవింద్ కృష్ణ తమిళనాడులోని కూనూర్‌లోని స్టాన్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, డెహ్రాడూన్‌లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీలో చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని.. 1991లో యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా - ఛాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పిహెచ్‌డీ పట్టా పొందారు.
అరవింద్ కృష్ణ 1990లోనే ఐబీఎంకు సంబంధించిన థామస్ జే. వాట్సాన్ రీసెర్చ్ సెంటర్‌లో చేరారు. 2009 వరకు అక్కడే కొనసాగారు. ఆ తరువాత ఐబీఎం ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్‌లో జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2015లో ఐబీఎం రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొందారు. ఆ తరువాత ఐబీఎం క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2020లో ఐబీఎం సీఈఓ అయ్యారు. కంపెనీలో ఈయన దాదాపు 34 ఏళ్ళు పనిచేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్‌మన్
ఐబీఎం సీఈఓ అయిన తరువాత అరవింద్ కృష్ణ.. కంపెనీ ఉన్నతికి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈయన వార్షిక వేతనం ఇప్పుడు రూ.165 కోట్లు. అంటే రోజుకు రూ.45 లక్షల జీతం అన్న మాట. 2023లో ఈయన జీతం పెరగడంతో వార్షిక వేతనం భారీగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment