శాలరీ నెగోషియేషన్.. అదేనండి జీతాల బేరసారాలు. ఇది ప్రతి ఇంటర్వ్యూ ప్రక్రియలో భాగమైన, సాధారణమైన, సంక్లిష్టమైన విషయమే. అభ్యర్థి ఎంత ఆశిస్తున్నారు.. కంపెనీ బడ్జెట్ ఎంత అన్నవాటి మధ్య ఈ జీతం చర్చలు జరుగుతాయి. అయితే బెంగుళూరుకు చెందిన ఒక సీఈవో తన కంపెనీలో ఇలాంటి తతంగం ఏమీ లేకుండా అభ్యర్థులు అడిగినంత జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ జోకో సహ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్.వి లింక్డ్‌ఇన్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తమ కంపెనీలో నియామక ప్రక్రియ నుంచి శాలరీ నెగోషియేషన్ దశను తప్పించామని, అభ్యర్థులు అడిగినంత జీతాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. దీనికి కారణాలను సైతం ఆయన వివరించారు.
“నా బృందం కోసం 18 మందికి పైగా నియమించుకున్న తర్వాత, ప్రపంచ స్థాయి ప్రతిభను నిలుపుకునే రహస్యాన్ని నేను కనుగొన్నాను. మేము శాలరీ నెగోషియేషన్ చేయము. వారు అడిగినంత అక్షరాలా చెల్లిస్తాము” అని జోకో సీఈవో అర్జున్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
“ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి సవరిస్తాం. కారణం సింపుల్” అంటూ తన నిర్ణయం వెనుక నాలుగు కారణాలను ఆయన పేర్కొన్నరు. తాను ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే శాలరీ నెగోషియేషన్ చేశానని, అది కూడా అభ్యర్థి అడిగినదాని కంటే పెంచడం కోసమని వివరించారు. అదే ఉద్యోగానికి బయట ఇతర కంపెనీలు ఇస్తున్నదాని కంటే ఆ అభ్యర్థి తక్కువ అడగడంతో తాను మరింత ఆఫర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
సీఈవో అర్జున్ ఈ పోస్ట్ షేర్ చేసినప్పటి నుంచి దానికి అనేక స్పందనలు వచ్చాయి. ప్రశ్నలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అభ్యర్థులు అసమంజసమైన జీతాలు అడిగితే ఎలా? అంటూ మరో కంపెనీ సీఈవో ప్రశ్నించారు. అది సరే వార్షిక పెంపు మాటేంటి అని ఏఐ అండ్ అనలైటిక్స్‌లో పనిచేస్తున్న ఓ యూజర్ అడిగారు. పరిమిత వనరులు ఉన్న స్టార్టప్‌లు, బల్క్ రిక్రూట్‌మెంట్ అవసరమయ్యే పెద్ద కంపెనీలకు ఇది సరిపోకపోవచ్చని మరో యూజర్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment