ఇ-టికెట్లపై రైల్వే బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రయాణీకులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందు ప్రయాణించండి, తర్వాత డబ్బులు చెల్లించండి అనే కొత్త ఆప్షన్‌ను రైల్వే ప్రయాణీకులకుఅందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ కొత్త పథకం ద్వారా ఐదు రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది . అలాగే ప్రయాణించిన 14రోజుల లోపు డబ్బులు చెల్లించాలి . దీని కోసం ఐఆర్‌సీటీసీ ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా ఈ విధానాన్ని ఎంచుకునే ఇ-టికెట్లలో మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. 3.5 శాతం సేవా చార్జీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
‘బుక్ టికెట్స్ నౌ అండ్ పే లేటర్’ సర్వీసులను తమ కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించామని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) అధికారి తెలిపారు. ఏ ఎక్స్ ప్రెస్ రైల్‌లో నైనా ఈ సేవలను పొందవచ్చని చెప్పారు. దీనికి సంబంధించింది ముంబై ఆధారిత సంస్థ ఈ పే లేటర్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు ఐఆర్‌సీటిసి అధికార ప్రతినిధి సందీప్ దత్తా చెప్పారు.
ఇలా టికెట్ రిజర్వ్ చేసుకునే వారు తమ ఆధార్, పాన్ కార్డు, ఈ మెయిల్ ఐడీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సేవను ఉపయోగించుకోవడానికి వీలుగా ఒన్ టైం పాస్‌వర్డ్ కూడా వస్తుంది. వినియోగదారుల గత చెల్లింపుల విధానం ఆధారంగా ఆ సంస్థ ఈ అవకాశం కల్పిస్తుంది. ముందు ప్రయాణించి తర్వాత డబ్బులు చెల్లించే ఈ పథకం ద్వారా ప్రస్తుతం 58 శాతం ఉన్న ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ మరింతగా పెరుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.