వృద్ధి అవకాశాలపై చిన్న సంస్థల ధీమా
ఫేస్‌బుక్, ప్రపంచ బ్యాంక్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : దేశీయంగా చిన్న సంస్థలు (ఎస్‌ఎంఈ) తమ వ్యాపారాల వృద్ధి అవకాశాలపై ధీమాగా ఉన్నాయి. అలాగే నియామకాలపరంగానూ ఆశావహంగా ఉన్నాయి. ఫేస్‌బుక్, ఓఈసీడీ, ప్రపంచ బ్యాంక్ సంయుక్తంగా రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వ్యాపార సంస్థల్లో 48 శాతం ఎస్‌ఎంఈలు.. ప్రస్తుత పరిస్థితులపై, 62 శాతం సంస్థలు భవిష్యత్ అవకాశాలపైనా సానుకూలంగా స్పందించాయి.
గత ఆర్నెల్లల్లో ఉద్యోగుల సంఖ్య పెరిగిన సంస్థలు 28 శాతం కాగా.. వచ్చే ఆర్నెల్లలో సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న ఎస్‌ఎంఈలు 56 శాతం ఉన్నాయి. చిన్న సంస్థలు.. డిజిటల్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. ఎస్‌ఎంఈల కార్యకలాపాలు, అవి ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన వాటిపై అవగాహన కోసం ఇది తోడ్పడనుంది.