
సాక్షి, హైదరాబాద్ : మనవాళ్లు అర్థరాత్రి,అపరాత్రి అనే తేడా లేకుండా ఎడాపెడా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయం ముందు నుంచి డిన్నర్ టైమ్ దాటి అర్థరాత్రి దాకా ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి రకరకాల ఆహారాన్ని ఇంటికి తెప్పించుకుంటున్నారు. గతంలో కొద్ది కొద్దిగా కొన్ని తినుబండారాలను ఇంటికే రప్పించుకునేందుకు మక్కువ చూపిన భారతీయుల్లో ఇప్పుడు గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
గతేడాది కాలంగా దేశంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసే వినియోగదారుల సంఖ్య క్రమక్రమంగా వృద్ధి అవుతోంది. పొద్దున్నే అల్పాహారం మొదలుకుని మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్‌లాంటి స్నాక్స్, రాత్రి పొద్దుపోయాక డిన్నర్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలా గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు చేసిన ఆర్డర్ల సంఖ్యపై బెంగళూరులోని రిసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఓ పరిశీలన నిర్వహించింది.
2017 మార్చిలో 45 వేల వరకు ఉన్నా ఇలాంటి ఆర్డర్లు అదే ఏడాది డిసెంబర్ చివరినాటికి 85 వేలకు(దాదాపు రెండింతలు) చేరుకున్నట్టు తేలింది. ఈ ఆర్డర్లు అన్నీ కూడా నిర్దేశిత సమయాల్లో (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్) కాకుండా, వాటికి ముందు వెనకగా అర్థరాత్రి దాటే వరకు కూడా ఇస్తున్నట్టు వెల్లడైంది.
అర్థరాత్రి డెలివరీపై దృష్టి..
అవివాహితులు, విద్యార్థులు, వివిధ రంగాల్లో వృత్తి నిపుణులుగా చేరిన వారు ఎక్కువగా ఈ ఫుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు రెడ్‌సీర్ ఏజీఎం వైభవ్ ఆరోరా చెబుతున్నారు. అయితే ఇలాంటి ఆర్డర్లు ఇచ్చే విషయంలో గృహిణులు కూడా ఏమంత వెనుకబడి లేరని తెలుస్తోంది. మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా హోటళ్ల నుంచి ఆహారాన్ని ఇళ్లకు తెచ్చిస్తున్న డెలివరీ సంస్థలు కూడా అర్థ రాత్రుళ్లు తినుబండారాలను చెరవేసే పనిపై ఎక్కువ దృష్లిని కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనైతే బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ అధికంగా ఆర్డర్ ఇస్తున్నట్టు తెలిసింది.
పెరుగుతున్న మార్కెట్...
2015–16 మధ్యకాలంలో ఇండియాలోని మొత్తం ఆన్‌లైన్ డెలివరీ రంగం (వివిధ రకాల వస్తువులు మొదలుకుని ఆహారం దాకా) 30 శాతం వృద్ధి చెందింది. అయితే రెస్టారెంట్ పరిశ్రమ మాత్రం 11 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. గతేడాది కూడా అతివేగంగా వృద్ది చెందుతున్న పరిశ్రమగా ఈ రంగమే (హోటర్ పరిశ్రమ) నిలిచింది.
గతంతో పోల్చితే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, గతంలో అయిదుసార్లు ఆర్డర్ చేసిన వ్యక్తులు ఇప్పుడు 8,9 పర్యాయాలు ఆర్డర్ చేస్టున్నట్టు వైభవ్ తెలిపారు. గత అయిదేళ్లలో జొమాటో, స్విగ్గీ సంస్థలు ఈ రంగంలో 70 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. 2017 మేలో భారత్‌లో తినుబండారాల ఆర్డర్, డెలివరీ రంగంలో ఊబర్‌ఈట్స్ పేరిట ఊబర్, గతేడాది డిసెంబర్‌లో ఫుడ్‌పండాను ఓలా సంస్థ టేకోవర్ చేసింది. దీంతో ఆధిపత్యం కోసం ఈ రెండింటి మధ్య పోటీ తీవ్రమవుతోంది. ఇదిలా ఉంటే 2021 కల్లా భారతీయ ఫుడ్ టెక్నాలజీ రంగం 250 కోట్ల డాలర్ల టర్నోవర్ దాటవచ్చునని అంచనా వేస్తున్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment