2040 నాటికి అమెరికాను అధిగమించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను అధిగమిస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– పీడబ్ల్యూసీ అంచనావేసింది. కొనుగోలు శక్తి వైవిధ్యం (పీపీపీ) ప్రాతిపదికన 2040 నాటికి ప్రపంచంలో రెండవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందన్నది తమ అంచనాగా వివరించింది.
అంతర్జాతీయ ఆర్థికవేదిక వచ్చే కొన్ని దశాబ్దాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి వర్థమాన దేశాలవైపునకు మారుతుందని నివేదిక అంచనా. వచ్చే 34 సంవత్సరాల్లో బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీలతో కూడిన ఈ–7 దేశాల వార్షిక వృద్ధి సగటు 3.5 శాతంగా ఉంటుందని వివరించింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాలతో కూడిన జీ7 దేశాల విషయంలో ఈ రేటు కేవలం 1.6 శాతంగా ఉంటుందని అంచనావేసింది.