
ఎగుమతులు పెరిగినా... వాణిజ్యలోటు భయం!
♦ మేలో 8 శాతం పెరిగిన ఎగుమతులు
♦ దిగుమతులూ 33 శాతం జంప్
♦ దీనితో 14 బిలియన్ డాలర్లకు ఎగసిన వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2017 మే నెలలో 8 శాతం (2016 మే నెల ఎగుమతులతో పోల్చితే) పెరిగాయి. విలువ రూపంలో 24.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెలలో దిగుమతులూ భారీగా 33 శాతం పైగా పెరిగాయి. విలువ రూపంలో 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దీనితో ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం– వాణిజ్యలోటు 14 బిలియన్ డాలర్లుగా నమోదయ్యిందని వాణిజ్యమంత్రిత్వశాఖ గణాంకాలు తెలిపాయి. ఇది 30 నెలల గరిష్ట స్థాయి. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్యలోటు 6 బిలియన్ డాలర్లు. ఎగుమతులు పెరిగినా వాణిజ్యలోటు పెరగడం కొంత ఆందోళనకరమైనదే. ఇదే ధోరణి కొనసాగితే, మొత్తం కరెంట్ అకౌంట్‌లోటుపై దీని ప్రభావం పడే అవకాశం ఉండడమే దీనికి కారణం.
బలాన్నిచ్చిన రంగాలివి...
మేలో ఎగుమతులు మంచి పనితనాన్ని ప్రదర్శించడానికి పెట్రోలియం(25 శాతం), ఇంజనీరింగ్ గూడ్స్ (8.25 శాతం), జౌళి (8 శాతం) అలాగే రత్నాలు, ఆభరణాల (6 శాతం) రంగాలు మంచి వృద్ధి రేటు సాధించడం కారణమయ్యింది.
దిగుమతుల్లో ‘బంగారం’ భారం!
మరోవైపు దిగుమతులు భారీగా పెరగడానికి బంగారం కూడా ఒక కారణంగా నిలిచింది. మే నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2016 మే నెలలో 1.47 బిలియన్ డాలర్ల పసిడి దిగుమతులు జరిగితే, ఈ ఏడాది ఇదే నెలలో ఈ విలువ 4.95 బిలియన్ డాలర్లకు చేరింది.
ఏప్రిల్–మే నెలల్లో...
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలలు– ఏప్రిల్–మే ఎగుమతులు 14 శాతం పెరిగి 49 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతులు 41 శాతం పెరిగాయి. 76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో వాణిజ్యలోటు దాదాపు 27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.
వృద్ధి ధోరణి కొనసాగుతుంది: కేంద్రం
ఎగుమతుల వృద్ధి ధోరణి రానున్న నెలలోనూ కొనసాగుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్య మంత్రిత్వశాఖ వ్యక్తం చేసింది. భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. దేశ వృద్ధికి సంబంధించి తగిన సమయంలో ఎగుమతుల విభాగం నుంచీ మద్దతు లభిస్తుండడం హర్షణీయమని సమాఖ్య ప్రెసిడెంట్ గణేష్ గుప్తా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు సంవత్సరాల క్షీణతకు (అసలు వృద్ధిలేకపోగా దిగువముఖం) బ్రేక్ వేస్తూ, గడచిన ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 4.71 శాతం వృద్ధితో 262.3 బిలియన్ డాలర్ల నుంచి 274.64 బిలియన్ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. జీఎస్‌టీ అమలు, విదేశీ వాణిజ్య విధానం సమీక్షతో భారత్ ఎగుమతులు మరింత పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని ఎఫ్‌ఐఈఓ ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా తెలిపారు.