వృద్ధి.. రయ్య్! రయ్య్ | India's January-March quarter growth to be around 7.1 per cent: DBS | Sakshi
Sakshi News home page

వృద్ధి.. రయ్య్! రయ్య్

Published Wed, Jun 1 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

వృద్ధి.. రయ్య్! రయ్య్

వృద్ధి.. రయ్య్! రయ్య్

జనవరి-మార్చిలో జీడీపీ వృద్ధి రేటు 7.9%
⇔  ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఇదే టాప్  2015-16కు 7.6 శాతం వృద్ధి
⇔  ఐదేళ్లలో ఈ స్థాయి వృద్ధి తొలిసారి    తయారీ, వ్యవసాయ రంగాల వెన్నుదన్ను

న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక రంగం గడచిన ఆర్థిక సంవత్సరం (2015 ఏప్రిల్-2016 మార్చి) సాధించిన వృద్ధి అటు ప్రభుత్వానికి, ఇటు ఆర్థికవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సంతోషాన్ని ఇచ్చింది.  2014-15 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చిచూస్తే... 2015-16లో ఈ విలువ 7.6 శాతం ఎగసింది. ఈ వృద్ధి శాతం ఐదేళ్ల గరిష్ట స్థాయి.  గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం.  కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఎస్‌ఓ వెల్లడించిన అంచనాలకు అనుగుణంగా వృద్ధి రేటు నమోదుకావడం గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం... ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నట్లయ్యింది.

 నాల్గవ త్రైమాసికంలో...
చివరి త్రైమాసికం (జనవరి-మార్చి, క్యూ4)లో జీడీపీ 2014-15 ఇదే కాలంలో పోల్చిచూస్తే 7.9% ఎగసింది.  నాల్గవ త్రైమాసికంలో తయారీ రంగం 9.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ సమీక్షా కాలంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.3 శాతం. మొత్తం జీడీపీలో ఈ రెండు రంగాల వాటా దాదాపు 30 శాతం వరకూ ఉంది.  అంతక్రితం మూడు త్రైమాసికాలు చూస్తే... ఏప్రిల్-జూన్‌లో వృద్ధి రేటు 7.5 శాతం, జూలై-సెప్టెంబర్ మధ్య వృద్ధి రేటు 7.6 శాతం, అక్టోబర్-డిసెంబర్ మధ్య రేటు 7.2 శాతంగా నమోదయ్యాయి. కాగా 2014-15 క్యూ4 వృద్ధి రేటు 7.5 శాతం.

 క్యూ4లో కొన్ని కీలక రంగాలిలా...

మైనింగ్, క్వారీయింగ్ చివరి త్రైమాసికంలో 8.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల విభాగంలో 9.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది.

నిర్మాణ రంగంలో రేటు 4.5 శాతంగా ఉంది.

⇔  గ్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్ల రంగంలో 9.9 శాతం వృద్ధి నమోదయ్యింది.

⇔  ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవల విభాగంలో వృద్ధి రేటు 9.1 శాతంగా ఉంది.

⇔  పబ్లిక్ అడ్మిన్, రక్షణ, ఇతర సేవల విషయంలో వృద్ధి 6.4 %.

 వార్షికంగా...
కొత్త విధానం స్థూల విలువ జోడింపు(జీవీఏ) ప్రకారం... వ్యవసాయ రంగం వార్షికంగా 1.2 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014-15లో ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా -0.2 శాతం క్షీణించింది. తయారీ రంగం వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 9.3 శాతానికి ఎగసింది. అయితే మైనింగ్ రంగంలో మాత్రం రేటు 10.8 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ విషయంలో కూడా వృద్ధి రేటు 8% నుంచి 6.6 శాతానికి తగ్గింది. నిర్మాణ రంగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 3.9 శాతానికి పడింది. ట్రేడ్, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల విభాగాల్లో వృద్ధి సైతం 9.8 శాతం నుంచి 9 శాతానికి పడింది. ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషన్ సేవల రేటు 10.6 శాతం నుంచి 10.3 శాతానికి తగ్గింది. పబ్లిక్ అడ్మిన్, రక్షణ, ఇతర సేవల విషయంలో వృద్ధి రేటు కూడా 10.7 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. మొత్తంగా చూస్తే... ఆర్థిక సంవత్సరం మొత్తం ఫలితాలను మెరుగుపరచడానికి నాల్గవ త్రైమాసికం ‘పరుగే’ కారణంగా కనిపిస్తోంది.

 లక్ష్యాల మేరకు ద్రవ్యలోటు
జీడీపీ మొత్తం విలువతో పోల్చిచూస్తే.. ప్రభుత్వ ఆదాయాలు- వ్యయాలకు మధ్య వ్యత్యాసం(ద్రవ్యలోటు) 2014-15లో లక్ష్యాల మేరకే ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. జీడీపీలో 3.9 శాతంగా (రూ.5.32 లక్షల కోట్లు) ద్రవ్యలోటు ఉండాలన్నది లక్ష్యమని, తాజా గణాంకాల ప్రకారం ఈ లక్ష్యం నెరవేరిందని తెలిపింది.  కాగా ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రూ.1.37 లక్షల కోట్లుగా నమోదయ్యింది. 2016-17 లక్ష్యంలో ఇది 26%. బడ్జెట్ నిర్దేశించిన ప్రకారం- ఈ లోటు మొత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.5.33 లక్షల కోట్లు ఉండాలి. జీడీపీతో పోల్చితే ఈ లోటు లక్ష్యం 3.5 శాతం.

తలసరి ఆదాయం రూ.93,293
2011-12 ధరల వద్ద చూస్తే... 2014-15లో మొత్తం జీడీపీ విలువ 104.28 లక్షల కోట్లు. 2015-16లో ఈ విలువ 112.14 లక్షల కోట్లకు ఎగసింది. అంటే వృద్ధి రేటు 7.6 శాతమన్నమాట. దీనిప్రకారం ప్రస్తుత ధర వద్ద భారత తలసరి ఆదా యం 7.4% ఎగసింది. రూ.93,293కు చేరింది. 2014-15లో ఈ మొత్తం రూ.86,879.  2011-12 ధరల ప్రకారం చూస్తే... ఈ విలువ 6.2 శాతం ఎగసి రూ.77,435కు చేరింది.

 ఈ ఏడాది వృద్ధి 8 శాతం: కేంద్రం
తాజా గణాంకాల పట్ల కేంద్రం హర్షం వ్యక్తం చేసింది. తగిన వర్షపాతం నమోదయితే ఈ ఏడాది(2016-17) వృద్ధి రేటు 8% నమోదవుతుందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. మౌలిక, సామాజిక రంగాలపై వ్యయాల పెంపు ప్రణాళికలు కూడా వృద్ధి మెరుగుదలకు దోహదపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.

పరిశ్రమల హర్షం...
వృద్ధి రేటు జోరు పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే వృద్ధి రేటు మరింత పెరగాలంటే సంస్కరణల అమలును వేగవంతం చేయాలని పేర్కొన్నాయి.

 ఫిక్కీ: అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ ఈ స్థాయి వృద్ధి గణనీయమైనదని ఫిక్కీ పేర్కొంది. గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు, డిమాండ్ మెరుగుదల వంటివి పటిష్ట వృద్ధికి దోహదపడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోటియా పేర్కొన్నారు.

 సీఐఐ: డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ, నాల్గవ త్రైమాసికం ఇచ్చిన ఉత్సాహం చూస్తుంటే... ఈ ఏడాది వృద్ధి రేటు 8 శాతంగా నమోదవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

 అసోచామ్:  ఆర్థికాభివృద్ధి రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని అసోచామ్ పేర్కొంది. అయితే రుణ వృద్ధి, గ్రామీణ డిమాండ్, పరిశ్రమల ఉత్పత్తి ఇంకా బలహీనంగా ఉన్నాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement