వ్యవస్థీకృత జువెలరీ రంగంలో 12% వృద్ధి: ఇండ్ రా
ముంబై: దేశీ వ్యవస్థీకృత జువెలరీ (ఆర్గనైజ్‌డ్) రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతంమేర వృద్ధి నమోదుకావొచ్చని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్ రా) అంచనా వేసింది. తక్కువ ప్రభుత్వపు నియంత్రణలు, పండుగలు/పెళ్లిళ్ల సీజన్ వంటి పలు అంశాలు ఈ వృద్ధికి కారణాలుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ద భాగంలో జువెలరీ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, దీనికి ప్రభుత్వపు ఎక్సైజ్ సుంకం విధింపు, జువెలర్స్ సమ్మె వంటి పలు అంశాలు కారణాలుగా నిలిచాయని వివరించింది.
కాగా ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, అలాగే అధిక పెళ్లి రోజులు ఉండటం వంటి సానుకూలతల వల్ల వచ్చే మూడు త్రైమాసికాల్లో వ్యవస్థీకృత జువెలరీ అమ్మకాల్లో 10-12 శాతం వృద్ధి నమోదుకావొచ్చని వివరించింది. జువెలరీకి హాల్‌మార్క్ గుర్తు తప్పనిసరి నిబంధన, గోల్డ్ సేవింగ్స్ స్కీమ్‌లో కొన్ని సవరణలు వంటి అంశాలు ఈ వృద్ధికి దోహదపడతాయని తెలిపింది.