సాక్షి,న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఊపందుకుంటుడటంతో 2018లో నియామకాల ప్రక్రియ జోరందుకుని జాబ్ మార్కెట్ మునుపటి కళ సంతరించుకుంటుందనే అంచనాలు వెల్లడయ్యాయి.జాబ్ ఆఫర్లు పెరగడంతో పాటు వేతన స్ధాయిలు, భిన్న రిక్రూటర్లు, ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్ల వంటి అన్ని విభాగాల్లోనూ మెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. అన్ని క్యాంపస్‌లలో జాబ్ ఆఫర్ల ఊపు కొనసాగుతుండటం సానుకూల సంకేతాలు పంపుతోంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నియామకాల కోసం 90 ఇంజనీరింగ్ కాలేజ్‌లు, బిజినెస్ స్కూల్స్‌ను ఎంపిక చేసుకుంది. ఐఐటీ బాంబేలో అంతర్జాతీయ ఆఫర్లు 2016లో 50 నుంచి ఈ ఏడాది 60కి పెరగడం గమనార్హం. మరోవైపు అమెరికాకు చెందిన క్లౌడ్ డేటా కంపెనీ రుబ్రిక్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన ఆప్టివర్, బ్రిటన్ కంపెనీ హల్మా తదితర సంస్థలు తొలిసారిగా భారత్ క్యాంపస్‌లలో నియామకాలు చేపడుతున్నాయి.
అమెరికా, యూరప్‌కు చెందిన బహుళజాతి సంస్థలతో పాటు జపాన్, తైవాన్, దక్షిణ కొరియా, సింగపూర్‌ల నుంచి ఆసియా కంపెనీలు భారత ప్రొఫెషనల్స్‌ను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. టీమ్‌లీజ్ సర్వీసెస్ పలు సంస్థలతో కలిసి నిర్వహించన అథ్యయనంలోనూ జాబ్ మార్కెట్‌లో స్ధబ్థత వీడి ఉత్తేజం నెలకొన్నట్టు వెల్లడైంది.
ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్సల్టింగ్ రంగాల్లో నియామకాలు ఊపందుకోగా, కాగ్నిజెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, డెలాయిట్, క్యాప్‌జెమిని, విప్రో, అమెజాన్, ఈవై, హెచ్‌సీ టెక్, యాక్సెంచర్, కేపీఎంజీలు టాప్ రిక్రూటర్స్‌గా ఉన్నాయి.మరోవైపు స్టార్టప్‌లు కూడా పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు దిగుతుండటంతో 2018లో కొలువుల మార్కెట్ కళకళలాడుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment