ఇండిగో ఐపీఓకు ఆమోదం
న్యూఢిల్లీ: చౌక ధరల్లో విమానయాన సర్వీసులందజేసే ఇండిగో సంస్థ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓ ద్వారా ఇండిగో రూ.2,500 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,272 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేస్తారు. మరోవైపు ప్రస్తుతమున్న వాటాదారుల వద్దనున్న 3 కోట్ల షేర్లను కూడా ఇంతే మొత్తానికి ఈ ఐపీఓ ద్వారా ఆఫర్ చేయాలని ఇండిగో భావిస్తోంది. ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ ఏడాది జూన్‌లోనే ఇండిగో సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓకు సిటీగ్రూప్, జేపీ మోర్గాన్ ఇండియా, మోర్గాన్ స్టాన్లీ, బార్‌క్లేస్, యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా, కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీలు మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. దేశంలో లాభాలార్జిస్తున్న రెండు విమాన యాన సంస్థల్లో ఇండిగో ఒకటి కాగా, రెండోది గో ఎయిర్.