సాక్షి, ముంబై : ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కో ప్రమోటర్, అమెరికాకు చెందిన రాకేష్ గాంగ్వాల్ , సహ ప్రమోటర్ రాహుల్ భాటియాపై సెబీకి ఫిర్యాదు చేశారు. భాటియాపై గతంలో తాను చేసిన ఫిర్యాదులపై రెగ్యులేటరీ జోక్యం కోరుతూ సోమవారం సెబీకి లేఖ పంపారు. 49 పేజీల ఈ లేఖలో సంస్థలో గవర్నన్స్‌పై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని గాంగ్వాల్ తెలిపారు. దీనిపై స్పందించిన సెబీ జూలై 19 లోగా ఈ లేఖపై స్పందన తెలియజేయాల్సిందిగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను కోరింది.
మరోవైపు గాంగ్వాల్ ఆరోపణలను రాహుల్ భాటియా తీవ్రంగా ఖండించారు. కంపెనీని బలహీన పర్చేందుకే గాంగ్వాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ ఇండిగో బోర్డుకు లేఖ రాశారు.
కాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యంలో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిన నేపథ్యంలో ఇద్దరూ విడిగా న్యాయ సలహాల కోసం విభిన్న సంస్థలను ఆశ్రయించారు. రాహుల్ భాటియాకు ఇంటర్‌గ్లోబ్ మాతృ సంస్థ ఇండిగోలో 38 శాతం వాటా ఉండగా, గంగ్వాల్ కు 37 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2006లో భాటియా, గంగ్వాల్ సంయుక్తంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment