Rakesh Gangwal
-
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. -
ఇంటర్‌గ్లోబ్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
వర్జిన్ ఆస్ట్రేలియాను కొంటాం..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన ఆంక్షలతో కుదేలైన వర్జిన్ ఆస్ట్రేలియా (వీఏ) కొనుగోలుపై దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో అతి పెద్ద వాటాదారు అయిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కసరత్తు చేస్తోంది. వీఏ విక్రయ ప్రక్రియలో పాల్గొనేందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇద్దరు ప్రమోటర్లలో ఒకరైన రాహుల్ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌కు కంపెనీలో అత్యధికంగా 37.8% వాటా ఉంది. మరో ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్, ఆయన కుటుంబానికి 36.64% వాటాలు ఉన్నాయి. బ్రిటన్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ సహ వ్యవస్థాపకుడిగా 2000లో వర్జిన్ ఆస్ట్రేలియా ఫుల్ సర్వీస్ ఎయిర్‌లైన్స్‌గా కార్యకలాపాలు ప్రారంభించింది. కొన్నాళ్లుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ సంస్థ.. ఇటీవల కరోనా వైరస్‌పరమైన ఆంక్షల కారణంగా మార్చిలో అన్ని సర్వీసులు రద్దు చేయడంతో మరింత కుదేలైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి సుమారు 887.60 మిలియన్ డాలర్ల రుణం వస్తుందని ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. దీంతో ఏప్రిల్ 21న దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. సంస్థలో సుమారు 16,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
మాటల కంటే చేతలే చెబుతాయి..
న్యూఢిల్లీ: రాకేశ్ గంగ్వాల్ మాటల కంటే చేతలే పెద్దగా చెప్పగలవని ఇండిగో మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా అన్నారు. ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు ఇటీవల వెలుగు చూసిన విషయం తెలిసిందే. సంస్థలో కార్పొరేట్ పాలనా పరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని, రిలేటెడ్ పార్టీ లావాదేవీలు (ఆర్పీటీ) జరుగుతున్నాయంటూ ఈ ఏడాది జూలైలో సెబీకి గంగ్వాల్ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఆరోపణలను భాటియా గ్రూపు ఖండించింది కూడా. గవర్నెన్స్ ఇండియా డాట్ కామ్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రారంభించి అందులో గంగ్వాల్ తన ప్రకటనలు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ‘‘కొంత కాలానికి ఆయన వెబ్సైట్ కంటే ఆయన చర్యలే ఎక్కువగా తెలియజేస్తాయని భావిస్తున్నా. ఇండిగో తనంతట తాను నిలదొక్కుకునే స్థాయికి చేరుకుంది’’ అని ఇండిగో వార్షిక సాధారణ సమావేశం సందర్భంగా భాటియా పేర్కొన్నారు. -
ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను ఉల్లంఘించేలా ఇండిగో విర్వహణ పాన్‌షాపు కన్నా అధ్వానంగా మారిందని, మరో ప్రమోటరు రాహుల్ భాటియా తాను లబ్ధి పొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ గంగ్వాల్ సెబీకి, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులోని ప్రస్తావించిన ఆరోపణలకు పేరాల వారీగా వివరణనివ్వాలంటూ కంపెనీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గంగ్వాల్ గ్రూప్‌నకు 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటాలు ఉన్నాయి. గంగ్వాల్ రిస్కులు లేకుండా జాగ్రత్తపడ్డారు: భాటియా గ్రూప్ గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ (ఐజీఈ) తాజాగా మరో ప్రకటన చేసింది. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉన్నప్పటికీ గంగ్వాల్ మాత్రం తనకు రిస్కులు తక్కువగా ఉండేలా చూసుకున్నారని పేర్కొంది. భాటియా, ఆయన తండ్రి కపిల్ భాటియా దాదాపు రూ. 1,100 కోట్ల దాకా సొంత పూచీకత్తునిచ్చారని, గంగ్వాల్ మాత్రం ఈక్విటీ రిస్కులు రూ. 15 కోట్లు కూడా మించకుండా జాగ్రత్తపడ్డారని ఐజీఈ పేర్కొంది. తన బాధ్యతలు సరిగ్గా పాటించని వ్యక్తి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
పాన్ షాపుకన్నా అధ్వానం!!
న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్ షాపు నిర్వహణైనా మెరుగ్గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థను నేడు అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన విలువలకు తిలోదకాలిచ్చి.. కంపెనీ పక్క దారి పడుతోందని గంగ్వాల్ ఆరోపించారు. మరో ప్రమోటరు రాహుల్ భాటియా, ఆయన సంస్థలు సందేహాస్పద లావాదేవీలు జరిపినట్లు పేర్కొన్నారు. చిరకాల మిత్రుడైన భాటియాకు కంపెనీపై అసాధారణ నియంత్రణాధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డర్ల ఒప్పందం ఉందని గంగ్వాల్ ఆరోపించారు. ‘సందేహాస్పద లావాదేవీలతో పాటు కనీసం ప్రాథమికమైన గవర్నెన్స్ నిబంధనలు, చట్టాలను కూడా పాటించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం సరిదిద్దే చర్యలు తీసుకోవాలి‘ అని లేఖలో పేర్కొన్నారు. దీని కాపీని అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా పంపారు. 19లోగా వివరణివ్వండి..: రాకేష్ గంగ్వాల్ చేసిన ఫిర్యాదులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో కీలక వివరాలు ఇవ్వాలంటూ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను ఆదేశించింది. దీనికి జూలై 19 గడువు విధించింది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇండిగో ఈ విషయాలు తెలిపింది. సెబీకి గంగ్వాల్ రాసిన లేఖ ప్రతి తమకు కూడా అందినట్లు వివరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు స్వల్పంగా నష్టపోయి రూ. 1,565.75 వద్ద క్లోజయ్యింది. వివాదం ఇదీ.. ఇండిగో సహవ్యవస్థాపకుడు అయిన గంగ్వాల్‌కు కంపెనీలో 37% వాటాలు ఉన్నాయి. మరో సహవ్యవస్థాపకుడు రాహుల్ భాటియా, ఆయన సంబంధ సంస్థల (ఐజీఈ గ్రూప్)కు 38% వాటాలున్నాయి. సంబంధ పార్టీల మధ్య సందేహాస్పద లావాదేవీలపై ఇద్దరు ప్రమోటర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో అత్యవసర షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించాలంటూ గంగ్వాల్ గతంలో ప్రతిపాదించగా భాటియా దాన్ని తిరస్కరించారు. అసమంజసమైన ఆయన డిమాండ్లను కంపెనీ బోర్డు ఒప్పుకోనందున గంగ్వాల్ ఇలాంటివన్నీ చేస్తున్నారంటూ భాటియా ఆరోపించారు. దేశీయంగా అతి పెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగోకు దాదాపు 49%మార్కెట్ వాటా ఉంది. 200 పైచిలుకు విమానాలతో రోజూ 1,400 ఫ్లయిట్స్ నడుపుతోంది. భాటియాకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేలా షేర్‌హోల్డరు ఒప్పందం ఉన్నప్పటికీ.. సుదీర్ఘ మిత్రత్వం దృష్టిలో ఉంచుకుని, కంపెనీపై నియంత్రణాపేక్ష పెట్టుకోకుండా అగ్రిమెంటు తాను అంగీకరించానని గంగ్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం భాటియాకు చెందిన ఐజీఈ గ్రూప్‌నకు ఆరుగురిలో ముగ్గురు డైరెక్టర్లను, చైర్మన్, సీఈవో, ప్రెసిడెంట్‌ను నియమించే అధికారాలు ఉంటాయి. ప్రస్తుత చైర్మన్ స్వతంత్రతను తాను ప్రశ్నించడం లేదని కానీ స్వతంత్ర చైర్మన్ పేరిట జరిపే నియామక ప్రక్రియే సెబీ నిబంధనలను తుంగలో తొక్కేలా ఉందని గంగ్వాల్ ఆరోపించారు. -
ఇండిగో ప్రమోటర్లు : ముదురుతున్న పోరు
సాక్షి, ముంబై : ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కో ప్రమోటర్, అమెరికాకు చెందిన రాకేష్ గాంగ్వాల్ , సహ ప్రమోటర్ రాహుల్ భాటియాపై సెబీకి ఫిర్యాదు చేశారు. భాటియాపై గతంలో తాను చేసిన ఫిర్యాదులపై రెగ్యులేటరీ జోక్యం కోరుతూ సోమవారం సెబీకి లేఖ పంపారు. 49 పేజీల ఈ లేఖలో సంస్థలో గవర్నన్స్‌పై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని గాంగ్వాల్ తెలిపారు. దీనిపై స్పందించిన సెబీ జూలై 19 లోగా ఈ లేఖపై స్పందన తెలియజేయాల్సిందిగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను కోరింది. మరోవైపు గాంగ్వాల్ ఆరోపణలను రాహుల్ భాటియా తీవ్రంగా ఖండించారు. కంపెనీని బలహీన పర్చేందుకే గాంగ్వాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ ఇండిగో బోర్డుకు లేఖ రాశారు. కాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యంలో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిన నేపథ్యంలో ఇద్దరూ విడిగా న్యాయ సలహాల కోసం విభిన్న సంస్థలను ఆశ్రయించారు. రాహుల్ భాటియాకు ఇంటర్‌గ్లోబ్ మాతృ సంస్థ ఇండిగోలో 38 శాతం వాటా ఉండగా, గంగ్వాల్ కు 37 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2006లో భాటియా, గంగ్వాల్ సంయుక్తంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
‘ఇండిగో’లో ఇంటిపోరు!!
న్యూఢిల్లీ: ఒకదాని వెంట ఒకటిగా దేశీ విమానయాన సంస్థలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. రుణ సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిల్చిపోగా.. తాజాగా చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్న వార్తలు తెరపైకి వచ్చాయి. పనితీరు, వ్యాపార విస్తరణ వ్యూహాలపై వ్యవస్థాపకులు రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్లు సమాచారం. అయితే, గత కొద్ది వారాల్లో తీవ్రత మరింత పెరిగినప్పటికీ, పరిస్థితి లీగల్ కేసుల స్థాయిలో మాత్రం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. విభేదాల పరిష్కారం కోసం ఇరు వర్గాలు న్యాయ సలహా సంస్థల సహాయం తీసుకుంటున్నట్లు వివరించాయి. లీగల్ సేవలందించే సంస్థలు ఖైతాన్ అండ్ కో, జే సాగర్ అండ్ అసోసియేట్స్ ఇందులో తోడ్పడుతున్నాయి. ఇద్దరూ కూడా ఈ సంస్థలకు పాత క్లయింట్లే కావడంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు రెండు సంస్థలూ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండిగో కార్యకలాపాల విస్తరణ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ నిల్చిపోవడంతో చార్జీల ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఇండిగో వివాదం ముదిరితే దేశీ విమానయాన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దూకుడుగా గంగ్వాల్... ఆచితూచి భాటియా 2006లో భాటియా, గంగ్వాల్ కలిసి ఇండిగోను ఏర్పాటు చేశారు. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ పేరుతో దీని మాతృసంస్థ 2013లో స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యింది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో దీనికి 44 శాతం వాటా ఉంది. వ్యవస్థాపకుల్లో ఒకరైన గంగ్వాల్ విషయానికొస్తే.. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, యూఎస్ ఎయిర్వేస్లో ఆయనకు సుదీర్ఘానుభవం ఉంది. దూకుడు వ్యూహాలతో ఇండిగోను ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన సంస్థగా నిలపడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. మేనేజ్‌మెంట్‌లోనూ మార్పులు, చేర్పులతో కంపెనీని ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విస్తరణ ప్రణాళికల విషయంలో వేగంగా దూసుకుపోవాలన్నది గంగ్వాల్ అభిప్రాయం కాగా.. ఆచి తూచి అడుగేయాలని భాటియా భావిస్తారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే రెండేళ్లుగా పలు సందర్భాల్లో ఇరువురి మధ్య విభేదాలు బైటపడ్డాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం కంపెనీలో భాటియాకు 38, గంగ్వాల్‌కు 37 శాతం వాటాలున్నాయి. షేరు పతనం.. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు గురువారం ఏకంగా 9 శాతం దాకా పతనమయ్యాయి. బీఎస్ఈలో 8.82 శాతం నష్టంతో రూ.1,466.60 వద్ద క్లోజయ్యాయి. ఒక దశలో 9.82 శాతం నష్టంతో రూ. 1,450.50కి కూడా షేరు తగ్గింది. అటు ఎన్ఎస్ఈలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేరు 8.40 శాతం తగ్గి రూ. 1,475 వద్ద ముగిసింది. షేరు ధర గణనీయంగా క్షీణించడంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ ఏకంగా రూ.5,456 కోట్లు తగ్గి రూ. 56,377 కోట్లకు పరిమితమైంది. బీఎస్ఈలో 3.70 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తలపై వివరణనివ్వాలంటూ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు బీఎస్ఈ సూచించింది. ప్రణాళికలు యథాతథం: సీఈవో ప్రమోటర్ల మధ్య విభేదాల వార్తల నేపథ్యంలో ఉద్యోగులకు భరోసానిచ్చే క్రమంలో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సీఈవో రొణొజొయ్ దత్తా తమ సిబ్బందికి ఈమెయిల్ పంపారు. కంపెనీ వృద్ధి వ్యూహాలు యథాతథంగానే ఉన్నాయని, వీటి అమలుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి మేనేజ్మెంట్కు పూర్తి మద్దతుందని ఆయన పేర్కొన్నారు. ‘మన ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య విభేదాలు తలెత్తాయన్న ఆరోపణల వార్తల గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే, సంస్థ వృద్ధి వ్యూహాల్లో ఎటువంటి మార్పు లేదని మీకు భరోసా ఇవ్వదల్చుకున్నాను. ప్రణాళికలను అమలు చేయడానికి మేనేజ్మెంట్కు బోర్డు నుంచి పూర్తి మద్దతు కూడా ఉంది‘ అని ఈమెయిల్లో దత్తా పేర్కొన్నారు. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులతో పాటు సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ ప్రయోజనం చేకూర్చడంపైనే ఇకపైనా దృష్టి పెడతామని ఆయన తెలిపారు. -
కేంద్రంతో కలసి నడిపే అవకాశమే లేదు
♦ ఎయిర్ ఇండియాపై ఇండిగో స్పష్టీకరణ ♦ విదేశీ పరమైతే అదో షేక్స్పియర్ విషాదమేనని వ్యాఖ్య ♦ ఎయిరిండియా విదేశీ సేవలపైనే ఆసక్తి ♦ అంతర్జాతీయ రూట్లలో కార్యకలాపాలకు ఉపయోగం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో కలసి ఉమ్మడిగా ఎయిరిండియా నిర్వహణ అన్నది ‘‘చాలా చాలా కష్టమైన ప్రతిపాదన’గా చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ అభిప్రాయపడ్డారు. ఇందుకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. జాతీయ విమానయాన సంస్థ అంతర్జాతీయ ఆస్తులు విదేశీ సంస్థ పాలైతే అది షేక్స్పియర్ విషాదమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో వాటా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, అందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు ఇండిగో కేంద్ర పౌర విమానయాన శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. రూ.52,000 కోట్ల రుణభారంతో సతమతమవుతున్న సంస్థను కొనుగోలు చేయాలని కంపెనీ తీసుకున్న నిర్ణయంపై వాటాదారుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీంతో కంపెనీ సహ వ్యవస్థాపకుడు గంగ్వాల్, మరో సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియాతో కలసి సమావేశం ఏర్పాటు చేసి తమ ప్రతిపాదలపై ఇన్వెస్టర్లు, విశ్లేషకులకు వివరించే ప్రయత్నం చేశారు. ‘‘ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ లేదా ఉమ్మడి భాగస్వామ్యం అన్నది చాలా కష్టమైన ప్రతిపాదన. ఆ దిశగా మేము వెళ్లడం లేదు. ఎయిరిండియాలో ప్రభుత్వం మైనారిటీ లేదా మెజారిటీ వాటా కలిగి ఉండే ప్రతిపాదన మంచిదే కావచ్చు. కానీ, దానికి విలువను తీసుకురాలేం’’ అని గంగ్వాల్ పేర్కొన్నారు. ఇక ఎయిరిండియా అంతర్జాతీయ ట్రాఫిక్‌ను గల్ఫ్ విమానయాన సంస్థలు సొంతం చేసుకోనున్నాయన్న వార్తలపై ఇండిగో ఆందోళనను వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన దేశీయ, అంతర్జాతీయ వియానయాన నెట్వర్క్ ఓ పరాయి దేశం నియంత్రణలోకి వెళ్లడం మన ప్రయోజనాలకు ఏ మాత్రం మంచిది కాదని ఇండిగో పేర్కొంది. రుణభారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియా కార్యకలాపాలు మొత్తం కొనుగోలు చేయాలని భావించడం లేదని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా.. గురువారం ఇన్వెస్టర్లకు వివరించారు. విదేశీ రూట్లలోనూ విస్తరించడం కోసం తాము కేవలం ఎయిరిండియా విదేశీ కార్యకలాపాలు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొనుగోలు చేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎయిరిండియా కొనుగోలు వల్ల తమకు విదేశీ మార్కెట్లలోకి కూడా చొచ్చుకుపోయేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఎయిరిండియా విదేశీ కార్యకలాపాలను కొనుగోలు చేసిన పక్షంలో తమదైన చౌక చార్జీల మోడల్లోనే నిర్వహణ ఉంటుందని భాటియా చెప్పారు. ఎయిరిండియా కొనుగోలు ద్వారా అంతర్జాతీయంగా తాము ఇప్పటిదాకా ప్రవేశించని కొత్త రూట్లు అందుబాటులోకి వస్తాయని, అంతర్జాతీయ విభాగం ఆదాయాలూ పెరుగుతాయని భాటియా చెప్పారు. ప్రస్తుతం ఇండిగో.. ఆసియాలో 7 ప్రాంతాలకే సర్వీసులు నడిపిస్తోంది. 41 విదేశీ రూట్లలో సర్వీసులు.. ఎయిరిండియాలో వాటాల విక్రయ ప్రతిపాదనపై కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా వాటిని కొనుగోలు చేయడంపై ఇండిగో ఒక్కటే అధికారికంగా ప్రభుత్వాన్ని సంప్రదించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా కొనుగోలుపై టాటా గ్రూప్ కూడా ఆసక్తిగా ఉంది. ఎయిరిండియా అంతర్జాతీయంగా నాలుగు ఖండాల్లోని 41 ప్రాంతాలకు సర్వీసులు (ప్రారంభం కావాల్సిన నాలుగు రూట్లు కలిపి) నిర్వహిస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో ఎయిరిండియా వాటా దశాబ్దం క్రితం 35 శాతంగా ఉండగా.. ఇప్పుడు 14 శాతానికి పడిపోయింది. 40 శాతం వాటాతో ఇండిగో అగ్రస్థానంలో, 16 శాతం వాటాతో జెట్ ఎయిర్వేస్ రెండో స్థానంలో ఉండగా.. ఎయిరిండియా మూడో స్థానంలో ఉంది. సుదీర్ఘ విదేశీ రూట్లలోనూ ’చౌక’ విమానాలు.. ఎయిరిండియా కొనుగోలు ప్రతిపాదన అనుకున్న విధంగా జరిగినా, జరగకపోయినా.. సుదీర్ఘ ప్రయాణాలుండే అంతర్జాతీయ రూట్లలో సైతం చౌక చార్జీల విమానయాన సేవలను ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్ తెలిపారు. లాభదాయకతపరంగా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఎయిరిండియాను వేర్వేరు విభాగాలుగా కాకుండా పూర్తిగా విక్రయించాలని ప్రభుత్వం భావించినా ఆసక్తికరంగానే ఉండగలదని భాటియా అభిప్రాయపడ్డారు. ఎయిరిండియా కొనుగోలులో అనేక సవాళ్లు, సంక్లిష్టమైన అంశాలూ ఉన్నాయని.. వీటన్నింటినీ అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.