న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణ లోపభూయిష్టంగా ఉంటోందంటూ కంపెనీ సహ ప్రమోటరు రాకేశ్ గంగ్వాల్ చేసిన తీవ్ర ఆరోపణలపై ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, అటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించాయి. ఒకవేళ ఆరోపణలు వాస్తవమేనని రుజువైన పక్షంలో కంపెనీ ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నియంత్రణ సంస్థల నిబంధనలను ఉల్లంఘించేలా ఇండిగో విర్వహణ పాన్‌షాపు కన్నా అధ్వానంగా మారిందని, మరో ప్రమోటరు రాహుల్ భాటియా తాను లబ్ధి పొందేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ గంగ్వాల్ సెబీకి, కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇందులోని ప్రస్తావించిన ఆరోపణలకు పేరాల వారీగా వివరణనివ్వాలంటూ కంపెనీని కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో గంగ్వాల్ గ్రూప్‌నకు 37 శాతం, భాటియా గ్రూప్‌నకు 38 శాతం వాటాలు ఉన్నాయి.
గంగ్వాల్ రిస్కులు లేకుండా జాగ్రత్తపడ్డారు: భాటియా గ్రూప్
గంగ్వాల్ ఆరోపణలపై భాటియా గ్రూప్ (ఐజీఈ) తాజాగా మరో ప్రకటన చేసింది. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత ఇద్దరిపైనా సమానంగా ఉన్నప్పటికీ గంగ్వాల్ మాత్రం తనకు రిస్కులు తక్కువగా ఉండేలా చూసుకున్నారని పేర్కొంది. భాటియా, ఆయన తండ్రి కపిల్ భాటియా దాదాపు రూ. 1,100 కోట్ల దాకా సొంత పూచీకత్తునిచ్చారని, గంగ్వాల్ మాత్రం ఈక్విటీ రిస్కులు రూ. 15 కోట్లు కూడా మించకుండా జాగ్రత్తపడ్డారని ఐజీఈ పేర్కొంది. తన బాధ్యతలు సరిగ్గా పాటించని వ్యక్తి ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపించిందంటూ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment